ఆవ భూముల్లో అక్రమ సాగు

ABN , First Publish Date - 2021-01-25T07:18:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించి సేకరించిన భూముల్లో అక్రమ వ్యవహారాలు సాగుతున్నాయి.

ఆవ భూముల్లో అక్రమ సాగు

ఇటు మొక్కజొన్న పైరు సాగు

అటు అక్రమంగా మట్టి తవ్వకాలు

ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల్లో కొందరు నేతల అండతో ఇష్టారాజ్యం

ఆవ భూముల్లో అక్రమార్కులు పడ్డారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు చేసిన భూములు.. ఇళ్లకు పనికిరావంటూ కొందరు కోర్టుకెళ్లడంతో పట్టాల పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసింది. ఖాళీగా ఉన్న ఈ భూముల్లో కొందరు మొక్కజొన్న పంట సాగు  చేస్తుండగా, మరికొందరు మట్టిని తరలించే   పనిలో బిజీగా ఉన్నారు.

కోరుకొండ, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించి సేకరించిన భూముల్లో అక్రమ వ్యవహారాలు సాగుతున్నాయి. స్థానిక నేతల అండతో కొందరు సొంత భూముల్లా సాగు చేస్తుండగా, మరికొందరు మట్టి తవ్వకాలకూ దిగారు. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్న వైనం కాపవరం, బూరుగుపూడి ఆవ భూముల్లో కొద్దికాలంగా కనిపిస్తోంది. రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గంలోని సుమారు 22 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇక్కడ 585 ఎకరాల భూమిని సేకరించింది. ఇందుకోసం ఎకరానికి రూ.45 లక్షల వరకూ రైతులకు పరిహారంగా చెల్లించారు. అయితే ఈ భూములు ఆవ భూములని, సంవత్సరంలో ఐదు నెలలపాటు నీటితో నిండి ఉంటాయని, ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉండవని స్థానిక ప్రజలు, అఖిలపక్ష రైతులు, నాయకులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇక్కడ ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిపోయింది. ఇదే అదనుగా కొందరు స్వార్థపరుల కన్ను ఈ ఆవ భూములపై పడింది. ఆవ భూముల్లో అక్రమంగా మొక్కజొన్న సాగు చేశారు. ఈ అక్రమాలు జరుగుతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది మౌనం వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల కనుసన్నల్లోనే మొక్కజొన్న సాగు జరిగిందని, అఖిలపక్షానికి చెందిన పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ భూముల్లో నుంచి రాత్రిపూట యథేచ్ఛగా మట్టి తవ్వకా లు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, చట్టప్రకా రం చర్యలు తీసుకోవాలని, సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం స్వాఽధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు తహశీల్దార్‌కు ఫిర్యాదు కూడా చేసినట్టు అఖిలపక్షానికి చెందిన కొత్తపల్లి భాస్కరరామం, మారిశెట్టి రమణ తెలిపారు.


Updated Date - 2021-01-25T07:18:34+05:30 IST