ఆటో ప్రయాణం.. ప్రమాదం..!

ABN , First Publish Date - 2022-09-26T04:16:19+05:30 IST

దర్శి ప్రాంతంలో బస్సుల కొరత ప్రజలను, విద్యార్థులను వేధిస్తోంది. గ్రామాలకు సరిపడా ఆర్టీసీ బస్సులు తిప్పడం లేదు.

ఆటో ప్రయాణం.. ప్రమాదం..!
లగేజీ ఆటోలో రైల్వే పనులకు వెళ్తున్నకూలీలు (ఫైల్‌)

గ్రామాలకు బస్సుల కొరత

పలు రూట్లకు  ఆర్టీసీ సేవల నిలిపివేత

విద్యార్థులకూ తప్పని కష్టాలు 

దర్శి, సెప్టెంబరు 25 : దర్శి ప్రాంతంలో బస్సుల కొరత ప్రజలను, విద్యార్థులను వేధిస్తోంది. గ్రామాలకు సరిపడా ఆర్టీసీ బస్సులు తిప్పడం లేదు. దీంతో వివిధ పనులపై పట్టణానికి, ఇక్కడి నుంచి మరోచోటకు  వెళ్లేవారు   తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ బస్సులు అందుబాటులోకి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు గూడ్స్‌ ఆటోల్లో కూడా ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్న దుస్థితి నెలకొంది. పరిమితికి మించి ఎక్కించుకోవటంతో పాటు క్యాబిన్‌పైన కూడా కూర్చోబెట్టి వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో అతివేగంగా వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక రోడ్లకు ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. దీంతో ప్రజలు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. కళాశాలలకు, పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ప్రతిరోజూ బస్సుల కోసం గంటల తరబడి వేచి  ఉంటున్నారు. అనేక గ్రామాల నుంచి దర్శి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీలకు విద్యార్థులు వచ్చి వెళ్తుంటారు. బస్సులు లేకపోవడంతో వారు కూడా ఆటోల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దర్శి - సామంతపూడి, దర్శి - ఆరవళ్లిపాడు, దర్శి - సీతారాంపురం, దర్శి - భీమవరం, దర్శి - బాపిరెడ్డిపాలెం రోడ్లలో గతంలో ఆర్టీసీ బస్సులు తిరిగేవి. ఆ బస్సులను ప్రస్తుతం రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో లేకుండా పోయింది. రోజురోజుకూ బస్సుల సంఖ్య తగ్గిపోతుండడంతోపాటు మరోపక్క ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆటోలు విపరీతంగా పెరిగాయి. బస్సులు రాకపోవడంతో ప్రమాదమని తెలిసినా ఆటోల్లోనే తిరగాల్సి వస్తోందని ప్రయాణికులు చెప్తున్నారు. కొందరు గూడ్స్‌ ఆటోలనే ప్యాసింజర్‌ ఆటోగా తిప్పుతున్నారు. ఎక్కువ మందిని ఎక్కించుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు ఆటోలు తిరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరుగుతున్నా వారికి చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.  ఇప్పటికైనా అధికారులు ఆర్టీసీ బస్సులను పెంచడంతోపాటు ఆటోలు నిబంధనల మేరకు నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. 

కూలి కోసం పాట్లు పడాల్సిందే..!

దొనకొండ : నిరుపేద కుటుంబాలకు పూట గడవాలంటే కూలి పనికి పోవల్సిందే. సుదూర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లేవారు ఆటోలనే ఆశ్రయిస్తుంటారు.  పలు గ్రామాలకు చెందిన నిరుపేద కూలీలు కుటుంబ పోషణ, ఆకలి బాధల నిమిత్తం ప్రమాదమైనా ఆటోలు, ట్రాక్టర్‌లపై ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆటోలపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై అనేక మంది ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకుంటుండగా  అనేక మంది క్షతగాత్రులవుతున్నారు.  మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనులకు నిరుపేద కూలీలు ట్రాక్టర్‌, ఆటోలలో పరిమితికి మించి ఉదయాన్నే బయలుదేరి వెళ్లడం, తిరిగి అదే వాహనంలో ఇళ్లకు చేరడం పరిపాటి.   ఇటీవల  రైల్వేశాఖలో జరుగుతున్న పనులకు కూడా నిరుపేదలు అక్కడకు పెద్ద సంఖ్యలో లగేజి ఆటోలో వెళ్లి వస్తున్నారు. ప్రమాదమైనా కూలి కోసం ఎంతదూరమైనా వెళ్లాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పథకం చేసే పనులకు కూలి గిట్టుబాటు లేదని చెప్తున్నారు. ఎక్కువ పనులు కల్పించడంతోపాటు గిట్టుబాటు కూలి ఇచి ఆదుకోవాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-09-26T04:16:19+05:30 IST