శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలను వినియోగించుకోండి

ABN , First Publish Date - 2022-08-19T06:40:58+05:30 IST

ప్రజలంతా శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ ఫర్‌ పబ్లిక్‌ యుటిలిటీ సర్వీసెస్‌ (ప్లాపస్‌) చైర్మన్‌ జి.వల్లభనాయుడు కోరారు.

శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలను వినియోగించుకోండి
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వల్లభనాయుడు

ప్లాపస్‌ చైర్మన్‌ వల్లభనాయుడు 

విశాఖపట్నం, ఆగస్టు 18: ప్రజలంతా శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ ఫర్‌ పబ్లిక్‌ యుటిలిటీ సర్వీసెస్‌ (ప్లాపస్‌) చైర్మన్‌ జి.వల్లభనాయుడు కోరారు. జిల్లా కోర్టుల ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజోపయోగ సేవలకు సంబంధించి రూ.కోటి విలువ మేరకు వివాదాలను పరిష్కరించే అధికారం శాశ్వత లోక్‌ అదాలత్‌కు ఉందన్నారు. నీరు, విద్యుత్‌ సరఫరా విషయంలో తలెత్తే వివాదాలు, పోస్టల్‌, టెలిఫోన్‌ సేవల్లో ఉత్పన్నమయ్యే వివాదాలు, పారిశుధ్యం, ప్రజా సంరక్షణ సేవల్లో తలెత్తే సమస్యలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక లావాదేవీలు జరిపే సంస్థల్లో ఉత్పన్నమయ్యే వివాదాలు వంటి వాటిని పరిష్కరించే అధికారం శాశ్వత లోక్‌ అదాలత్‌కు ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రి, డిస్పెన్సరీల సేవల్లో తలెత్తే వివాదాలు, బీమా సంస్థల్లో వివిధ కారణాలో ఏర్పడే సమస్యలను శాశ్వత లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. శాశ్వత లోక్‌ అదాలత్‌ అధ్యక్షునిగా జిల్లా జడ్జి స్థాయి న్యాయమూర్తి వుంటారని, ఆయనతో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారన్నారు. కక్షిదారుడు లోక్‌ అదాలత్‌కు దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చునన్నారు. ఇందులో ఇరుపక్షాల వారికి అంగీకారమైన తీర్పు ఇవ్వడం జరుగుతుందని, కక్షిదారులు రాజీ షరతులకు అంగీకరించకుంటే న్యాయస్థానాల మాదిరిగానే తీర్పు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. శాశ్వత లోక్‌ అదాలత్‌ ఇచ్చే తీర్పు అంతిమమని, దీనిపై అపీల్‌ చేసుకునే వీల్లేదని, అయితే ఇచ్చిన తీర్పు అమలును సంబంధితుల అభ్యర్థన మేరకు అధికార పరిధి వున్న కోర్టుకు బదిలీ చేసుకోవచ్చునని వల్లభనాయుడు తెలిపారు.


Updated Date - 2022-08-19T06:40:58+05:30 IST