Advertisement

జూలైలో జోరు!

Jun 30 2020 @ 00:32AM

  • వ్యక్తిగత వాహనాల డిమాండ్‌పై డోలాట్‌ క్యాపిటల్‌ అంచనా 


ముంబై: వచ్చేనెలలో వాహన అమ్మకాలు పుంజుకోవచ్చని డోలాట్‌ క్యాపిటల్‌ చెబుతోంది. ప్రయాణికుల  వాహనాలు, టూవీలర్ల కొనుగోలు కోసం ఎంక్వైరీలు, లాక్‌డౌన్‌ తర్వాత ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఆటో షోరూంలు సందర్శిస్తున్న వారి సంఖ్య పెరగడం ఇందుకు కారణం. అలాగే భద్రత దృష్ట్యా వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత పెరగడం, పెళ్లిళ్ల సీజన్‌ డిమాండ్‌ కూడా ఇందుకు దోహదపడవచ్చని ఆ సంస్థ ఒక నివేదికలో తెలిపింది.

సకాలంలో వర్షాలు కురియడంతోపాటు వ్యవసాయ పనులు ఊపందుకున్న నేపథ్యంలో గ్రామీణ మార్కెట్లో వాహనాలకు డిమాండ్‌ మరింత మెరుగపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆటోమొబైల్‌ కంపెనీల ఉత్ప త్తి కూడా పుంజుకోవడంతోపాటు మార్కెట్లోకి సరఫరా సైతం పెరిగిందని అంటోంది. 


ముఖ్యాంశాలు..

  1. ద్విచక్ర వాహనాల విక్రయాల ఉరవడి స్థిరంగానే కొనసాగనుంది. కార్ల డిమాండ్‌ నిలకడగా సాగుతుందా లేదా అన్న విషయం మాత్రం అంతు చిక్కడం లేదు.
  2. కస్టమర్ల వేచి చూసే ధోరణి, కరోనా సంక్షోభంతో ఆదాయ ప్రభావం వంటి అంశాలు ప్యాసింజర్‌ వాహనాల రీప్లే్‌సమెంట్‌, అప్‌గ్రేడ్‌ సేల్స్‌కు 50 శాతం వరకు గండిపెట్టవచ్చు. 
  3. రియల్‌ ఎస్టేట్‌, టూరిజం కోలుకోవడానికి చాలాకాలం పట్టవచ్చు. ఈ రంగాల కంపెనీల నుంచి వాహనాల డిమాండ్‌ ఇప్పట్లో పెరిగే అవకాశాలు కన్పించడంలేదు. 
  4. వాహన రుణాల నిరాకరణ రేటు కూడా అధికంగా ఉంటోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కస్టమర్ల ఆదాయంపై నెలకొన్న అనిశ్చితి, ఇప్పటికే తీసుకున్న రుణాలపై మారటోరియాన్ని ఎంచుకోవడం ఇందుకు కారణమవుతోంది. 
  5. ట్రాక్టర్ల విక్రయాల పునరుద్ధరణ మిగతా వాటికంటే వేగంగా జరుగుతోంది. వ్యవసాయ రంగమొక్కటే కాస్త మెరుగైన పనితీరు కనబరుస్తుండటం ఇందుకు దోహదపడుతోంది. 
  6. వాణిజ్య వాహనాల విషయానికొస్తే, మార్కెట్లో సరుకు రవాణాకు సరైన గిరాకీ లేక 50 శాతం వాహనాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. ఈఎంఐ మారటోరియం ఒక్కటే వీరికి ఊరట కలిగించే విషయం. అయితే, బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలకు మాత్రం వీటి కొనుగోలుకిచ్చిన రుణాలు మొండిబకాయిలుగా మారొచ్చన్న భయం పట్టుకుంది. 
  7.  త్రిచక్ర వాహనాల విక్రయాలు భారీగా క్షీణించనున్నాయి. ఆటో డ్రైవర్ల ఆదాయాలు పడిపోవడం ఇందుకు కారణం. ఈ సెగ్మెంట్‌ రుణాల్లో 70-80 శాతం మంది ఈఎంఐ మారటోరియంను ఎంచుకోవడమే ఇందుకు సంకేతం. దీంతో కొత్తగా త్రిచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రుణాలిచ్చేందుకు ఫైనాన్షియర్లు సుముఖంగా లేరు. 


ఆటో ఎగుమతులు 73శాతం డౌన్‌: ఈఈపీసీ 

మే నెలలో వాహన ఎగుమతులు 73 శాతం క్షీణించి రూ.1,736 కోట్లకు పరిమితం అయ్యాయని ఇంజనీరింగ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఈఈపీసీ) ఇండియా తెలిపింది. లాక్‌డౌన్‌తో తలెత్తిన సరఫరా సమస్య కారణంగా అమెరికా, మెక్సికో వంటి కీలక మార్కెట్లకు ఎగుమతులు భారీగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది.


వాహన ఉత్పత్తికి ‘చైనా’ అవరోధం

చైనా నుంచి వాహన విడిభాగాల దిగుమతులకు సకాలంలో అనుమతులివ్వాలని ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీదారుల  అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏసీఎంఏ) కోరింది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా వాహన ఉత్పత్తికి అంతరాయం ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. చైనా నుంచి దిగుమతులను పూర్తిగా మాన్యువల్‌గానే తనిఖీ చేస్తారని, దాంతో క్లియరెన్స్‌లకు జాప్యమవుతోందని ఏసీఎంఏ పేర్కొంది. వాహన ఉత్పత్తి చాలా సంక్లిష్టమైన ప్రక్రియని, పూర్తిగా అనుసంధానితం, పరస్పర ఆధారితమైనదని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ జైన్‌ అన్నారు. ఒక్క విడిభాగం అందుబాటులో లేకపోయినా సంబంధిత వాహన ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుందన్నారు. 


వాహనం మరింత పెద్దగా..!

దేశంలో లాజిస్టిక్స్‌ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బస్సులు, గూడ్స్‌ ట్రక్కులు, ట్రెయిలర్లు సహా మోటారు వాహనాల పరిమాణాన్ని (పొడుగు, వెడల్పు, ఎత్తు కొలతలు) పెంచేందుకు అంగీకారం తెలిపింది. ‘కేంద్ర మోటార్‌ వాహనాల నియమావళి 1989’లో వాహన పరిమాణానికి సంబంధించిన ‘నిబంధన-93’ని సవరించేందుకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరిమాణం పెంపు ద్వారా వాహనంలో అదనపు ప్రయాణికులు లేదా సరుకులను తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.