అవకతవకలపై చర్యలేవి?

ABN , First Publish Date - 2022-07-02T06:41:39+05:30 IST

అవకతవకలపై చర్యలేవి?

అవకతవకలపై చర్యలేవి?

ఘంటసాల, జూలై 1 : కొడాలిలోని మొవ్వ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అవకతవకలు జరుగుతున్నా యన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, గతంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యం లోడును పట్టించినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఘంటసాల జడ్పీటీసీ సభ్యులు తుమ్మల మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన మొవ్వ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోడౌన్‌లో జరిగిన తనిఖీల్లో 152.46 మెట్రిక్‌ టన్నుల బియ్యం షార్టేజీ ఉన్నట్లు గుర్తించి గోడౌన్‌ను సీజ్‌ చేశారు. ఘంటసాల, చల్లపల్లి, మొవ్వ మండలాలకు రేషన్‌ బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా,  కలెక్టర్‌ అనుమతి మేరకు సీజ్‌ చేసిన గోడౌన్‌ నుంచి పీడీఎస్‌ డీటీ పర్యవేక్షణలో రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణ, తహసీల్దార్‌ బి.రామానాయక్‌తో కలసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు వెళ్లి ఆరా తీశారు. ప్రతీ నెల గోడౌన్‌కు వచ్చే లోడు నుంచే షార్టేజ్‌ వస్తుందని, ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశానని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ జి.పురుషోత్తమ శర్మ వివరించారు.  అవకతవకలపై నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ రద్దుపై పునఃసమీక్షించాలి

మొవ్వ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ రద్దుపై పునఃసమీ క్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాడేపల్లికి చెందిన రేషన్‌ బియ్యం సరఫరా కాంట్రాక్టర్‌ సూరపనేని శివరామప్రసాద్‌ ఉన్నతాధికారులను కోరారు. మొవ్వ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి మండలాలకుబియ్యాన్ని సరఫరా చేస్తున్నా మన్నారు. పాయింట్‌లో 3 వేల బ్యాగుల తగాయన్న సాకుతో పాయింట్‌ను రద్దు చేశారు. ప్రభుత్వం నూతన మోడల్‌ వాహనాలను సిద్ధపర్చమనగా, రూ.10 లక్షలతో 2011-12 మోడల్‌ వాహనాలను రెండింటిని సిద్ధంచేసి జూన్‌ 28న టెండర్లు పిలువగా, వెళ్లిన తనకు పాయింట్‌ రద్దు అయిన విషయం తెలిసిందన్నారు. రూ.10 లక్షల మేర నష్టం పోతున్నానన్నారు. బియ్యం షార్టేజ్‌పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కానీ, పాయింట్‌ను రద్దు  చేయటం అన్యాయమన్నారు. 

Updated Date - 2022-07-02T06:41:39+05:30 IST