అవగాహనతోనే అడ్డుకట్ట

ABN , First Publish Date - 2021-04-18T06:22:01+05:30 IST

కరోనా తీవ్రత పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

అవగాహనతోనే అడ్డుకట్ట
పామూరులో కంటైన్మెంట్‌ జోన్‌లో శానిటైజ్‌ చేస్తున్న అధికారులు

విస్తృతంగా అవగాహన కల్పించిన అధికారులు 

కందుకూరు, ఏప్రిల్‌ 17: కరోనా తీవ్రత పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రైతుబజారు, మార్కెట్లు, రిటైల్‌ దుకాణాలతో పాటు సినిమా హాళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్క్‌లు లేని వారికి రూ.100 చొప్పున అపరాధ రుసం విధించారు. వెయ్యి రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉందని, ఒకటి రెండు రోజుల్లో ప్రజల్లో మార్పు రాకపోతే జరిమానాలు పెంచుతామని స్పష్టం చేశారు. బాలుర ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో మున్సిపల్‌ సిబ్బంది శనివారం పాఠశాలలో శానిటైజేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. 

పామూరు : కరోనా నివారణ టీకాలపై పుకార్లను నమ్మొద్దని, అపోహలు విడనాడి 45 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేయించుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ పి.రాజశేఖర్‌ అన్నారు. టీకా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక వెలుగు కార్యాలయంలో పొదుపు మహిళలకు టీకా వ్యాక్సినేషన్‌పై శిక్షణ, అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపధ్యంలో ఆరోగ్యం పట్ల అలసత్వం విడనాడి ముందుగా టీకా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బి పద్మసాయి ప్రశాంతి, ఏపిఎం జి విద్యాసాగర్‌, వీవోఏలు, వైఎస్సార్‌కేపీ సిబ్బంది పాల్గొన్నారు. 

ముండ్లమూరు : తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం మండల టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్‌ పి.పార్వతి మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో 12 మందికి కరోనా వైరెస్‌ సోకిందని, ఆయా గ్రామాల్లో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కరోనా సోకిన వ్యక్తి  హోం ఐసోలేషన్‌లోనే ఉండాలన్నారు. ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఆది, సోమవారాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, ఏబేట్‌ పిచికారి చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి మనోహర్‌రెడ్డి ఆర్‌ఐ ఏ స్రవంతి, సీహెచ్‌వో నారాయణరావు, ఈవోఆర్‌డీ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. 

పీసీపల్లి : స్థానిక పీహెచ్‌సీ పరిధిలోని. వైద్యాధికారిణి సుజన  ఆధ్వర్యంలో కరోనా పరీక్షల కోసం స్వాబ్‌లు స్వీకరించి ల్యాబ్‌కు పంపించారు.  మండలంలో రెండు రోజుల క్రితం పాజిటీవ్‌ కేసులు నమోదైన గుంటుపల్లి, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లో తహసీల్దార్‌ సింగారావు శనివారం పర్యటించారు. పాజిటీవ్‌ వచ్చిన వ్యక్తులు నివాసం ఉండే ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. 

మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

లింగసముద్రం : మండలంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.రమేష్‌ శనివారం చెప్పారు. లింగసముద్రంలో రెండు, యర్రారెడ్డిపాలెంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయని చెప్పారు. దీంతో మండలంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కు చేరుకున్నాయన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా లింగసముద్రం, మొగిలిచెర్ల గ్రామాల్లో వచ్చాయని డా.రమేష్‌ చెప్పారు. 

వలేటివారిపాలెం : వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం కార్యాలయంలో గ్రామైఖ్యసంఘం సభ్యులకు శనివారం కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య సీసీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్‌ పుట్టుక, ఆ వ్యాధి వ్యాప్తి, ఎలా అరికట్టాలి. ఆ వ్యాధి సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంతేగాకుండా వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం వలన ఉపయోగాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం హనుమంతరావు, సీహెచ్‌వో బాబూరావు. గ్రామైఖ్యసంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఏడుగురికి పాజిటివ్‌

సీఎ్‌సపురం : మండలంలో శనివారం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు రాజేష్‌ తెలిపారు. వీ.భైలు గ్రామంలో ఇద్దరికి, చెన్నపునాయునిపల్లిలో ఇద్దరికి, అయ్యలూరివారిపల్లిలో, ఆర్‌.కె.పల్లి, శీలంవారిపల్లి గ్రామాలలో ఒక్కొక్కరికి కరోనా వచ్చినట్లు ఆయన తెలిపారు. వీరిలో శీలంవారిపల్లిలో కరోనా వచ్చిన వ్యక్తి మండలంలోని నల్లమడుగుల గ్రామ సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారని అలాగే అయ్యలూరివారిపల్లి, చెన్నపునాయునిపల్లి గ్రామాలకు చెందిన వ్యక్తులు నెల్లూరుజిల్లా ధనలక్ష్మీపురం, బ్రహ్మదేవి గ్రామాలలోని నారాయణ కాలేజీ విద్యార్థులని ఆయన తెలిపారు. 

సీఎ్‌సపురం : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాస్క్‌లు, శానిటైజర్‌లు ఉపయోగిస్తూ భౌతికదూరం పాటించడం ద్వారా కరోనా వైర్‌సకు దూరంగా ఉండవచ్చని వెలుగు ఏపీఎం రజనీ తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో శనివారం మండలంలోని వీవోఏలకు, మహిళాసంఘం అద్యక్షురాళ్ళకు కరోనా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

కార్యాలయం వరకే పరిమితమైన ర్యాలీ

వెలుగు ఏపీఎం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కరోనా అవగాహన ర్యాలీ స్థానిక వెలుగు కార్యాలయం వరకే పరిమితమైంది. మండలంలోని వీవోఏలకు, మహిళాసంఘం అద్యక్షురాళ్లకు కరోనా అవగాహన సదస్సు నిర్వహించిన అనంతరం గ్రామంలో తిరిగి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగహన కల్పించాల్సి ఉంది. అయితే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ముందుగా ఫోటోలకు ఫోజులిచ్చి పై అధికారులకు పంపించి నామమాత్రంగా కార్యక్రమం ముగించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలువురు పలు విమర్శలు చేస్తున్నారు.  

కంటైన్మెంట్‌ జోన్లలో అప్రమత్తంగా ఉండాలి 

పామూరు : కంటైన్మెంట్‌ జోన్లలో ఉంటున్న ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ తహసీల్దార్‌ ఆర్‌ నాసరుద్దీన్‌ తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్లుగా ఉన్న బాలసుబ్బయ్య నగర్‌, చెన్నకేశవనగర్‌, ఇరువూరి రోడ్డులోని కంటైన్మెంట్‌ జోన్లను జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు స్వచ్ఛందంగా కోవిడ్‌ నిభంధనలు పాటిస్తూ వ్యాధి తీవ్రత తగ్గే విధంగా డాక్టర్ల సూచనల మేరకు నడుచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ రాధమ్మ, వీఆర్‌వో రమేష్‌, పోలీసులు, గ్రామ పంచాయతీ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. అనంతరం కంటైన్మెంట్‌ జోన్‌పరిధిలో సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టి కోవిడ్‌ బాదితులతో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-04-18T06:22:01+05:30 IST