వివాదంలో ఏయూ భద్రతాధికారి పోస్టు

ABN , First Publish Date - 2021-07-26T06:05:27+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో..

వివాదంలో ఏయూ భద్రతాధికారి పోస్టు
ఏయూ భద్రతాధికారి మహమ్మద్‌ ఖాన్‌(ఫైల్‌)

అధికార నేతల ఒత్తిళ్లతో కొత్త పోస్టు సృష్టించినట్టు ఆరోపణలు

రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి ఖాన్‌ నియామకం

నెలకు రూ.75 వేల జీతం, టీఏ కింద మరో రూ.20 వేలు

ఆయన సిఫారసుతో 13 మంది సెక్యూరిటీ గార్డుల నియామకం

ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేలు చెల్లింపు

ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి ఇస్తున్నది రూ.7 వేలే!

వర్సిటీపై ఏటా రూ.50 లక్షల ఆర్థిక భారం

గైడ్‌లైన్స్‌ ప్రకారమే నియమించామంటున్న రిజిస్ర్టార్‌


విశాఖపట్నం/మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గో హత్యకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన భద్రతాధికారి మహమ్మద్‌ ఖాన్‌ నియామకం వివాదాస్పదంగా మారింది. పోలీస్‌ శాఖలో ఏడీసీపీ స్థాయిలో ఉద్యోగ విరమణ చేసిన ఆయనకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఏయూలో ఉద్యోగం కల్పించడానికే కొత్తగా భద్రతాధికారి పోస్టును సృష్టించారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సెక్యూరిటీ వ్యవహారాలను సీనియర్‌ ప్రొఫెసర్‌ లేదా డీన్‌ పర్యవేక్షించేవారు. ఇప్పుడు కొత్తగా ప్రధాన భద్రతాధికారిని నియమించి, నెలకు రూ.75 వేల వేతనంతోపాటు రవాణా భత్యం(టీఏ) కింద రూ.20 వేలు చెల్లిస్తున్నారు. అంతేకాక మహమ్మద్‌ ఖాన్‌ కొత్తగా 13 మందిని కొత్తగా సెక్యూరిటీ గార్డులుగా నియమించుకున్నారు. చాలా కాలం నుంచి ఏయూలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న తమకు ఏడు వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తుండగా, కొత్తగా నియమించుకున్న వారికి మాత్రం రూ.18 వేల చొప్పున చెల్లిస్తున్నారని సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు. తమకు కనీసం వెయ్యి రూపాయలైనా పెంచాలని అధికారులకు కోరుతున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.


భద్రతాధికారి సేవలో ఆ 13 మంది...

యూనివర్సిటీలోని వివిధ ప్రదేశాల్లో సుమారు 250 మంది వరకు గార్డులు విధులు నిర్వహిస్తుంటారు. భద్రతా అధికారి ఖాన్‌ నియమించిన సెక్యూరిటీ గార్డులు మాత్రం ఆయన కార్యాలయం వద్ద తప్ప మరెక్కడా విధులు నిర్వహించడంలేదట! భద్రతాధికారి ఖాన్‌తోపాటు ఆయన నియమించుకున్న సెక్యూరిటీ గార్డులకు ఏటా యూనివర్సిటీ ఖజానా నుంచి రూ.50 లక్షల వరకు చెల్లిస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. నిధుల లేమితో ఏయూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే వుండగా, ఇటువంటి తరుణంలో కొత్తగా భద్రతాధికారిని, మరో 13 మంది సెక్యూరిటీ గార్డులను నియమించి, వారికి ఏటా అర కోటి రూపాయల మేర జీతాల రూపంలో చెల్లించడాన్ని ఏయూకి చెందిన పలువురు అధ్యాపకులు తప్పుబడుతున్నారు. అంతేకాకుండా భద్రతాధికారి ఖాన్‌ పోలీస్‌ శాఖలో పెత్తనం చెలాయించనట్టే ఏయూలో కూడా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. 


గైడ్‌లైన్స్‌ ప్రకారమే నియామకం

ఏయూలో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి గైడ్‌లైన్స్‌ ప్రకారమే నియమించాం. రిటైర్డ్‌ డీఎస్సీ స్థాయి అధికారిని చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించాలని పేర్కొంది. సదరు అధికారికి రూ.75 వేల చొప్పున వేతనం చెల్లించడానికి ‘రూసా’లో వెసులుబాటు వుంది.  యూనివర్సిటీలో భవన నిర్మాణ పనులు ఎక్కువగా జరుగుతున్నాయి.  మెటీరియల్‌ చోరీ అవుతున్న నేపథ్యంలో.. రాత్రిపూట రౌండ్లు వేసేందుకు అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ కావాలని కోరితే.. నియమించాం. అలాగే రాత్రిపూట పెట్రోలింగ్‌ నిర్వహించడానికి మరో 11 మందిని నియమించాం. పోలీస్‌ కమిషనర్‌ సుమారు 500 మంది కమ్యూనిటీ గార్డులను ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో తీసుకోగా, సీపీకి లేఖరాసి, వారిలో 11 మందిని ఏయూకి తీసుకున్నాం. పోలీస్‌ శాఖ చెల్లిస్తున్నట్టుగానే రూ.18 వేల చొప్పున జీతం ఇస్తున్నాం. వీరు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తారు. 

- ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌, ఏయూ రిజిస్ర్టార్‌


Updated Date - 2021-07-26T06:05:27+05:30 IST