Australia Visa: ఆ వీసాలతో ఆస్ట్రేలియాకు వచ్చి రిటైర్ అవుతున్నారు, రద్దు చేస్తేనే బెటర్.. ఆస్ట్రేలియా హోం మంత్రి

ABN , First Publish Date - 2022-09-12T01:40:38+05:30 IST

భారీ విదేశీ పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించిన సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌ను(Significant Investor Visa) రద్దు చేసే యోచనలో ఆస్ట్రేలియా(Australia) ఉన్నట్టు తెలుస్తోంది.

Australia Visa: ఆ వీసాలతో ఆస్ట్రేలియాకు వచ్చి రిటైర్ అవుతున్నారు, రద్దు చేస్తేనే బెటర్.. ఆస్ట్రేలియా హోం మంత్రి

ఎన్నారై డెస్క్: బడా విదేశీ పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించిన సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌ను(Significant Investor Visa) రద్దు చేసే యోచనలో ఆస్ట్రేలియా(Australia) ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీసా విధానాన్ని సమీక్షించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ధనిక చైనీయులకు ఎర్రతివాచీ పరుస్తున్న ఈ వీసాలను కొనసాగించేందుకు తమకు హేతుబద్ధమైన కారణాలేమీ కనిపించట్లేదని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. 


విదేశీ పెట్టుబడిదారులు 3.4 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆస్ట్రేలియాలోకి మళ్లిస్తే..సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసా లభిస్తుంది. దేశంలోకి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ వీసాను ప్రవేశపెట్టింది. అయితే.. దీన్ని కొనసాగించడం వల్ల దేశానికి ఒనగూరే ప్రయోజనాలేమీ లేవని హోం శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసాతో దేశంలోకి వచ్చే పెట్టుబడి కంటే వీసాదారులపై ప్రభుత్వం చేస్తున్న సగటు ఖర్చు ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. తమ కెరీర్‌ చరమాకంలో ఉన్న వ్యాపారవేత్తలు ఈ వీసాల ద్వారా ఆస్ట్రేలియాకు వచ్చి రిటైర్మెంట్ తీసుకుంటున్నారని, వ్యాపార బాధ్యతలను వదిలించుకుంటున్నారని వివరించారు. 


ఈ వీసాను రద్దు చేయాలంటూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మేథోసంస్థ గ్రాటన్ ఇన్‌స్టిట్యూట్..అక్కడి ప్రభుత్వానికి ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తోంది. ఈ వీసాదారులు చాలా తక్కువగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపింది. ఇది చాలదన్నట్టు..ప్రభుత్వమే వారికి రకరకాల పౌర సేవలు కల్పించేందుకు అదనంగా 1.2 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంది. 

Updated Date - 2022-09-12T01:40:38+05:30 IST