‘సెట్‌’తోనే సినిమా హిట్‌

ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST

మాయాబజార్‌ సినిమాలో పెళ్లికి తరలివచ్చిన కౌరవులకు - ఘటోత్కచుడి దగ్గర ఉండే చిన్నమయ- ‘అం అహః.. ఇం ఇహిః’ అంటూ క్షణాల్లో విడిది గృహాలు సృష్టిస్తాడు. ఖాళీ ప్రదేశాల్లో కళ్ల ముందు రకరకాల కోటలు పుట్టుకొస్తాయి...

‘సెట్‌’తోనే సినిమా హిట్‌

మాయాబజార్‌ సినిమాలో పెళ్లికి తరలివచ్చిన కౌరవులకు - ఘటోత్కచుడి దగ్గర ఉండే చిన్నమయ- ‘అం అహః.. ఇం ఇహిః’ అంటూ క్షణాల్లో విడిది గృహాలు సృష్టిస్తాడు. ఖాళీ ప్రదేశాల్లో కళ్ల ముందు రకరకాల కోటలు పుట్టుకొస్తాయి. అలాంటి  ఇంద్రజాల, మహేంద్రజాలాలలో మాస్టర్లే మన ఆర్ట్‌ డైరక్టర్లు. నాలుగైదు రోజుల్లో పెద్ద పెద్ద కోటలు, ఐదు నక్షత్రాల హోటళ్లు , క్రికెట్‌ స్టేడియంలు సృష్టించే ఈ ఆర్ట్‌ డైరెక్టర్లు సినిమాకు వెన్నెముకలాంటి వారు. తెర వెనక ఉండి సినీమాయాజాలాన్ని చేసే ఇంద్రజాలికులు. అలాంటి ఒక సినీమాయజాలకుడు అవినాష్‌ కొల్ల. ‘మహానటి’, ‘జెర్సీ’, ‘గద్దలకొండ గణేష్‌’, ‘ఎవరు’ లాంటి చిత్రాలకు ఆర్ట్‌ డైరక్టర్‌గా పనిచేసిన అవినాష్‌- ప్రస్తుతం రాబోయే మరికొన్ని భారీ చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. ఆర్ట్‌ డైరక్షన్‌ వెనకున్న మర్మాల గురించి ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలలోకి వెళ్తే..


వెయ్యి కోట్ల టర్నోవర్‌..

ఒక సినిమాలో ఆర్ట్‌కు 20 నుంచి 40 శాతం దాకా బడ్జెట్‌ను కేటాయిస్తారు. 24 క్రాఫ్ట్స్‌లో.. 12 క్రాఫ్ట్‌కు సంబంధించిన సిబ్బంది ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిపి పనిచేస్తారు. అందువల్ల ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా ఆర్ట్‌ డైరక్టర్‌ కావటం కూడా అంత సులభం కాదు. దానికి అసోషియేషన్‌ వారు పెట్టే ఒక పరీక్షను పాస్‌ కావాల్సి ఉంటుంది. లేకపోతే కనీసం ఆరు సినిమాలకు అప్రెంటీస్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో సుమారు 300 మంది ఆర్ట్‌ డైరక్టర్లు ఉన్నారు. అయితే వీరిలో ఈవెంట్స్‌కు, ఇతర ఫంక్షన్లకు పనిచేసే వారే ఎక్కువ. ప్రతి ఏడాది కేవలం టాలీవుడ్‌లో ఆర్ట్‌ డైరక్షన్‌ కింద దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. 


చిన్న ఐడియా..

కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న ఐడియాలను అందరూ మిస్‌ అయిపోతూ ఉంటారు. ‘జెర్సీ’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా కోసం ఒక స్టేడియం సెట్‌ వేయాల్సి వచ్చింది. పూర్తి స్టేడియం సెట్‌ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి సగం స్టేడియం సెట్‌ను వీల్స్‌ మీద అటూ ఇటూ కదిపేలా వేశాం. బ్యాట్స్‌మెన్‌ ఆడుతున్నప్పుడు, బౌలర్‌ వేస్తున్నప్పుడు సీన్స్‌ను తీసేటప్పుడు- ఈ స్డేడియంను అటూ ఇటూ కదిపేవారు. రెండు రోజుల షూటింగ్‌ తర్వాత - డీఓపీ (డైరక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ)కి  హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ‘‘స్టేడియంను అటూ ఇటూ జరిపే బదులు- బౌలర్‌ను, బ్యాట్స్‌మెన్‌ను మారిస్తే సరిపోతుంది కదా!’’ అన్నారు. దాంతో ఆ తర్వాత నాలుగు రోజుల షూటింగ్‌ - రెండు రోజుల్లో పూర్తయిపోయింది.


మూడు పీజీల తర్వాత..

మాది విజయవాడ. నాన్న రైల్వేలో ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబం. నాన్నకు నన్ను రైల్వేలో చేర్చాలనే కోరిక ఉండేది. చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టం. చాలా అంతర్జాతీయ బహుమతులు వచ్చాయి. అయినా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు నన్ను ఆర్ట్‌ వైపు ప్రోత్సహించేవారు కాదు. చదువుకొని ఉద్యోగం చేయాలనుకొనేవారు. వారి కోసం మూడు పీజీలు చేశా. ఆ తర్వాత ఎడ్వర్‌టైజ్‌మెంట్స్‌కు ఆర్ట్‌ డిజైన్‌ చేసేవాడిని. కొన్ని ఆడియో రిలీజ్‌ల సెట్‌లను డిజైన్‌ చేసేవాడిని. నా వర్క్‌ చూసి మెచ్చుకొని... 14 రీల్స్‌ రవిగారు ‘శ్రీమంతుడు’ సినిమాకు పనిచేస్తారా? అని అడిగారు. అది ఒక మంచి అనుభవం. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఆర్ట్‌ డైరక్టర్‌గా నా మొదటి సినిమా. ఆ తర్వాత ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూనే ఉన్నా. ప్రస్తుతం ‘శ్యామ్‌సింగరాయ్‌’, ‘శ్రీకారం’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘మేజర్‌’ సినిమాలకు పనిచేస్తున్నా. 


ఛాలెంజ్‌..

‘మహానటి’ సినిమా ఒక ఛాలెంజ్‌! సావిత్రిగారి కథ చాలా మందికి తెలుసు. ఆ పరిస్థితులు, నేపథ్యం తెలిసిన వారు కూడా అనేకమంది ఉన్నారు. ఆ పరిస్థితులను క్రియేట్‌ చేయటం ఒక ఛాలెంజ్‌! ఈ సినిమాలో ఒక పాట కోసం మెట్ల సెట్‌ వేయాల్సి వచ్చింది. దాదాపు 70 మంది డ్యాన్సర్లు దానిపై ఉంటారు. వారందరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా సెట్‌ వేయటం ఒక ఛాలెంజే! ఇలాంటి మరో ఛాలెంజ్‌ ‘అల్లుడు అదుర్స్‌’లో ఒక పాట. ఈ పాటలో 80 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవు ఉన్న ఎల్‌ఈడీ స్ర్కీన్స్‌తో ఒక సెట్‌ వేశాం. ఈ స్ర్కీన్‌లు పైన ఉంటాయి. నేల మీద ఒక అర అడుగు నీరు ఉంటుంది. అంటే పైన ఎల్‌ఈడీ స్ర్కీన్‌లపై కనిపించే అలలు నీటిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. టెక్నాలజీ పరంగా ఇది చాలా పెద్ద ఛాలెంజ్‌! కానీ ఈ సెట్‌ అద్భుతంగా వచ్చింది. 


ఆర్ట్‌ డైరక్షన్‌ సినిమాలకు చాలా కీలకం. అయితే దాని గురించి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే.. అసలు ఆర్ట్‌ డైరక్టర్‌ పని ఎక్కడ మొదలవుతుంది..?

ఒక సినిమాకు ఆర్ట్‌ ఆత్మలాంటిది. డైరక్టర్‌ చెప్పదలచుకున్న కథకు అవసరమైన బ్యాక్‌గ్రౌండ్‌ను, రకరకాల ఎలిమెంట్స్‌ను ప్రేక్షకుల మెదళ్లలో ముద్రించేలా చేసేదే ఆర్ట్‌ డైరక్షన్‌. ఉదాహరణకు ‘మహానటి’ సినిమాను తీసుకుందాం. డైరక్టర్‌ తాను అనుకున్న కథను చెప్పాలంటే - ఆనాటి పరిస్థితులు ప్రేక్షకుడికి తెరమీద కనిపించాలి. అప్పుడే ప్రేక్షకుడు కథను నమ్ముతాడు. లేకపోతే నమ్మడు. అందుకే ఆర్ట్‌ డైరక్టర్‌ మొదటి నుంచి సినిమా నిర్మాణంలో ఇన్‌వాల్వ్‌ అయి ఉంటాడు. అతని కింద దాదాపు 12 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా హిట్‌ కావడంలో సెట్టింగ్స్‌ ఎంతో కీలకం. 


ఒకప్పటికీ, ఇప్పటికీ ఆర్ట్‌ డైరక్షన్‌లో వచ్చిన తేడాలేమిటి? ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లేమిటి?

ఒకప్పుడు హీరో హీరోయిన్‌ కాస్ట్యూమ్స్‌ నుంచి మేకప్‌ వరకూ అన్నీ ఆర్ట్‌ డైరక్టర్స్‌ చూసుకొనేవారు. ఇప్పుడు వీటికి ప్రత్యేకమైన విభాగాలొచ్చేశాయి. దీని వల్ల ఆర్ట్‌ డైరక్టర్‌ పరిధి కొంత తగ్గింది. అయితే ఇప్పుడు ఆర్ట్‌ డైరక్షన్‌ పరిధి మరో  కోణం నుంచి పెరిగి... ప్రొడక్షన్‌ డిజైనింగ్‌గా రూపాంతరం చెందింది. సినిమాలో పాత్రలకు ఎలాంటి మేకప్‌ వేయాలి? ఎలాంటి రంగుల దుస్తులు ఉపయోగించాలి లాంటి విషయాలను ఆర్ట్‌ డైరక్టర్లు చూస్తున్నారు. ఉదాహరణకు ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో హీరోది నెగెటివ్‌ క్యారెక్టర్‌. అందువల్ల అతనికి నలుపు, నీలం కాస్ట్యూమ్స్‌ మాత్రమే వాడాం. ‘మహానటి’ సినిమా ఫస్ట్‌ హాఫ్‌లో సావిత్రి కెరీర్‌ గొప్పగా ఉంటుంది. ఆ గ్లోరీని చూపించటానికి ఎరుపు, పసుపు రంగులు వాడాం. దీనివల్ల ప్రేక్షకుల సబ్‌కాన్షస్‌లో.. వారికి తెలియకుండానే పాత్రల స్వభావం గురించి తెలుస్తూ ఉంటుంది. 


మిగిలిన రంగాల్లో మాదిరిగానే ఆర్ట్‌ డైరక్షన్‌లో కూడా మార్పులేవైనా వచ్చాయా?

ఒకప్పుడు కలప, ప్లైవుడ్‌లతో సెట్‌ వేసేవారు. దీని వల్ల ఖర్చు ఎక్కువ అయ్యేది. సమయం కూడా ఎక్కువ పట్టేది. ఇప్పుడు సెట్‌లను మెటల్‌తో వేస్తున్నాం. దీనికి సమయం తక్కువ పడుతుంది ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది. దీనిని రీసైకిల్‌ చేసి వాడుకోవచ్చు కూడా! నేను ఎంత పెద్ద సెట్‌ అయినా ఐదు రోజుల్లో వేస్తా! ఉదాహరణకు ఇప్పటి దాకా నేను వేసిన సెట్‌లలో పెద్దది- ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో కోట సెట్‌. దీనికి ఐదు రోజులు పట్టింది. దీనితో పాటుగా మన జీవన విధానంలో... శైలిలో వచ్చిన మార్పులను ప్రతిఫలించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకప్పుడు పోలీస్‌ స్టేషన్‌ అంటే - ఒక లాకప్‌, పైళ్లు, బీరువాలు ఉండేవి. ఇప్పుడు ఏదైనా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే ఫైళ్లు, బీరువాలు ఉండవు. ఒక కంప్యూటర్‌ ఉంటుంది. మిగిలిన ఆఫీసుల మాదిరిగానే ఉంటుంది. ఇదే విధంగా ఒకప్పుడు మధ్యతరగతి ఇళ్లలో క్యాలెండర్లు, ఫొటో ఫ్రేములు ఉండేవి. ఇప్పుడు క్యాలెండర్లు ఎవరు పెట్టుకోవటం లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను గమనించి వాటిని సెట్‌లో వాడినప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. 


ప్రేక్షకులు ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటారా? ఈ విషయంలో మీ అనుభవాలేమిటి?

ఒకప్పుడు కొన్ని సెట్‌ ప్యాట్రన్స్‌ ఉండేవి. ఉదాహరణకు మధ్యతరగతి కుటుంబాలు కొన్ని రకాల సోఫాలు, కుర్చీలు వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉదాహరణకు ఒక మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి ఇంటిసెట్‌ వేసినప్పుడు.. వారు వాడే వస్తువులు, పుస్తకాలు, పేపర్లు వంటివి చూపిస్తాం. అయితే సోషల్‌ మీడియా బాగా వ్యాపించటంతో... సాఫ్ట్‌వేర్‌లు అందరికి అందుబాటులోకి రావటంతో... చిన్న చిన్న తేడాలను కూడా పట్టుకోగలుగుతున్నారు. దానితో చిన్న చిన్న అంశాలను కూడా చాలా జాగ్రత్తగా డిజైన్‌ చేయాల్సి వస్తోంది. ‘మహానటి’ సినిమాలో ఒక చోట అప్పట్లో దొరికే మ్యాగజైన్లను వాడాం. ప్రేక్షకులు వాటిని కూడా గమనించి మెసేజ్‌లు పెట్టారు. అంటే అంత జాగ్రత్తగా గమనిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ప్రేక్షకులు చిన్న చిన్న విషయాలను కూడా గుర్తిస్తున్నారంటే ఆర్ట్‌ డైరక్టర్‌ విజయవంతమయినట్లే!


అవుట్‌డోర్స్‌.. ఇండోర్స్‌- ఈ రెండింటిలో మీకు ఏవి ఎక్కువ సౌలభ్యంగా అనిపిస్తాయి?

నాకు రెండూ ఇష్టమే! అయితే అవుట్‌డోర్‌ అయితే ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే- అవుట్‌డోర్‌లో పరిస్థితులు చాలాసార్లు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఉన్నవాటితోనే మనకు కావాల్సిన ఫలితాన్ని రాబట్టుకోవాల్సి వస్తుంది. దానికి చాలా నిశీతంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా నేపథ్యమంతా కోల్‌కత్తాలో ఉంటుంది. కోల్‌కత్తాలో ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా గమనించకపోతే సెట్స్‌ వేయలేం. ఈ సినిమా కోసం ఆరుసార్లు కోల్‌కత్తాకు వెళ్లి వచ్చాం. అక్కడ వ్యాపార సముదాయాల నిర్మాణాలు భిన్నంగా ఉంటాయి. ఇదే విధంగా ‘మేజర్‌’ సినిమా కోసం ముంబాయిలో తాజ్‌ హోటల్‌ సెట్‌ను వేస్తున్నాం. వారు పర్మిషన్లు ఇవ్వకపోతే ఫోటోలను తీసుకొని డిజైన్‌ చేయాల్సి వచ్చింది. 


తమిళం, మలయాళం సినిమాల్లో అవుట్‌డోర్‌లు ఎక్కువగా కనిపిస్తాయి.. సహజత్వం కూడా ఉంటుంది.. మన తెలుగు సినిమాల్లో సెట్‌ల్లోనే షూటింగ్‌లు ఎక్కువగా ఎందుకు చేస్తారు?

ఒరిజినల్‌ లోకేషన్‌కు వెళ్లి షూటింగ్‌ చేయాలంటే అక్కడకు స్టార్స్‌ అందరూ రావాలి. ఎక్కువ సమయం వెచ్చించాలి. అదే సెట్‌ అయితే మనకు నచ్చిన సమయంలో షూటింగ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు అరకు లోయలో ఒక అద్భుతమైన లోకేషన్‌ ఉందనుకుందాం. అక్కడ షూటింగ్‌ చేయాలంటే శ్రమ... ఖర్చు... స్టార్స్‌ను తీసుకువెళ్లడం... వారికి వసతి, భోజన సౌకర్యాలు వంటి అనేక ఇబ్బందులుంటాయి. అదే హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీలోనో.. అన్నపూర్ణలోనో సెట్‌ వేస్తే ఈ ఇబ్బందులు తప్పుతాయి. టాలీవుడ్‌లో బడ్జెట్‌లు ఎక్కువ కాబట్టి సెట్‌లు వేస్తారు. తమిళం, మలయాళం సినిమాల వారు మొదటి నుంచి అవుట్‌డోర్స్‌లోనే ఎక్కువగా షూటింగ్‌లు చేస్తున్నారు. అయితే సహజత్వం విషయంలో- గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి సాధించాం. ‘జెర్సీ’ సినిమా షూటింగ్‌ అంతా సెట్స్‌లోనే జరిగింది. కానీ అవి సెట్స్‌ అనే విషయం చాలామంది గుర్తించలేకపోయారు. తాజాగా ‘రంగ్‌దే’ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఇటలీలో కొన్ని ప్రదేశాలను ప్రతిబింబించే సెట్‌ వేశాం. ఇది ఎంత సహజంగా ఉందంటే- ఎప్పుడూ సెట్స్‌కు రాని రామోజీరావు గారు- ఈ సెట్‌కు వచ్చి చూసి వెళ్లారు. చాలా ఆశ్చర్యపోయారు. బావుందని ప్రశంసించారు.


- సివిఎల్‌ఎన్‌


Updated Date - 2020-12-20T05:30:00+05:30 IST