9999 డిసెంబర్ 31 వరకూ నువ్వు ఇక్కడే ఉండాలి.. విడాకుల కేసులో కోర్టు సంచలన తీర్పు!

ABN , First Publish Date - 2021-12-25T02:38:18+05:30 IST

‘9999వ సంవత్సరం డిసెంబర్ 31 వరకూ నువ్వు ఈ దేశాన్ని విడిచి వెళ్లేందుకు వీలు లేదు..!’ కొన్నేళ్ల క్రితం ఇజ్రాయెల్‌లోని ఓ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇచ్చింది.

9999 డిసెంబర్ 31 వరకూ నువ్వు ఇక్కడే ఉండాలి.. విడాకుల కేసులో కోర్టు సంచలన తీర్పు!

ఇంటర్నెట్ డెస్క్: ‘9999వ సంవత్సరం డిసెంబర్ 31 వరకూ నువ్వు ఈ దేశాన్ని విడిచి వెళ్లకూడదు’.. కొన్నేళ్ల క్రితం ఇజ్రాయెల్‌లోని ఓ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇది. విడాకుల కేసు విచారణ సందర్భంగా ఆస్ట్రేలియా జాతీయుడు హూపర్ట్ 8 వేల ఏళ్ల పాటు ఇజ్రాయెల్‌లోని ఉండాలంటూ ఆదేశించింది. సొంత దేశానికి వెళ్లాలనుకుంటే మాత్రం ముందుగా తన పిల్లల బాగోగుల కోసం మాజీ భార్యకు 3 మిలియన్ డాలర్లు చెల్లించాలని సూచించింది. కోర్టు తీర్పు ప్రకారం.. ఆ మొత్తం చెల్లించే వరకూ హూపర్ట్ ఇజ్రాయెల్‌లోనే మగ్గిపోవాల్సి ఉంటుంది.  ఇది 2013లో వెలువరించిన తీర్పు కాగా.. బాధితుడు హూపర్ట్ తాజాగా తన ఆవేదనను అంతర్జాతీయ మీడియా ముందు వెళ్లబోసుకున్నాడు. విడాకుల విషయంలో ఇజ్రాయెల్‌లో అమలవుతున్న ఈ కర్కశ చట్టానికి తన లాంటి వాళ్లు ఎందరో బలైపోయారని వాపోయాడు. తనలాంటి వారి అవస్థల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను మీడియా ముందుకు వచ్చినట్టు తెలిపాడు. 


2011లో హూపర్ట్ దంపతుల మధ్య పొరపొచ్చాలు రావడంతో భార్య తమ ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇజ్రాయెల్‌కు వచ్చేసింది. అనంతరం విడాకుల కోసం కోర్టులో కేసు వేసింది. అయితే.. కన్నబిడ్డలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో హూపర్ట్ 2012లో ఇజ్రాయెల్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే స్థానిక కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. అక్కడి విడాకుల చట్టాల ప్రకారం.. భార్యాభర్తలు విడిపోయాక పిల్లల బాగోగుల కోసం తండ్రి డబ్బు చెల్లించేంత వరకూ అతడు దేశం విడిచివెళ్లకుండా చూడాలని కోరే హక్కు ఇజ్రాయల్ మహిళలకు ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-25T02:38:18+05:30 IST