NRI: విదేశీయులకు మేలు చేకూర్చేలా ఆస్ట్రేలియా మరో కీలక నిర్ణయం..?

ABN , First Publish Date - 2022-09-05T00:00:28+05:30 IST

ఈ క్రమంలో.. ఆస్ట్రేలియాలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధి పొందుతున్న విదేశీ నిపుణులకు(Skilled migrants) మేలు చేకూర్చే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

NRI: విదేశీయులకు మేలు చేకూర్చేలా ఆస్ట్రేలియా మరో కీలక నిర్ణయం..?

ఎన్నారై డెస్క్: సిబ్బంది కొరతతో అల్లాడుతున్న వ్యాపారాలను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా(Australia) ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది అదనంగా 35 వేల మంది విదేశీయులకు దేశంలో శాశ్వత నివాసార్హత(Permanent Residency) కల్పించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో..  తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధి పొందుతున్న విదేశీ నిపుణులకు(Skilled migrants) మేలు చేకూర్చే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 


దేశంలో విదేశీ నిపుణుల కనీస వేతనాన్ని(Threshold) పెంచేందుకు తాము సుముఖంగానే ఉన్నట్టు ఆస్ట్రేలియా స్కిల్స్ అండ్ ట్రెయినింగ్ మంత్రి బ్రెండెన్ ఓ కానర్ ఆదివారం పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉంటున్న తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కనీసం వేతనం 53,900 డాలర్లుగా ఉంది. 2013 నుంచీ ఇది అమల్లో ఉంది. ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని బ్రెండెన్ ఓ కానర్ వ్యాఖ్యానించారు. అయితే.. అధికార పార్టీ గతంలో పేర్కొన్నట్టు కనీస వేతనాన్ని 65 వేల డాలర్లకు పెంచుతారా అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ‘‘ఇవన్నీ సంక్లిష్ట సమస్యలు, కూలంకషంగా చర్చించాకే ఓ నిర్ణయానికి రావాలి’’ అని ముగించారు. 


ఆస్ట్రేలియాలో ప్రస్తుతం అధిక వేతనాలున్న సాంకేతిక రంగాలతో పాటూ తక్కువ వేతనాలు ఉండే వృద్ధాశ్రమాలు, ఇతర పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు అమలైన ఆంక్షల కారణంగా విదేశీయుల రాక తగ్గిపోయింది. అదే సమయంలో.. దేశంలోని ఉన్న ఫారినర్లు తమ తమ దేశాలకు తరలిపోయారు. దీంతో.. ఉద్యోగుల కొరత ఏర్పడింది. ఇక ఆస్ట్రేలియా వీసాల జారీలో నెలకొన్న జాప్యం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా ఈ ఏడు అదనంగా 35 వేల మంది విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించేందుకు ఆస్ట్రేలియా నిర్ణయించింది. 

Updated Date - 2022-09-05T00:00:28+05:30 IST