గో హత్యపై ఏయూ ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2021-07-27T05:46:36+05:30 IST

గో హత్య ఘటన ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

గో హత్యపై ఏయూ ఉక్కిరిబిక్కిరి

బీజేపీ, జనసేన, వీహెచ్‌పీ ఆందోళనలతో పాలకులపై పెరుగుతున్న ఒత్తిడి

ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన వీసీ

సమగ్ర విచారణకు మరో మూడు రోజులు గడువు కోరిన కమిటీ

వీసీ కార్యాలయం వద్ద వీహెచ్‌పీ కార్యకర్తల నిరసన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


గో హత్య ఘటన ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపై జనసేన, బీజేపీ, పలు హిందూ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతోపాటు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు...ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు శనివారం కమిటీని నియమించారు. యూనివర్సిటీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శ్రీపాద సుమిత్ర సారథ్యంలోని ఐదుగురు సభ్యుల కమిటీ రెండు రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే, లోతుగా విచారణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కమిటీ  అదనంగా మరో మూడు రోజులు గడువు కోరింది. ఇందుకు సంబంధించి నలుగురిని విచారించేందుకు కమిటీ సభ్యులు సిద్ధమవుతన్నారు. వీరిలో ఒకరు గోవు యజమాని. అదేవిధంగా ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనివర్సిటీ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఖాన్‌ను కమిటీ సభ్యులు మంగళవారం విచారించనున్నారు. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది ఆధీనంలో గోవు వున్న సమయంలో వైద్యం అందించేందుకు యజమాని ఒక వైద్యుడిని తీసుకువచ్చారు. ఆయన ఇంజక్షన్‌ ఇవ్వడంతోపాటు సెలైన్‌ ఎక్కించినట్టు తెలిసింది. ఆవు ఏ సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించి మందులు ఇచ్చారు?, మరణానికి గల కారణాలు ఏమిటి?...తెలుసుకునేందుకు సదరు వైద్యుడితో మాట్లాడాలని అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా యూనివర్సిటీలోకి వచ్చిన ఆవును బంధించిన వాచ్‌మన్‌ను కూడా కమిటీ సభ్యులు విచారించనున్నారు. పూర్తి విచారణ అనంతరం వైస్‌ చాన్సలర్‌కు కమిటీ సభ్యులు నివేదిక సమర్పిస్తారని, దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు.తప్పు చేసినట్టు తేలితే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని రిజిస్ర్టార్‌ స్పష్టంచేశారు. 


వీసీ చాంబర్‌ వద్ద ఆందోళన


ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ నెల 21న గోవును ఉద్దేశపూర్వకంగా బంధించి చంపి ఖననం చేసిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయడంతోపాటు అందుకు కారకుడైన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ, భజరంగ్‌దళ్‌, హిందూ ధార్మిక సంఘాలు సోమవారం వీసీ చాంబర్‌ ఎదుట ఆందోళన చేశాయి. ఆందోళనకారులను వీసీ తన ఛాంబర్‌లోకి పిలిపించి చర్చలు జరిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, కమిటీ నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ ధార్మిక విభాగం కన్వీనర్‌ విజయ్‌శంకర్‌ ఫణి, ధనుంజయ్‌, జగదీష్‌, గోపాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 


గోవు హత్యపై ఆందోళన

ఏయూ భద్రతాధికారిపై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్‌

మద్దిలపాలెం, జూలై 26: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో గోవును కొట్టి చంపిన భద్రతాధికారి ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ డిమాండ్‌ చేశారు. గోవు ఆత్మకు శాంతి కలగాలంటూ సోమవారం ఆయన మద్దిలపాలెంలోని ఏయూ అవుట్‌ గేటు వద్ద రాధాకృష్ణుల విగ్రహాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా భావించే గోవును ఏయూ భద్రతాఽదికారి ఆధ్వర్యంలో హత్య చేసి రహస్యంగా ఖననం చేయడం దారుణమన్నారు. ఖాన్‌ బృందం అరాచకాలపై గో పోషకులు నిరసన తెలుపుతున్నా ఏయూ యాజమాన్యం ఆయనపై చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ వేసి కాలయాపన చేయడం సరికాదని, వెంటనే ఖాన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఏయూ మైదానంలో గోవును పాతిపెడుతున్న ఖాన్‌, అతని బృందం వీడియోలను బహిర్గతం చేశారు.

పోలీసులకు ఆవు యజమాని ఫిర్యాదు

ఇదిలావుండగా గోవు యజమాని లొడగల వెంకటరావు సోమవారం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న పొరపాటున తన ఆవు ఏయూలోకి వెళగా అక్కడ సెక్యూరిటీ గార్డులు నిర్బంధించినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.వెయ్యి డీడీ తీసి రిజిస్ర్టార్‌ కార్యాలయంలో చెల్లించినట్టు రశీదు చూపించినా గార్డులు ఆవును విడిచిపెట్టలేదని, భద్రతాధికారి ఖాన్‌ రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేశారని ఆరోపించారు. లంచం ఇచ్చేందుకు నగదు లేదనడంతో గోవును హత్య చేసి ఖననం చేశారన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై సీఐ ఈశ్వరరావును వివరణ కోరగా గోవు హత్యపై ఫిర్యాదు చేశారని విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  చెప్పారు.

Updated Date - 2021-07-27T05:46:36+05:30 IST