చైనాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా..!

ABN , First Publish Date - 2021-04-22T23:22:09+05:30 IST

చైనాతో కుదుర్చుకున్న బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ఒప్పందాన్ని ఆస్ట్రేలియా తాజాగా రద్దు చేసుకుంది. దీంతో..చైనా ఆస్ట్రేలియా వివాదం మరింత ముదిరినట్టైంది.

చైనాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా..!

కాన్‌బెర్రా: చైనాతో కుదుర్చుకున్న బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ఒప్పందాన్ని ఆస్ట్రేలియా తాజాగా రద్దు చేసుకుంది. దీంతో..చైనా ఆస్ట్రేలియా వివాదం మరింత ముదిరినట్టైంది. ఐరోపా, ఆసియా దేశాలను వాణిజ్యం ద్వారా ఓ కొత్త మార్గంలో అనుసంధానపరిచే  బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును చైనా ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా చైనా వివిధ దేశాలకు రుణాలు మంజూరు చేస్తూ ఆయా దేశాల్లో ప్రాజెక్టుకు అవసరమైన మౌలికవసతులను అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అత్యంత ధనిక రాష్ట్రమైన విక్టోరియా కూడా బీఆర్‌ఐలో భాగస్వామి అవుతూ గతంలో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే కరోనా మహమ్మారి తలెత్తడానికి కారకులు ఎవరో తేల్చాలంటూ గతేడాది ఆస్ట్రేలియా డిమాండ్ చేయడంతో ఆస్ట్రేలియా-చైనా వివాదం తలెత్తింది. ఇదీ ఎన్నో మలుపులు తిరుగుతూ క్రమంగా తీవ్రం రూపం దాల్చడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం బుధవారం నాడు సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాతో విక్టోరియా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. 


‘‘ఆస్ట్రేలియాలోని రాష్ట్రాలు వివిధ దేశాలతో కుదుర్చుకున్న వెయ్యికి పైగా ఒప్పందాలను ప్రభుత్వం ఇటీవల సమీక్షించింది. చివరికి... చైనాతో విక్టోరియా కుదుర్చుకున్న 2 ఒప్పందాలను,  సిరియా, ఇరాన్‌లతో కుదుర్చుకున్న చేరో ఒప్పందాన్ని రద్దు చేశాం. ఆస్ట్రేలియా విదేశాంగ విధానానికి ఇవి అనుగుణంగా లేకపోవడంతో వీటిని రద్దు చేశాం’’ అని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-22T23:22:09+05:30 IST