సంక్షోభంలో విమానయానం

Sep 28 2021 @ 00:23AM

ప్రాంతీయ పౌర విమానయానాన్ని ప్రోత్సహించడానికి బదులుగా సుదూర విమానసర్వీసులు ప్రయాణీకులకు మరింత అనుకూలంగా ఉండేలా చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. విమానాశ్రయాలకు రహదారుల అనుసంధానాన్ని ఇతోధికంగా మెరుగుపరచాలి. భద్రతా తనిఖీలు, బ్యాగేజీ పరిశీలనకు పట్టే సమయాన్ని తగ్గించి తీరాలి. లండన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు విమానం బయలుదేరడానికి కేవలం పావుగంట ముందు మాత్రమే ఎయిర్‌పోర్ట్‌కు వస్తారు. మన దేశంలో అదెందుకు సాధ్యం కావడం లేదు?


గత దశాబ్దంలో దేశీయ పౌర విమానయాన రంగానికి లాభాలు గగన కుసుమాలైయిపోయాయి. ఎయిర్ ఇండియా చాలా సంవత్సరాలుగా నష్టాలతో నడుస్తోంది. జెట్ ఎయిర్ వేస్ దివాలా తీసింది. స్పైస్ జెట్‌కు కూడా ఎగరలేని పరిస్థితి దాపురించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ లాభాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇది, కొవిడ్ విపత్తుకు ముందు నాటి కథ. కరోనా మహమ్మారితో పరిస్థితులు మరింతగా విషమించాయి. లాభాల ఆర్జనకు అవకాశాలు పుష్కలంగా ఉన్న దూరప్రయాణ విమాన సర్వీసులను నిర్లక్ష్యపరిచి ప్రాంతీయ విమానాయానాన్ని ఇతోధికంగా మెరుగుపరచడంపై ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించడం వల్లే విమానయానం సంక్షోభంలో పడింది. 


ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో సెకండ్‌క్లాస్ ఎయిర్‌కండిషన్డ్ కంపార్ట్‌మెంట్‌లో ఢిల్లీ నుంచి బెంగలూరు ప్రయాణించడానికి అయ్యే వ్యయం రూ.2925. నెల రోజుల ముందే విమాన టికెట్ బుక్ చేసుకోగలిగితే అయ్యే వ్యయం రూ.3170. ఇది, రెండవ తరగతి ఎయిర్‌కండిషన్డ్ రైల్వే టికెట్ ధరతో ఇంచుమించు సమానం. రైల్వే, విమాన ప్రయాణాల మధ్య తేడా ఏమిటంటే రైల్వే ప్రయాణం రెండు రాత్రులు, ఒక పగలు జరుగుతుంది.


ఈ సుదీర్ఘ ప్రయాణ సమయంలో ఆహారానికి అదనంగా వ్యయం చేయవలసి ఉంటుంది. అదే విమానంలో అయితే ఢిల్లీ నుంచి బెంగలూరుకు 7 గంటలలో (విమాన యానంతోపాటు ఇతర ప్రయాణకాలం కలిపి) వెళ్ళిపోతారు. కాలం, ఖర్చు రీత్యా విమానయానమే అన్ని విధాల సుఖప్రదమని మరి చెప్పనవసరం లేదు. అయితే అత్యంత జరూరుగా వెళ్ళవలసి వస్తే, స్వల్పవ్యవధిలో లభ్యమయ్యే విమానం టిక్కెట్ ధర అక్షరాలా రూ.7000. మరి అంత స్వల్పవ్యవధిలో రైల్వేటిక్కెట్ లభించిన పక్షంలో దాని ధర యథావిధిగా రూ.2925 మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టి సుదూర గమ్యాలకు విమానప్రయాణమే సుఖప్రదమని స్పష్టమవుతోంది.


మధ్యస్థ దూరగమ్యాలకు రైల్వే, విమాన ప్రయాణాల మధ్య తారతమ్యాలను చూద్దాం. ఢిల్లీ నుంచి లక్నోకు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో సెకండ్‌క్లాస్ ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.1100. నెలరోజుల ముందు బుక్ చేసుకునే విమానం టిక్కెట్ ధర రూ.1827ఢిల్లీ నుంచి లక్నోకు రైలులో ప్రయాణానికి 10 గంటల సమయం పడుతుంది. అదే విమానంలో అయితే 5 గంటల్లో గమ్యానికి చేరతారు. అయితే రైలు ప్రయాణం రాత్రిపూట చేయవలసిఉంటుంది. పగటి పూట విమానప్రయాణం వల్ల వర్కింగ్ అవర్స్‌ను నష్టపోవలసివస్తుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే విమాన ప్రయాణంలో పగటిపూట ఉత్పాదక సమయాన్ని కోల్పోవలసివస్తుంది. ఈ రీత్యా మధ్యస్థ దూరాలకు రైలుప్రయాణమే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య కారణాల రీత్యా రాత్రి పూట ప్రయాణానికి వెనుకాడేవారు, రైలు టిక్కెట్లు సకాలంలో లభించనివారు లేదా తక్షణ పనుల కోసం వెళ్ళవలసినవచ్చిన వారు మధ్యస్థ దూర గమ్యాలకు విమాన ప్రయాణం చేయవచ్చు.


ఈశాన్య భారత రాష్ట్రాలు, అండమాన్ దీవులు మొదలైన పర్యాటక ప్రదేశాలతో విమాన సంధాయకతను ఇతోధికంగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ విధానం అమలులో సమస్య వ్యవస్థాగత మైనది. పర్యాటక రంగం పలు సమస్యలతో సతమతమవుతోంది ముఖ్యంగా శాంతిభద్రతలు కొరవడడం, సామాజిక సామరస్యం లోపించడం, మార్కెటింగ్‌లో మదుపుల కొరత మొదలైనవి పర్యాటకరంగాన్ని పీడిస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించినప్పుడే పర్యాటక రంగ పౌర విమానయానం పుంజుకోగలదు. అయితే పర్యాటకరంగంలో పరిస్థితులు సమీప భవిష్యత్తులో మెరుగుపడే సూచనలు కానరావడంలేదు. 


దేశీయ విమానయాన రంగం విస్తరణకు విధానాలను సూచించమని కోరుతూ 2012లో కేంద్ర ప్రభుత్వం ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ప్రాంతీయ విమాన సర్వీసులకు సబ్సిడీలు ఇవ్వవచ్చనేది ఆ వర్కింగ్‌గ్రూప్ చేసిన సిఫారసులలో ఒకటి. వాటి ఆధారంగా ప్రభుత్వం ఒక జాతీయ పౌర విమానయాన విధానాన్ని రూపొందించింది. ప్రాంతీయ విమాన సర్వీసులకు మూడు సంవత్సరాల పాటు సబ్సిడీలు సమకూర్చడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా చిన్నపట్టణాలకు పౌర విమానయానరంగాన్ని విస్తరింపచేయాలని 2018లో ‘డెలాయిట్ కన్సల్టెంట్స్’ సూచించింది. అయితే ఈ సిఫారసులు, సూచనలు ఏవీ పెద్దగా ఫలించలేదు. కారణమేమిటి? సమర్థమైన రైలు ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉండడమేనని చెప్పవచ్చు. అవి విమానయానానికి మెరుగైన ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ ప్రయాణికుల అవసరాలను బాగా తీర్చగలుగుతున్నందునే పౌర విమానయానం వెనుకబడిపోతోంది.


ఇటీవలి కాలంలో రోడ్డు రవాణా సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచారు. మధ్యస్థ, స్వల్ప దూరాల ప్రయాణాలకు విమానప్రయాణం కంటే రోడ్డు ప్రయాణమే అన్ని విధాల ప్రత్యామ్నాయంగా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు రోడ్డు ప్రయాణమైనా, విమాన ప్రయాణమైనా సరే 4 గంటల వ్యవధి పడుతుంది. ప్రయాణ వ్యవధిలో తేడా లేకపోవచ్చుగానీ విమానయానానికి భద్రతా తనిఖీలను ముగించుకుని విమానం ఎక్కేందుకు, గమ్యం చేరిన తరువాత బ్యాగులు తీసుకునేందుకు వేచి ఉండడం అనివార్యమవుతుంది. రోడ్డు ప్రయాణంలో ఇటువంటి ప్రయాసలు ఉండవు. ఈ కారణంగానే ప్రాంతీయ పౌర విమానయాన రంగాన్ని ప్రోత్సహించే విధానం ఒక వైఫల్యంగా మిగిలిపోయింది. ఇక ముందు కూడా అది ఒక వైఫల్యంగానే కొనసాగుతుందనడంలో సందేహం లేదు. 


ప్రాంతీయ పౌర విమానయానాన్ని ప్రోత్సహించడానికి బదులుగా సుదూర విమానసర్వీసులు ప్రయాణీకులకు మరింత అనుకూలంగా ఉండేలా చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇది సరైన దిశలో తీసుకున్న నిర్ణయమనడంలో సందేహం లేదు. దేశీయ విమానయానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇంకా ఎంతో చేయవలసిఉంది.


విమానాశ్రయాలకు రహదారుల అనుసంధానాన్ని ఇతోధికంగా మెరుగుపరచాలి. భద్రతా తనిఖీలు, బ్యాగేజీ పరిశీలనకు పట్టే సమయాన్ని తగ్గించి తీరాలి. లండన్ లోని వివిధ విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు విమానం బయలుదేరడానికి కేవలం పావుగంట ముందు మాత్రమే ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే విషయం నాకు బాగా తెలుసు. విమానాశ్రయాలతో రోడ్డు, మెట్రో స్టేషన్ల అనుసంధానాన్ని తక్షణమే మెరుగుపరచాలి. భద్రతా తనిఖీల చికాకులకు ఎలాంటి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలి. ఈ చర్యలు చేపడితేనే విమానయానరంగం సంక్షోభం నుంచి బయటపడేందుకు అవకాశముంది.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

-(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.