కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉందాం

ABN , First Publish Date - 2021-04-24T05:23:10+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల పోలీస్‌ సిబ్బంది, వారి కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిద్ధార్థ్దకౌశల్‌ పిలుపు నిచ్చారు.

కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉందాం
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీకాంత్‌

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 23: కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల పోలీస్‌ సిబ్బంది, వారి కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిద్ధార్థ్దకౌశల్‌ పిలుపు నిచ్చారు. శుక్రవారం ఒంగోలు తాలూకా, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లలో సిబ్బందితో సమావేశమై కరోనా పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిం చారు. పోలీసు సిబ్బంది, అధికారులు, వారి కుటుంబ సభ్యులు ముందస్తు చర్యలు పాటించాలన్నారు. అవసరమైతే పోలీస్‌ కొవిడ్‌ హెల్పలైన్‌ 9121104791కు ఫోన్‌ చేయాలని కోరారు. తాలుకా పోలీసులకు ఎస్పీ చేతుల మీదగా హెల్మెట్లు, విటమిన్‌ ట్యాబ్‌లెట్లు అందజేశారు. కార్యక్రమం లో డాక్టర్‌ భానుమతి కరోనా రాకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డీటీసీ ఇన్‌స్పెక్టర్‌ జి.రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్లు సూర్యనారయణ, శ్రీకాంత్‌, రాంబాబు, సీతారామయ్య, శివరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పర్చూరు : పర్చూరులో రోజు రోజుకు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు కోరోనా మరణాలు కూడా చోటు చేసుకోవడం ప్రజలను మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు మండలంలో ఏడుగురు అనాధికారికంగా కరోనాతో మృతిచెందినట్లు సమాచారం. తాజాగా శుక్రవారం పర్చూరులో ఓవ్యక్తి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు వీఆర్‌డీఎల్‌ పరీక్షలకు స్వాబ్‌ ఇచ్చినప్పటికీ, ఫలితాలు రావడంలో జాప్యం జరుగుతోందని విమర్శలున్నాయి.

పాఠశాలలను కూడా వీడని కరోనా

కరోనా పాఠశాలలకు కూడా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని చెరుకూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఆరుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మండల కేంద్రమైన పర్చూరులోని పలు ప్రైవేటు పాఠశాలల్లో కూడా కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. 

ఇంకొల్లు : పోలీసు సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి కరోనా భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌ సూచించారు. స్ధానిక రవి గార్డెన్స్‌లో ఇంకొల్లు సర్కిల్‌ పరిధిలోని చినగంజాం, పర్చూరు, ఇంకొల్లు మండలాల సిబ్బందికి కరోనా వైర్‌సపై అవగాహన కలిగించారు. అనంతరం సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హుస్సైన్‌ ,ఎస్సై ప్రసాద్‌,పర్చూరు ఎస్సై రమణయ్య,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

చీరాలటౌన్‌ : కొవిడ్‌ -19 టీకా వేయించుకున్నా, ప్రజలు తప్పని సరిగా భౌతికదూరం పాటించాలని చీరాల ఆర్టీవో అమర్‌ నాయక్‌ అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాలలో నాయక్‌ రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేయించు కున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్‌ వేయించుకోవడంలో ప్రజలు అపోహ పడొద్దన్నారు. అలాగే కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మార్టూరు :  మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం నుంచి ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని తహసీల్దారు ఈదా వెంకటరెడ్డి శుక్రవారం తెలిపారు. సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, చిల్లర దుకాణాలు తదితర అన్ని దుకాణాలు 12 గంటల వరకే పనిచేయాలన్నారు. 10 రోజుల వరకు ఈ నిబంధనలుఅమలులో ఉంటాయన్నారు. రెండవ విడత కరోనాతీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, కట్టడి చర్యలు తీసుకున్నామన్నారు.

Updated Date - 2021-04-24T05:23:10+05:30 IST