అనుమతించిన లే అవుట్లను ఆడిట్‌ చేయండి

ABN , First Publish Date - 2021-07-30T04:10:18+05:30 IST

పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో 2014 సంవత్సరం తర్వాత అనుమతించిన లే అవుట్ల ఆడిట్‌ నిర్వహణ చేపట్టాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.

అనుమతించిన లే అవుట్లను ఆడిట్‌ చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌ రూరల్‌, జూలై 29 : పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో 2014 సంవత్సరం తర్వాత అనుమతించిన లే అవుట్ల ఆడిట్‌ నిర్వహణ చేపట్టాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లే అవుట్లలో 10 శాతం ఓపెన్‌ స్పేస్‌ స్థానిక, పట్టణ సంస్థ పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని, 10 శాతం కంటే తక్కువ గల లే అవుట్‌ ఉంటే ఒరిజినల్‌ డెవలపర్‌ నుంచి ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం పెనాల్టీ విధించాలని సూచించారు. డీటీసీపీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పెండింగ్‌ లేకుండా నిర్ణీత సమయంలో అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. మున్సిపాలిటీలలో అనుమతులు లేకుండా అక్రమంగా గృహాలు నిర్మిస్తున్నా.. అనుమతికి మించి అదనంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు జారీచేయడంతో పాటు వాటిని కూల్చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌కు సూచించారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఉన్న స్థిర, చరాస్తుల జాబితా అందజేయాల్సిందిగా కలెక్టర్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమసింగ్‌, డీపీవో తరుణ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, మోహన్‌, ఆశ్రితకుమార్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అలాగే కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ చేపట్టాలని కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను శాస్ర్తీయ పద్ధతిలో రీ సైకిల్‌ చేయాల్సిందిగా మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. వైద్యశాల నుంచి వచ్చే బయో వ్యర్థాలను మున్సిపల్‌ వ్యర్థాలతో కలపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్లు బయో వ్యర్థాలను బయట పడేయకుండా చూడాలని, లేకపోతే కేసులు పెడతామని హెచ్చరించాలని డీఎంహెచ్‌వోగాకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమసింగ్‌, డీఎస్పీ కృష్ణమూర్తి, కాలుష్య నియంత్రణ మండల ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ రవికుమార్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, మైనింగ్‌ ఏడీ జయరాజ్‌, జిల్లా పరిశ్రమల కేంద్ర మేనేజర్‌ కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

ఆగస్టు 4లోగా వైకుంఠధామాలు పూర్తిచేయాలి

వైకుంఠధామాల నిర్మాణాలను ఆగస్టు 4లోగా పూర్తి చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హరీశ్‌ అధికారులను హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇటీవవల భూమి గుర్తించి అప్పగించిన 7 వైకుంఠధామాలు మినహా మిగతావన్నీ ఆగస్టు 4లోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలన్నారు. 

జిల్లా కలెక్టర్‌ను కలిసిన స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌

మెదక్‌ జిల్లా స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ కలెక్టర్‌ హరీశ్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు జుబేర్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు శివశంకర్‌రావు, ప్రధాన కార్యదర్శి నందిని శ్రీను, మాఽధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:10:18+05:30 IST