మౌన ప్రబోధకుడు!

ABN , First Publish Date - 2021-01-29T07:03:43+05:30 IST

‘ఈ యుగంలో అవతరించిన భగవంతుణ్ణి నేను’ అని అవతార్‌ మెహెర్‌బాబా స్వయంగా ప్రకటించారు. మానవులు మతం వెనుక కాకుండా... మతాలన్నీ ఘోషించే సత్యం వెనుక వెళ్ళాలని బోధించారు.

మౌన ప్రబోధకుడు!

31న అవతార్‌ మెహెర్‌ బాబా అమర తిథి


‘ఈ యుగంలో అవతరించిన భగవంతుణ్ణి నేను’ అని అవతార్‌ మెహెర్‌బాబా స్వయంగా ప్రకటించారు. మానవులు మతం వెనుక కాకుండా... మతాలన్నీ ఘోషించే సత్యం వెనుక వెళ్ళాలని బోధించారు. .‘నా మతం ప్రేమ’ అని ప్రకటించారు. ‘ప్రేమ, సేవ, విధేయతలే ప్రధానం’ అని సందేశం ఇచ్చారు.


‘‘పూర్వం రామునిగా, కృష్ణునిగా, ఏసు క్రీస్తుగా, బుద్ధునిగా... ఇలా ఎన్నో అవతారాలు ఎత్తాను. ఆ అవతారాలలో ఎన్నో బోధలు చేశాను. అయితే వాటిని ఎందరు పాటించారు? అందుకే ఈ అవతారంలో మౌనంతోనే భక్తులకు సందేశం ఇస్తున్నాను’’ అంటూ నలభై నాలుగేళ్ళు తాను పాటించిన మౌన దీక్ష వెనుక పరమార్థాన్ని అవతార్‌ మెహెర్‌బాబా వెల్లడించారు. సంజ్ఞల ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలియజేశారు. సృష్టి రహస్యాలను విడమరిచి చెబుతూ ‘భగవద్వచనం’, ‘సర్వం-శూన్యం’ తదితర అనేక గ్రంథాలను అందించారు.  


1925 జులై 10 నుంచి 1969 జనవరి 31 వరకూ... అంటే తన భౌతిక దేహాన్ని వదిలేవరకూ... 44 ఏళ్ళపాటు కఠిన మౌనాన్ని ఆయన పాటించారు.  మౌనంగా వుంటూనే పదమూడు సార్లు యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో, అలాగే ఆసేతు హిమాచలం ఆయన పర్యటించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 1950 దశకంలో రెండు సార్లు పర్యటించారు. ఎందరో పాశ్చాత్యులు తాము ఆరాధించే ఏసు ప్రభువును మెహెర్‌ బాబాలో దర్శించుకున్నామని చెప్పారు. 


ఉపవాసం, ఏకాంతవాసం

మెహెర్‌ బాబా సమస్త మానవాళి కోసం భౌతికంగా అనేక బాధలు అనుభవించారు. ఎన్నోసార్లు ఏకాంతవాసం, ఉపవాసాలతో శరీరాన్ని ఎన్నో కష్టాలకు గురిచేశారు. కుష్టు రోగుల కోసం ఆసుపత్రి, దళిత విద్యార్థుల కోసం ఆశ్రమ పాఠశాలలు, అంటరానితనం నిర్మూలన తదితర అనేక కార్యక్రమాలకు 1927లోనే ఆయన శ్రీకారం చుట్టారు. కలకత్తాలో కరువు వచ్చినప్పుడు ఎందరో అన్నార్తులను ఆదుకున్నారు. సుమారు రెండున్నర సంవత్సరాలు తన శిష్య బృందంతో ‘నవ జీవనం’ పేరిట భిక్షాటనతో జీవనం గడిపారు. ఆ సమయంలోనే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కొంతకాలం ఉన్నారు. అలాగే, అప్పట్లో హైదరాబాద్‌ శివార్లలో ఉన్న ఖాజాగూడా ప్రాంతంలోని  చిన్న కొండ గుహలో వారం రోజులపాటు ‘మనోనాశ్‌’ పేరిట ఏంకాతవాసం చేశారు. ఆ తరువాత ఆయన రెండు సార్లు తీవ్రమైన కారు ప్రమాదాలకు గురయ్యారు. ఒకసారి అమెరికాలోని ఒక్లహోమా అనే ప్రాంతంలో, మరోసారి మహారాష్ట్రలోని సతారా పట్టణ సమీపంలో మెహెర్‌ బాబా ప్రయాణిస్తున్న కార్లకు ప్రమాదం జరిగింది. ఆయన శరీరంలోని కుడి, ఎడమ భాగాలు దాదాపు నుజ్జయ్యాయి. అలాంటి ప్రాణాపాయ స్థితిలో కూడా బాబా మౌనం విడనాడకుండానే తమకు సహకరించారని వైద్యులు వెల్లడించారు. 


ఆ దర్శనం అనన్య సామాన్యం

తన దేహత్యాగం గురించి ఆయన ముందుగానే అనక సంకేతాలిచ్చారు. 1969 ఏప్రిల్‌ 10 నుంచి జూన్‌ 10 వరకూ పుణేలో తన భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. కానీ జనవరి ప్రారంభంలోనే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. తక్షణ వైద్య పరీక్షల కోసం పుణేకి తీసుకువెళ్ళాలని వైద్యులు సూచించారు. బాబా దానికి అంగీకరించలేదు. ప్రత్యేక దర్శన కార్యక్రమాన్ని వాయిదా వెయ్యాలని సన్నిహితులు సలహా ఇచ్చారు. ‘‘నేను మానవావతారునిగా ఇచ్చే ఈ దర్శనం చిట్టచివరిది. అనన్య సామాన్యమైనది. ఈసారి నేను పడుకొనే భక్తులకు దర్శనం ఇస్తాను. అలా చేస్తే బాగుంటుందా’’ అని ప్రశ్నించారు. జనవరి నెలాఖరుకల్లా అంతా బాగవుతుందని చెప్పారు. కానీ చివరి క్షణం వరకూ ఆయన మాటల అర్థం సన్నిహితులకు అర్థం కాలేదు. జనవరి 29 నుంచీ ఆయన తీవ్రమైన ఫిట్స్‌తో బాధపడ్డారు. మంచంపై నుంచి ఎగిరి పడేవారు. జనవరి 30వ తేదీ రాత్రి భావూజీ అనే తన సన్నిహిత మండలి సభ్యుణ్ణి పిలిచి, ‘‘ఇది గుర్తుంచుకోండి!  నేను ఈ శరీరాన్ని కాను. భగవంతుణ్ణి’’ అని ప్రకటించారు. ఆ మాటలను తన హృదయానికి తాకేలా, సంజ్ఞలతో కాకుండా స్వష్టమైన స్వరంతో చెప్పారని భావూజీ గుర్తు చేసుకున్నారు. ‘‘బాబా గొంతు చాలా నీరసంగా ఉంది. కానీ ఆయన మాటలు నాకు చాలా స్పష్టంగా వినిపించాయి’’ అని ఆయన చెప్పారు. ఆ రాత్రి నాలుగు గంటల సేపు బాబా బాగానే విశ్రాంతి తీసుకున్నారు. కానీ ఫిట్స్‌ తరచుగా వస్తూనే ఉన్నాయి. ‘‘నేను ఏడు రోజుల తరువాత నూరు శాతం బాగవుతాను. ఆపై ఈ బాధలు ఉండవు’’ అని మరో సన్నిహితుడైన ఏరుచ్‌తో చెప్పారు. అయితే మర్నాడు ఫిట్స్‌ మరింత ఎక్కువగా బాబాను కుదిపేశాయి. దాంతో ఆయన శ్వాస స్తంభించింది. 


బాబా భౌతికకాయాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు సమీపంలో ఉన్న మెహెరాబాద్‌లో ఉంచారు. ఈ సంగతి తెలుసుకున్న ఆయన అనుయాయులు అనేకమంది దేశ, విదేశాల నుంచి మెహరాబాద్‌కు తరలివచ్చారు. వారి సందర్శనార్థం ఏడు రోజుల పాటు ఆయన దేహాన్ని భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఆయనను రాత్రింబవళ్లు భక్తులు సందర్శించుకున్నారు. అన్ని రోజులయినా కూడా ఆయన శరీరంలో ఎలాంటి మార్పులూ రాలేదు. ఆయన ముఖం చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగానే ఉంది. ఏడు రోజుల తరువాత... 1969 ఫిబ్రవరి 7న అక్కడ చిన్న కొండపై బాబా భౌతిక దేహాన్ని సమాధి చేశారు. పార్శీయుడైన బాబా జన్మదినం.. జొరాస్ట్రియన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఆ రోజే కావడం కాకతాళీయం కావచ్చు... కానీ అవతార పురుషుడైన ఆయనకు అన్నీ అవగతమే. 


మెహెర్‌ ‘భూకైలాసం’

ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం మెహెరాబాద్‌కు ఆయన ఆరాధకులు వేల సంఖ్యలో తరలి వెళ్ళి... అమరతిథి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా భక్తులు అక్కడికి రావద్దని మెహెర్‌బాబా ట్రస్ట్‌ విజ్ఞప్తి చేసింది. ఈసారి ఈ కార్యక్రమాలు అన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. జనవరి 31వ తేదీ మధ్యాహ్నం 12.00 నుంచి 12.15 వరకూ మౌనావతారుడైన మెహెర్‌ బాబాను స్మరిస్తూ భక్తులు మౌనం పాటిస్తారు. మెహెరాబాద్‌లోని బాబా సమాధి ప్రాంతం ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. అక్కడ పూజలు, క్రతువులు, సంప్రదాయ కర్మకాండలు ఉండవు. ఆ ప్రదేశాన్ని భక్తులు ‘భూకైలాస్‌’ అని పిలుచుకుంటారు. భౌతికంగా బాబా మన మధ్యన లేరు. కానీ, తన ఆరాధకులకు ఆయన నిత్య సహచరుడు. పిలిస్తే తక్షణం పలికే దైవం. మనసులో తలచిందే తడవుగా మరింత చేరువయ్యే అవతారమూర్తి. 


మెహెర్‌బాబా తన జీవిత కాలంలో ఎలాంటి మహిమలూ ప్రదర్శించలేదు. ‘‘నమ్మిన వాడికి నేను భగవంతుణ్ణి అన్నారు. నన్ను నమ్మినా నమ్మక పోయినా దేవుడు ఒక్కడే. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రతి మతానికీ అవతార పురుషులున్నారు. మతాలు వేరైనా అవతార పురుషుడు ఒక్కడే. ప్రతి యుగంలో భూమిపై అవతరిస్తున్న అవతార పురుషుడు ఒక్కడే. నేను కొత్తగా ఏ మతం స్థాపించడానికి రాలేదు. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఎదుటి మనిషిలో భగవంతుణ్ణి ప్రేమించండి. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు’’ అని ఆయన చెప్పారు. 


డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌

99595 53218

Updated Date - 2021-01-29T07:03:43+05:30 IST