అప్రమత్తతే తొలి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-09T07:27:44+05:30 IST

కరోనా రెండవ దశను కట్టడి చేసే కార్యక్రమాలలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మున్సి పాలిటీకి 7500 లీటర్ల హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి శనివారం అందజేశారు.

అప్రమత్తతే తొలి వ్యాక్సిన్‌
హైపోక్లోరైడ్‌ పిచికారి చేస్తున్న సిబ్బంది

కందుకూరు, మే 8: కరోనా రెండవ దశను కట్టడి చేసే కార్యక్రమాలలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మున్సి పాలిటీకి 7500 లీటర్ల హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి శనివారం అందజేశారు. ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌కి అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తక్షణ ం హైపోక్లోరైడ్‌ ద్రావణ ం స్ర్పే చేసేలా పర్యవేక్షించాలన్నారు. కొవిడ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ డి.సీతారామయ్య, ఎంపీడీవో విజయశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

లింగసముద్రం : కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని మండల టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌, తహ సీల్దార్‌ ఆర్‌.బ్రహ్మయ్య, ఎంపీడీవో కె.మాలకొండయ్య అన్నారు. శనివారం వారు లింగసముద్రం, పెదపవనితో పాటు పలు  గ్రామాలలో కర్ఫ్యూ ఆంక్షల అమలును వారు పరిశీలించారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ బ్రహ్మయ్య  మాట్లాడుతూ అనవసరంగా బయటకు రావద్దని చెప్పారు. అత్యవసరమైతే మాస్కులు ధరించి, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకొని బయటకు రావాలన్నారు. ఈ సందర్బంగా కరోనా నిబంధనలు పాటించని పది దుకాణాలకు రూ.వెయ్యి జరిమానా విధించారు. 

కొవిడ్‌కేర్‌ సెంటర్‌కు విరాళం

లింగసముద్రం : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నందున పోలీసులు, వారి కుటుంబసభ్యులందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఒంగోలు సీసీఎస్‌ డీఎస్పీ ప్రసాద్‌ చెప్పారు. శనివారం ఆయన లింగసముద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో పోలీస్‌ సిబ్బంది, మహిళా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  వ్యాక్సిన్‌ ఒక్కటే కరోనా బారి నుంచి కాపాడుతుందన్నారు. పోలీసులు, వారి కుటుంబసభ్యులు, మహిళా పోలీసులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వచ్చిన పోలీసులకు ఒంగోలులోని డీటీసీలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారన్నారు. ఎస్సై ఎస్‌.రమేష్‌ మాట్లాడుతూ ఒంగోలులోని  పోలీస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు నెల్లూరుకు చెందిన తన స్నేహితుడు మధు రూ.20 వేలు విరాళంగా ఇచ్చారన్నారు.

దొనకొండ, మే 8: దొనకొండలో కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మండలంలో  రెండవ దశలో ఇప్పటి వరకు అధికారికంగా 55 కేసులు నమోదు కాగా, అనధికారికంగా ఇంకా 400 పైగా కేసులు ఉంటాయని భావిస్తున్నారు. కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని గుట్టుగా మందులు వాడుతున్నారు. కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ఎంపీడీవో కేజీఎస్‌.రాజు గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేశారు. కరోనా నమోదైన ప్రాంతాలను రెండుజోన్‌గా గుర్తించి అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ స్ర్పే చేస్తున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని  అధికారులు సూచిస్తున్నారు.

ప్రజలందరికీ వ్యాక్సిన్‌ 

దర్శి, మే 8: ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించి ప్రాణాలు కాపాడాలని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు డిమాండ్‌ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం కరోనా పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాపారావు మాట్లాడుతూ ప్రతిరోజు వేలాదిమంది కరోనా బారిన పడుతూ వందలాదిమంది చనిపోతున్నారన్నారు. కరోనా తీవ్రతను శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిం చిన విషయం మర్చిపోయి టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించటం ధారుణమన్నారు. వైసిపీ పాలకులు కక్షసాధింపు వైఖరి విడిచిపెట్టి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని హితవు పలికారు. 

కార్యక్రమంలో టీడీపీ దర్శి మండల అధ్యక్షుడు నారపుశెట్టి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి మారెళ్ళ వెంకటేశ్వర్లు, నాయకులు సంగా తిరుపతిరావు, దారం సుబ్బారావు, షేక్‌ ఫరీద్‌, అంజిబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పరిటాల సురేష్‌ ప్రత్యేకంగా ఇంటివద్ద వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిరసన తెలిపారు. 

రాజంపల్లిలో మాస్కుల పంపిణీ

దర్శి, మే 8: ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు రాజంపల్లి యూత్‌ఫోర్స్‌ యువకులు శనివారం 5వేల మాస్కులు ప్రజలకు పంపిణీ చేశారు. దర్శి మండలం రాజంపల్లి గ్రామంలోని ప్రజలకు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత ఆర్థిక సహకారంతో యూత్‌ఫోర్స్‌ సభ్యులు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం దర్శిలోని పాత్రికేయులకు, పోలీసులకు, ఎన్‌-95 మాస్కులు పంపిణీ చేశారు.

కూనిపాలెం (వలేటివారిపాలెం): మండలంలోని కూనిపాలెంలో వైసీపీ గ్రామ నాయకుడు దామా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. కొవిడ్‌ నివారణలో భాగంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పిలుపు మేరకు పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని వీధులలో బ్లీచింగ్‌ చల్లించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దామా వెంకటేశ్వర్లు, నలగర్ల మల్లయ్య, దామా చెంచయ్య, దామా కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

మాస్క్‌ల పంపిణీ 

పొన్నలూరు : అయ్యప్ప ట్రస్ట్‌ చైర్మన్‌ గుంటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సై బ్రహ్మనాయుడు శనివారం స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ముండ్లమూరు వెంకటేశ్వర్లు, రవి, శ్రీను పాల్గొన్నారు. 

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి 

పొన్నలూరు : కొవిడ్‌ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్సై బ్రహ్మనాయుడు  కోరారు. శనివారం ఆయన పొన్నలూరులోని దుకాణాల వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌ వేయించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-05-09T07:27:44+05:30 IST