బడుగు జీవులపై ‘బయో’ పిడుగు!

ABN , First Publish Date - 2022-09-26T07:47:55+05:30 IST

అసలే చాలీచాలని జీతాలు. ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఇంట్లో ఇద్దరూ కష్టపడితే తప్ప బతుకు బండి నడవడం కష్టం. జీతాలతో పాటు ప్రభుత్వం అందించే పథకాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

బడుగు జీవులపై ‘బయో’ పిడుగు!

శానిటేషన్‌ వర్కర్లకు హాజరు నిబంధన

ఆరోగ్య శాఖ అనాలోచిత నిర్ణయం               

14 వేలమంది ఉద్యోగులకు ఇక్కట్లు 

ప్రభుత్వ పథకాలు దూరమయ్యే దుస్థితి

ఆధార్‌తో లింక్‌ కానున్న బయోమెట్రిక్‌ 

నష్టపోతామంటున్న ఉద్యోగులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అసలే చాలీచాలని జీతాలు. ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఇంట్లో ఇద్దరూ కష్టపడితే తప్ప బతుకు బండి నడవడం కష్టం. జీతాలతో పాటు ప్రభుత్వం అందించే పథకాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్‌, సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న 14 వేల మంది సిబ్బంది పరిస్థితి ఇది. ఆరోగ్య శాఖ అనాలోచిత నిర్ణయంతో వీరందరూ ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే పరిస్థితి వస్తోంది. శానిటేషన్‌ వర్కర్లు, సెక్యూరిటీ సిబ్బందికి బయో మెట్రిక్‌ హాజరు అమలు చేయాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. బయో మెట్రిక్‌ హాజరు అమలు చేసి, దానిని ఆధార్‌తో లింక్‌ చేస్తే వీరంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న వారిగా గుర్తింపు వస్తుంది.


ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న వారెవరికీ పథకాలు అందడం లేదు. ఇప్పటికే ఆరోగ్య మిత్రలు, అంగన్‌వాడీ టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బందికి కూడా అదే పరిస్థితి వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌లో విధులు నిర్వహిస్తున్న 14 వేల మంది శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది వివరాలను ఆరోగ్య శాఖ సేకరించింది. మరో రెండు మూడు ఆస్పత్రుల ఉద్యోగుల నుంచి ఆధార్‌ కార్డులు వస్తే చాలు... బయో మెట్రిక్‌ హాజరు అమలు చేస్తారు. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా... అధికారులు మాత్రం బయో మెట్రిక్‌ తప్పనిసరిగా అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ జీతాలు పెంచారని... ఇప్పుడు బయో మెట్రిక్‌ హాజరుతో తమ పొట్టకొట్టాలని చూస్తున్నారని శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వర్క్‌ కాంట్రాక్టు కింద విధులు: ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్‌, సెక్యూరిటీ విధులు నిర్వహించడానికి  ప్రభుత్వం వర్క్‌ కాంట్రాక్టు కింద టెండర్లు పిలిచి కాంట్రాక్టు సంస్థలకు అప్పగించింది. కాంట్రాక్ట్‌ సంస్థలు నియమించుకున్న సిబ్బందికి, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆస్పత్రుల్లో పరిశుభ్రత ఉందా? లేదా? అని మాత్రమే ప్రభుత్వం చూసుకోవాలి. కానీ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మాత్రం కాంట్రాక్టు  సిబ్బందికి కూడా బయో మెట్రిక్‌ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


తప్పు ఒకరిది.. ఇక్కట్లు సిబ్బందికి: తిరుపతిలో ఒక ప్రముఖ ఆస్పత్రిలో శానిటేషన్‌ పనులు నిర్వహించే ఒక కాంట్రాక్టు సంస్థ నిబంధనల ప్రకారం సిబ్బందిని నియమించుకోలేదన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. తక్కువ సిబ్బందితోనే పనులు చేయిస్తున్నారని తెలిసింది. దీనిని కట్టడి చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా బయో మెట్రిక్‌ హాజరు అమలు చేయాలని నిర్ణయించారు. ఒక కాంట్రాక్టు సంస్థ తప్పు చేస్తే టెండర్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉన్నతాధికారులకు ఉంది. ఆ సంస్థను తొలగించే అధికారం కూడా ఉంది. అయితే, ఈ పని చేయకుండా 14 వేల మంది సిబ్బందిని ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 


ఆందోళన దిశగా..

బయో మెట్రిక్‌ హాజరు విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే కాంట్రాక్టు సంస్థలతో కలసి కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. 

Updated Date - 2022-09-26T07:47:55+05:30 IST