Australia Immigration: ఆస్ట్రేలియాలో సెటిలవుదామనుకుంటున్నారా.. మీకో బంపర్ ఆఫర్..!

ABN , First Publish Date - 2022-09-02T21:53:02+05:30 IST

కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా(Australia) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం అదనంగా 1.6 లక్షల మంది విదేశీయులకు దేశంలో శాశ్వత నివాసార్హత కల్పించేందుకు నిర్ణయించింది.

Australia Immigration: ఆస్ట్రేలియాలో సెటిలవుదామనుకుంటున్నారా.. మీకో బంపర్ ఆఫర్..!

ఎన్నారై డైస్క్: కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా(Australia) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ సంవత్సరం అదనంగా 35 వేల మంది విదేశీయులకు దేశంలో శాశ్వత నివాసార్హత కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకూ ఏటా 1.60 లక్షల మంది విదేశీయులు ఆస్ట్రేలియాలో సెలిటయ్యే వారు(Permanent Immigration). ప్రభుత్వం ఈ పరిమితిని(Cap) తాత్కాలిక ప్రాతిపదికన 1.95 లక్షలకు పెంచేందుకు సిద్ధమవుతోంది. నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో లేక ఇక్కట్ల పాలవుతున్న ఆస్ట్రేలియా వ్యాపారసంస్థలకు.. ఈ నిర్ణయంతో ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిపుణుల కొరతకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 


కొవిడ్ తెచ్చిన తంటా..

కొవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండేళ్ల పాటు విదేశీయులెవరనీ దేశంలోకి అనుమతించని విషయం తెలిసిందే. దీనికి తోడు దేశంలో ఉంటున్న హాలిడేవర్కర్లు, విదేశీ విద్యార్థులు తమ స్వస్థలాలకు తరలిపోవడంతో ఆస్ట్రేలియాలో కార్మికుల కొరత ఏర్పడింది. సిబ్బంది లేక వ్యాపార నిర్వహణ కష్టంగా మారింది. అయితే కొవిడ్ సంక్షోభాన్ని ఓ అవకాశమని.. ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ క్లెయిర్ ఓ నీల్ వ్యాఖ్యానించారు. ‘‘వలసల వ్యవస్థకు సంస్కరణలు చేపట్టే ఓ అవకాశాన్ని కొవిడ్ సంక్షోభం మనముందుంచింది అని ఓ నీల్ శుక్రవారం అక్కడి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మా అంచనాల ప్రకారం.. ఈ ఏడు వేల మంది విదేశీ నర్సులు, ఇంజినీర్లు.. ఆస్ట్రేలియాకు శాశ్వత ప్రాతిపదికన తరలిరానున్నారు’’ అని చెప్పారు. గత ఏభై ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా ఆస్ట్రేలియాలో నిరుద్యోగిత 3.4 శాతంగా ఉంది. కానీ.. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజల చేతుల్లోని డబ్బులకు విలువ నానాటికీ తగ్గుతోంది.


ఇదిలా ఉంటే.. శాశ్వత వలసలపై పరిమితులను తాత్కాలికంగా సడలించాలంటూ ఆస్ట్రేలియా వ్యాపార సంస్థల యజమానులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. సిబ్బంది కొరతతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ ప్రభుత్వం.. వ్యాపారులతో విస్తృత సమావేశాలను నిర్వహించింది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకు పరిష్కారం కోసం వారి నుంచి సలహాలు స్వీకరించింది. ప్రస్తుతం పాశ్చాత్యదేశాలు.. నిపుణులైన కార్మికులు, ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్నాయి. విదేశీనిపుణులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ దిశగా వలస చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా కూడా విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఆయా దేశాలతో పోటీపడుతోంది. అయితే.. ఆస్ట్రేలియా వీసాల జారీలో ఆసాధారణ జాప్యం కారణంగా విదేశీయులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఆస్ట్రేలియాలో సిబ్బంది కొరతకు ఈ పరిస్థితి కూడా కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2022-09-02T21:53:02+05:30 IST