సహాయక సామ్రాజ్యం

ABN , First Publish Date - 2022-09-21T05:24:25+05:30 IST

అనంతపురం నగరపాలికలో రోజుకో విడ్డూరం బయట పడుతోంది. ఎక్కడైనా ఉన్నతాధికారులకు సహాయకులు ఉంటారు

సహాయక సామ్రాజ్యం

అసిస్టెంట్లకే అసిస్టెంట్లు

నగరపాలికలో చోద్యం


అనంతపురం నగరపాలికలో రోజుకో విడ్డూరం బయట పడుతోంది. ఎక్కడైనా ఉన్నతాధికారులకు సహాయకులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సహాయకులకే సహాయకులు ఉన్నారు. కొన్నేళ్ల నుంచి ఈ ‘సంప్రదాయం’ కొనసాగుతోంది. కనీసం సూపరింటెండెంట్లు కూడా కాదు.. జూనియర్‌ అసిస్టెంట్లే సహాయకులను నియమించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొందరి పనితీరు చూస్తే.. ‘కప్పకు చెబితే.. కప్ప తన తోకకు చెప్పిందట..’ అనే సామెత గుర్తుకు వస్తుంది. తాము చేయాల్సిన పనులను ఇతరులకు అప్పగించి కాలక్షేపం చేస్తున్నారు. కొందరు ఈ ముసుగులో దందా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సీనియర్‌ అసిస్టెంట్లు కూడా సహాయకులను నియమించుకున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సహాయక పాత్ర పోషిస్తున్నారు. 


పదకొండేళ్లుగా ఆయన అక్కడే..

నగరపాలిక రెవెన్యూ విభాగంలో ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఏకంగా పదకొండేళ్లుగా అసిస్టెంట్‌ హోదాలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఏ వనగా పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగికి ఈయన సహాయకుడిగా ఉంటున్నాడు. నగరంలోని మున్సిపల్‌ కాంప్లెక్స్‌ల్లో ఉన్న మొత్తం 430 దుకాణాల వ్యవహారాలను ఈ సహాయకుడే చూస్తాడని సమాచారం. ఆ దుకాణాల్లో లీజుదారులు ఎందరు ఉన్నారు, ఇతరులు ఎన్నింటిని నిర్వహిస్తున్నారనే విషయం ఆయనకు మాత్రమే తెలుసని చెబుతారు. ఏ అధికారి సిఫార్సుతో అక్కడ తిష్ట వేశాడో తెలియదుగాని, ఏళ్లతరబడి పాతుకుపోయాడు. 


అవసరం లేకున్నా..

నగరపాలికలో కొందరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ‘వస్తినమ్మా... పోతినమ్మా..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అవసరం లేకపోయినా కొందరిని అసిస్టెంట్లుగా నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ1, ఈ2 సెక్షన్లలో పనిచేసే ఉద్యోగులకు అదనంగా ఇద్దరిని అసిస్టెంట్లుగా నియమించారు. అకౌంట్‌ సెక్షనకు ప్రత్యేకంగా ఉండే సిబ్బంది కాకుండా ఇద్దరు అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఓ డీఈ దగ్గర ఇద్దరు అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఏ డీఈకీ లేని సౌకర్యం ఆ డీఈకి కల్పించారు. కొన్నిరోజులు పింఛన సెక్షనలో పనిచేసిన ఓ ఉద్యోగి మళ్లీ రెవెన్యూ సెక్షనలోకి వచ్చాడట. కానీ ఆయన ఎప్పుడు ఏ పని చేస్తారో ఎవరికీ తెలియదట. 


అక్కడ ఐదుగురు

ఇంజనీరింగ్‌ పనులకు సంబంధించి టెక్నికల్‌ విభాగంలో ఐదుగురు అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఆ విభాగంలో ఏదైనా వర్క్‌కు ఎస్టిమేట్‌ వస్తే.. సరిగా ఉందా లేదా అని నిర్ధారించడానికి, టెక్నికల్‌ శాంక్షన, ఎంబుక్‌ చెక్‌ చేస్తారు. కేవలం ఈ పని కోసం ఒక టెక్నికల్‌ ఆఫీసర్‌ కింద ఐదుగురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ‘అసిస్టెంట్లు’ అనే పదాన్ని ఉపయోగించుకుని పనిచేస్తున్నారు.  కేవలం ఈ సెక్షన కోసమే ఓ గదిని కేటాయించారు. కొన్నేళ్లుగా ఎవరితో ఏ పని చేయించుకోవాలో తెలియక ఇలా ఐదుగురిని కేటాయించారని సమాచారం. 


సీనియర్‌ అసిస్టెంట్లకూ..

సీనియర్‌ అసిస్టెంట్లకు అదనంగా  ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించారు. ఈ1 సెక్షనలో కేవలం జీతాలు కేటాయిస్తారు. ఇక్కడ రెగ్యులర్‌ ఉద్యోగి కంటే అసిస్టెంట్‌కే పని ఎక్కువగా ఉంటుందని సమాచారం.  సీ1గా పనిచేస్తున్న మరో సీనియర్‌ అసిస్టెంట్‌, తనకు ఓ ఉద్యోగి అవసరమని అడిగి మరీ వేయించుకున్నారట. జీతాలు చేసే పనికి అదనంగా ఓ ఆపరేటర్‌ కావాలని అడిగినట్లు తెలిసింది.             - అనంతపురం క్రైం

Updated Date - 2022-09-21T05:24:25+05:30 IST