అల్లుడి చేతిలో అత్త హతం

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

అల్లుడి చేతిలో ఓ అత్త హతమైంది. రోకలిబండతో తలపై మోది హతమార్చాడు. గొడవలో భాగంగా కుమార్తెకు అడ్డువెళ్లి హత్యకు గురైంది.

అల్లుడి చేతిలో అత్త హతం
హత్యకు గురైన యశోద

రోకలిబండతో తలపైమోది హత్యచేసిన వైనం

కుమార్తెకు అడ్డువెళ్లి హతమైన అత్త

పోలీసుల అదుపులో నిందితుడు


మదనపల్లె క్రైం, మే 20: అల్లుడి చేతిలో ఓ అత్త హతమైంది. రోకలిబండతో తలపై మోది హతమార్చాడు. గొడవలో భాగంగా కుమార్తెకు అడ్డువెళ్లి హత్యకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు..నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లెకు చెందిన ఇడగొట్టి రెడ్డెప్ప 25 ఏళ్ల కిందట తంబళ్లపల్లెకు చెందిన యశోద(48)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక్కగానొక కుమా ర్తె బేబీ అరుణ ఉంది. కాగా రెడ్డెప్ప కొంతకాలం తరువాత భార్యను వదిలేసి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత యశోద కుమార్తెతో కలసి ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వలసొచ్చింది. పట్టణంలోని ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని స్థానిక చిత్తూరు బస్టాండులో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తోంది. ఇదిలా వుండగా ఆరేళ్ల కిందట తిరుపతికి చెందిన నాగేంద్రతో కుమార్తె వివాహం జరిపించింది. ఈక్రమంలో బేబీ అరుణకు ఐదేళ్ల కుమార్తె తేజశ్రీ ఉంది. ఆ తరువాత అరుణను భర్త వదిలేయడంతో మూడేళ్ల కిందట తంబళ్లపల్లె మండలం వడ్డిపల్లెకు చెందిన మహే్‌షకు ఇచ్చి రెండో వివాహం చేసింది. ఈనేపథ్యంలో మహేష్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండేవాడు. అయితే ఆరునెలల కిందట దంపతులకు కాపురంలో మనస్పర్థలు రావడంతో బేబీఅరుణ అలిగి పుట్టింటికి వచ్చేసింది. అనంతరం తిరిగి కాపురానికి వెళ్లకుండా మదనపల్లెలోనే ఉంటోంది. అయితే బేబీఅరుణ కాపురానికి వెళ్లకపోవడంతో కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో యశోద ఇటీవల అల్లుడికి తెలియకుండా కాపురాన్ని సీటీఎంరోడ్డుకు మార్చింది. ఎవరెన్ని చెప్పినా ఆమె కాపురానికి వెళ్లకపోవడంతో శుక్రవారం అత్తారింటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దంపతుల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన మహేష్‌ ఇంట్లోని రోకలిబండతో భార్యపై దాడి చేస్తుండగా, గమనించిన యశోద తన కుమార్తెకు అడ్డువెళ్లింది.   మహేష్‌ కోపంతో అత్తను పక్కకునెట్టేయడంతో ఆమె కిందపడిపోయింది. అనంతరం చేతిలోని రోకలిబండతో అత్త తలపై మోది హత్య చేశాడు. అలాగే తలుపుకు గడియ పెట్టి అదే రోకలిబండతో భార్యను కూడా హత్య చేయాలని చూశాడు. అయితే బేబీ అరుణ బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు కనుగొని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రమోహన్‌లు హుటాహుటీనా సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే మృతదేహాన్ని పరిశీలించి, ఘటనపై బేబీ అరుణను, స్థానికులను విచారించారు. కాగా కాపురానికి వెళ్లలేదనే కోపంతో తనతో గొడవ పెట్టుకుని అడ్డొచ్చిన తన తల్లిని రోకలిబండతో మోది హత్య చేశాడంటూ అరుణ పోలీసులకు చెప్పింది. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో విషాదం అలుముకుంది. యశోద మృతితో బేబీఅరుణ, ఆమె కుమార్తె తేజశ్రీలు అనాథలయ్యారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

 

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST