ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు

ABN , First Publish Date - 2021-04-23T06:26:26+05:30 IST

తెలంగాణ సారస్వత పరిషత్‌ మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో నిర్వహించిన గ్రంథ రచనల పోటీల ఫలితాలను గురువారం ప్రకటించింది.

ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు

అఫ్జల్‌గంజ్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సారస్వత పరిషత్‌ మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో నిర్వహించిన గ్రంథ రచనల పోటీల ఫలితాలను గురువారం ప్రకటించింది. 2021 సంవత్సరానికి వచన కవిత్వంలో నాగరాజు రామస్వామి రచించిన విచ్చుకున్న అక్షరం, పద్యగేయ కవిత్వంలో డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ రచించిన వడ్డేపల్లి రాగరామాయణం గ్రంథాలు పురస్కారానికి ఎంపికయ్యాయి. కథా ప్రక్రియలో కేవీ నరేందర్‌ రచించిన కథమానం భవతి నూటొక్కకథలు, నవల ప్రక్రియల్లో పరవస్తు లోకేశ్వర్‌ ‘కల్లోల కలల కాలం’, విమర్శ ప్రక్రియలో కేపీ అశోక్‌కుమార్‌ రచించిన ‘తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం’ ఇతర ప్రక్రియల విభాగంలో అన్నవరం దేవేందర్‌ రాసిన ‘ఊరిదస్తూరి’ గ్రంథం పురస్కారానికి ఎంపికయ్యాయి. యువ పురస్కారం విభాగంలో తగుళ్ల గోపాల్‌ రచించిన ‘దండకడియం’ ఎంపికైందని సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రధాన ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు రూ. 20 వేలు, యువ పురస్కారానికి రూ. 10 వేలు అందజేస్తామన్నారు. మహిళల విభాగంలో పురస్కారానికి తగిన ఎంట్రీలు రాలేదని చెప్పారు. 2019, 2020 సంవత్సరాల్లో ప్రచురితమైన గ్రంథాలను పోటీకి ఆహ్వానించారు. జన్మతః తెలంగాణ వారికే ఈ పోటీ పరిమితిని మొదట్లోనే స్పష్టం చేశారు. ఒక్కో ప్రక్రియలో ముగ్గురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కొవిడ్‌ పరిస్థితులు చక్కబడిన తర్వాత పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ఎల్లూరి శివారెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-04-23T06:26:26+05:30 IST