ఆడిట్‌ దడ

ABN , First Publish Date - 2022-09-17T05:56:02+05:30 IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమార్కులకు ఆడిట్‌ దడ పట్టుకుంది. మరో వారం రోజుల్లో జనరల్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఆడిట్‌ దడ

ఆడిట్‌ దడ

వారంలో జనరల్‌ ఆడిట్‌

స్టాంపులు, రిజ్రిస్టేషన్ల శాఖలో హీట్‌

భాగ పరిష్కారం, లీజ్‌ డీడ్‌లలో అక్రమాలు..? 

స్టాంప్‌ డ్యూటీ ఎగవేతలపైనే ప్రధాన దృష్టి


అనంతపురం క్రైం: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమార్కులకు ఆడిట్‌ దడ పట్టుకుంది. మరో వారం రోజుల్లో జనరల్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రిజిస్టేషన కార్యాలయాల్లో ఆర్థిక లావాదేవీల లెక్కలను తేల్చనున్నారు. ఆస్తుల రిజిస్ర్టేషన అధికారం సబ్‌ రిజిస్ర్టార్లకు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం సమకూర్చే ఈ శాఖలో అక్రమాలు కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి. ప్రభుత్వానికి ఆదాయానికి గండికొట్టి, ఆస్తుల విలువను తక్కువ చూపించి, ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. ఇలాంటి వాటిపై ఆడిట్‌ అధికారులు దృష్టిసారించనున్నట్లు తెలిసింది. దీంతో అక్రమాలకు పాల్పడిన సబ్‌ రిజిస్ర్టార్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సమాచారం. చుక్కల భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మొదలుకొని.. ఒకరి పేరిట ఉన్న ప్రైవేట్‌ భూమిని మరొకరి పేరిట రిజిస్ర్టేషన చేసిన సబ్‌ రిజిస్ర్టార్లు ఎందరో ఉన్నారు. ఆ శాఖలోని లొసుగులు, సిఫార్సులు ద్వారా బయటపడిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి జనరల్‌ ఆడిట్‌ మీదే పడింది. ఆ విభాగం అధికారులు రిజిస్ర్టేషన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. ఏ అధికారి ఎంత తిన్నాడనేది లెక్క తేల్చలేకపోయినా.. అక్రమాలను మాత్రం బయటకు తీస్తారు. ఆడిటింగ్‌కి ముఖ్యమైన అంశాలనే పరిగణలోకి తీసుకుంటారు. భాగ పరిష్కారం, లీజ్‌ డీడ్‌లపైనే వీరు ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం. అందులో స్టాంప్‌ డ్యూటీ ఎంత తీసుకున్నారనేదే కీలకంగా మారనుంది. వీటితో పాటు క్లిష్టమైన అంశాలను సబ్జెక్టులవారిగా పరిశీలిస్తారని తెలిసింది. 


లీజ్‌ డీడ్‌లోనూ అక్రమాలు

ఆడిట్‌ తనిఖీల్లో లీజ్‌ డీడ్‌ కూడా కీలకమైనదే. జిల్లా, మండల కేంద్రాల సమీప ప్రాంతాలలో సెంటు మొదలు ఎకరాల వరకు  స్థలాలను లీజుకు తీసుకుంటారు. లీజ్‌ డీడ్‌లో ఐదేళ్లు, పదేళ్ల మొదలుకొని 99 ఏళ్ల వరకు ఉంటాయి. ఇక్కడే మతలబు జరుగుతుంటుంది. స్టాంప్‌ డ్యూటీ వసూలులో అక్రమాలకు పాల్పడుతుంటారు. లీజ్‌కు తీసుకున్నవారు అడ్వాన్స ఇస్తే ఒకలా.. ఇవ్వకపోతే మరోలా స్టాంప్‌ డ్యూటీ ఉంటుంది. మూడేళ్లకోసారి లీజ్‌ పెంచితే ఇంకోలా ఉంటుంది. కొన్నింటికి జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. వీటిలో ఎన్నింటికి ఎగనామం పెట్టారు...? ఎన్నింటికి సరైన స్టాంప్‌డ్యూటీ చెల్లించారు...? ఎన్నింటికి డ్యూటీ తగ్గించారు..? అనేది ప్రధానం. ఆడిట్‌ తనిఖీల్లో ఇవన్నీ ఎవరెవరు చేశారనేది నిగ్గుతేలే అవకాశం ఉంది. దీంతో ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో టెన్షన ఆరంభమైంది. ఆ శాఖలో చెప్పుకునే టఫ్‌ డాక్యుమెంట్స్‌ (మిస్‌లీనియస్‌) విషయంలోనూ ఆడిట్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. లీజ్‌ డీడ్‌ కింద ఇష్టారాజ్యంగా రిజిస్ర్టేషన చేసి, వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.  ఒప్పుదల విషయంలో ర్యాటిఫికేషన కింద లోపాయికారిగా ముడుపులు పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది. 


భాగ పరిష్కారంపైనే..?

జనరల్‌ ఆడిట్‌ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టనుండటంతో రిజిస్ట్రేషన్ల శాఖలో ఆందోళన మొదలైంది. భాగపరిష్కారం, లీజ్‌ డీడ్‌లలో ఎక్కువ అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. గతంలో ఓ అధికారి, బుక్కరాయసముద్రంలో భాగ పరిష్కారం విషయంలో రూ.6.50 లక్షలు సొమ్ము చేసుకున్నారు. మరో నెలలో డిస్ర్టిక్ట్‌ రిజిస్ర్టార్‌ (డీఆర్‌)గా ఉద్యోగోన్నతి పొందాల్సిన సమయంలో ఆయన అక్రమాలు బయట పడటంతో చర్యలు తీసుకున్నారు. దీంతో డీఆర్‌ పోస్టు కోసం మరికొంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యవహారాలు చాలానే జరిగాయని సమాచారం. అన్నదమ్ములు, రక్తసంబంధీకులు, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఆస్తుల భాగ పరిష్కారం (కుటుంబ విభాగ పరిష్కారం) చేయాలనే నిబంధన ఉంది. కానీ కొందరు  సబ్‌ రిజిస్ర్టార్లు దూరపు బంధుత్వాలకు కూడా భాగ పరిష్కారాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భాగ పరిష్కారాలకు స్టాంప్‌డ్యూటీ ఒకశాతం మాత్రమే ఉంటుంది. ఇతరులకు 3 నుంచి 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. రూ.3 లక్షలు చెల్లించాల్సిన చోట.. రూ.50 వేలు మాత్రమే రిజిస్ర్టేషన్ల శాఖకు చెల్లించి, అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. రూ.లక్షల నుంచి రూ.కోట్లలో జరిగే ఆస్తుల లావాదేవీల్లో భారీగా స్టాంప్‌ డ్యూటీ ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల వెనుక సబ్‌ రిజిసా్ట్రర్ల పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఆడిట్‌లో అవి బయట పడితే చర్యలు తప్పవని అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. 


రిమార్క్స్‌ రాస్తారా...?

చుక్కల భూములను ఆడిట్‌ అధికారులు తనిఖీ చేస్తారని తెలిసింది. ప్రధానంగా 08 భూములపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఆ భూముల్లో ఎవరు ఏం చేశారనేది ఆడిట్‌ అధికారులు గుర్తించి, రిమార్క్స్‌ రాస్తారనే భయం కొందరికి పట్టుకుంది. అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కొవిడ్‌కు ముందు ఆడిట్‌ జనరల్‌ జరిగిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2017లో చివరిసారిగా అనంతపురం రామ్‌నగర్‌లోని కార్యాలయంలో తనిఖీలు జరిగినట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరేడు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో తనిఖీలు జరగనున్నట్లు సమాచారం. ఇందులో ఎవరె వరి బండారం బయటపడనుందో వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-09-17T05:56:02+05:30 IST