Kuwait: ప్రవాసుల దేశ బహిష్కరణ ఏర్పాట్లను ముమ్మరం చేసిన కువైత్..!

ABN , First Publish Date - 2022-09-13T15:34:26+05:30 IST

వివిధ ఉల్లంఘనలకు పాల్పడి పట్టుబడిన ప్రవాసులను (Expats) వెంటనే దేశం నుంచి బహిష్కరించేందుకు కావాల్సిన ఏర్పాట్లను కువైత్ (Kuwait) ముమ్మరం చేసింది.

Kuwait: ప్రవాసుల దేశ బహిష్కరణ ఏర్పాట్లను ముమ్మరం చేసిన కువైత్..!

కువైత్ సిటీ: వివిధ ఉల్లంఘనలకు పాల్పడి పట్టుబడిన ప్రవాసులను (Expats) వెంటనే దేశం నుంచి బహిష్కరించేందుకు కావాల్సిన ఏర్పాట్లను కువైత్ (Kuwait) ముమ్మరం చేసింది. ఈ మేరకు వారివారి దేశాల ఎంబసీలకు (Embassy) వారికి కావాల్సిన ప్రయాణ పత్రాలను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాల్సిందిగా కువైత్ విదేశాంగ మంత్రిత్వశాఖ (Foreign Ministry) కోరింది. ఇక ఉల్లంఘనదారులలో అధిక శాతం మంది రెసిడెన్సీ పత్రాలు లేనివారు, వాటి గడువు ముగిసిన వారు ఉన్నట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ కేటగిరీ ప్రవాసులను మొదట దేశం నుంచి బహిష్కరించేందుకు కువైత్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) తాజాగా విదేశాంగ శాఖ ద్వారా కీలక సూచన చేసింది. 



అరెస్టైన ఉల్లంఘనదారుల రాయబార కార్యాలయాల నుంచి వారికి సంబంధించిన ప్రయాణ పత్రాలను త్వరగా సంపాదించాలని విదేశాంగ శాఖకు ఆదేశించింది. అలాగే గడువు తీరిన ఇంకా దేశంలోనే ఉన్నందుకు విధించిన జరిమానాలు కూడా ఉల్లంఘనదారుల నుంచి కలెక్ట్ చేయాలని తెలిపింది. జరిమానాలు చెల్లించకుండా ఎట్టిపరిస్థితుల్లో వారిని దేశం నుంచి పంపించవద్దని పేర్కొంది. ఒకవేళ వారు జరిమానా చెల్లించే స్థితిలో లేకపోతే వారికి స్పాన్సర్లుగా ఉన్నవారిని నుంచి వసూలు చేయాలని తెలియజేసింది. కాగా, అంతర్గత మంత్రిత్వశాఖ తనిఖీల్లో చాలామంది ప్రవాసుల వద్ద ఎలాంటి రెసిడెన్సీ పత్రాలు లేవని, వారి పిల్లలు కూడా చాలా కాలంగా నివాస చట్టాన్ని (Residency law) ఉల్లంఘించి ఉంటున్నట్లు తేలింది.


ఇది చాలా తీవ్రమైన నేరమని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే.. కొందరి పిల్లల తల్లిదండ్రులు ఏవరో కూడా తెలియకపోవడం. వారు అనాథలుగా బతుకుతున్నట్లు తెలిసింది. దాంతో పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి వారి పేరెంట్స్‌ను గుర్తించాలని నిర్ణయించింది. ఈ సమస్య ముఖ్యంగా జలీబ్ అల్-శౌఖ్, మహాబౌలా ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు మంత్రిత్వశాఖ గుర్తించింది.  


Updated Date - 2022-09-13T15:34:26+05:30 IST