అవార్డులు - అరాచకాలు

ABN , First Publish Date - 2021-03-29T07:51:38+05:30 IST

ఒక పరీక్షలో టాప్‌ మార్క్స్‌ వచ్చినవాళ్లకు సాధారణంగా చప్పట్లు దక్కుతాయి. అదే - పరీక్షలో కాపీ కొట్టో, లేదా కౌంటింగ్‌ రాంగ్‌ అయ్యో, లేదా కంప్యూటర్‌ మిస్టేక్‌...

అవార్డులు - అరాచకాలు

ఒక పరీక్షలో టాప్‌ మార్క్స్‌ వచ్చినవాళ్లకు సాధారణంగా చప్పట్లు దక్కుతాయి. అదే - పరీక్షలో కాపీ కొట్టో, లేదా కౌంటింగ్‌ రాంగ్‌ అయ్యో, లేదా కంప్యూటర్‌ మిస్టేక్‌ వలననో టాప్‌ మార్క్స్‌ వచ్చినా - వాళ్లకు కూడా చప్పట్లు దొరుకుతాయి. కానీ అవి నిలబడవు. ఈ మధ్య ప్రకటించిన కేంద్ర సాహితీ అవార్డుల పరంపర కూడా అలాంటిదే. ఈ మధ్యే కాదు- కొద్ది సంవత్సరాల నుండి జరుగుతున్న తంతు ఇదే !


నిజానికి 1944లో ‘రాయల్‌ ఏషియాటిక్‌ సొసైటీ’ సాహిత్యాన్ని ప్రోత్సాహించాలని అందుకు కొన్ని ప్రభుత్వ ట్రస్టులను ప్రత్యేకంగా ఏర్పరచాలని మొదటగా ప్రతిపాదించినా, చివరికి 1952లో అప్రూవ్‌ అయ్యి 1954లో అకాడెమీ ఏర్పాట య్యింది. అప్పటి నుండి ఇప్పటి దాకా ఎన్నో సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటిస్తూ వచ్చారు. ఇంగ్లీషు, సంస్కృతంతో సహా పలు భాషల్లో ప్రకటిస్తున్నారు. ప్రధాన అవార్డుతో పాటు యువ పురస్కారం కూడా ప్రకటిస్తూ వస్తున్నారు.


ఇప్పటివరకు ఈ అవార్డు గ్రహీతల్లో సురవరం ప్రతాపరెడ్డి, సినారె, బోయి భీమన్న, తాపీ ధర్మారావువంటి చేయితిరిగిన సాహితీవేత్తలు మొదలుకొని అవార్డు వచ్చినవాళ్ళు వందల్లో ఉంటారు. ఈ జాబితాలో- శ్రీశ్రీ, చెరబండరాజు, కాళోజీ, అల్లం రాజయ్య, బజరా, వరవరరావు, అలిశెట్టి ప్రభాకర్‌ లాంటి వాళ్ళు ఎవరూ లేరు. కొందరు ఇందులో అవార్డు ప్రకటించక ముందే తిరస్కరించిన వారున్నారు. అవార్డులు వచ్చిన చాలామంది సాహితీవేత్తలతో వీరిని పోలిస్తే, అవార్డులు పొందని, స్వీకరించనివాళ్ళ సాహితీ ప్రయోగాలు వినూత్నమే కాక, ప్రమాణాలు కూడా చాలా మెరుగైనవి.


ఈ మధ్య సాహిత్య అకాడెమీ అవార్డులలో అడపా దడపా దళితులకు మైనారిటీలకు అక్కడక్కడ చోటు కలిపించినా - ఇందులో anti-establishment రచనలను ఉద్దేశ్యపూర్వ కంగా ఎలిమినేట్‌ చేస్తున్నారు. ఈ సెక్షన్స్‌ నుండి ఉన్న రచయితలను appropriate చేసుకునే ప్రక్రియలో భాగంగానే వారికి చోటు కలిపించడం జరుగుతోంది తప్ప - నిజంగా ఇక్కడ గొప్ప సాహితీ ప్రయోగాలు జరిగాయనీ కాదు, ఇవి గొప్పగా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చాయనీ కాదు. ఈ దళిత వెనుకబడిన వర్గాల రచయితలకు ఎరవేసి తొలి అడుగు ల్లోనే pro-establishmentగా తిప్పుకునే ఉద్దేశ్యం తప్ప, దళిత బహుజన వర్గాలకు సముచితమైన స్థానం కల్పించాలని కాదు. ఆయా నిమ్న వర్గాల రచనలలో మిన్నగా ఉన్న సాహితీ ప్రక్రియలను ప్రోత్సహించే ఉద్దేశ్యమూ కాదు.  


అకాడెమీ రెఫరీలకు, జ్యూరీకి- రచయితలు/ రచయిత్రులు కేవలం రచనల ద్వారా మాత్రమే తెలియాల్సిన అవసరం ఏనాడూ గుర్తింప బడలేదు. గత దశాబ్ద కాలంలో అవార్డులను గమనిస్తే- అకాడమీ సభ్యులకు రచయితలతో అప్పటికే ప్రత్యక్ష పరిచయాలు, సంబంధాలు ఉన్న సందర్భాలే ఎక్కువ. ఇటువంటి పరిస్థితి లో- ఎటువంటి తటస్థతను మనం ఆశించ గలము? రెఫరీలు రెకెమెండ్‌ చేస్తున్నప్పుడే ఈ అవార్డు ఎటుపోతుందో తెలిసిపోతుంది. నిజానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఒక పారదర్శకమైన, శాస్త్రీయమైన ప్రమాణాలతో, అన్ని వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం ఉండేలా విలువలు, కొలతలు ఏర్పరిచి రచనలను ఎన్నుకున్న దాఖలాలు లేవు. అకాడెమీ సభ్యులు ఫేవరిటి జమ్‌కు పాల్పడుతున్నారు అంటే అది పూర్తిగా వాళ్ళ తప్పు కాదు. అకాడెమీ కొన్ని ప్రమాణాలు పబ్లిక్‌తో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపికైన రచనలను, ఎంపికకు కారణాలను, వాటితో పాటు ఆ రచనల సాంఘిక నేపథ్యాన్ని వివరంగా పబ్లిక్‌తో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపిక పద్ధతి మూడు నాలుగు స్వతంత్ర కమిటీలనుంచి వెళ్ళవలసిన అవసరం ఉంది. నిజానికి కేంద్ర సాహిత్య అకాడెమీ రెఫరీ, జ్యూరీల వివరాలు ప్రాచుర్యంలో ఉండరాదు. కానీ దురదృష్టం ఏమంటే - అందరూ అందరికీ తెలుసు. దీనివల్ల నెట్‌వర్కింగ్‌, public relations అన్నవి రచయితకు ఉండాల్సిన ఒక స్పెషల్‌ స్కిల్‌గా తయారయ్యింది. ఈమధ్య వచ్చిన అవార్డులను పరిశీలిస్తే తండ్రో, కుటుంబ మిత్రుడో, peer relation ఉన్నవాళ్ళో ఈ అకాడెమీలో ఉండడం జరుగుతోంది. వచ్చే ఏడాది జాబితాలో ఉండే అకాడెమీ అవార్డు విన్నర్లు ఎవరో - అంతో ఇంతో సాహితీ పిపాస ఉన్న వాళ్లకు ఇప్పటికే తెలుసు అంటే అతిశయోక్తి కాదు. ఎంతో ఉన్నతమైన ఉద్దేశ్యంతో ఏర్పడ్డ ఈ సాహిత్య అకాడెమీ వ్యవస్థ ఫేవరిటిజానికీ, నెపోటిజానికీ బలైపోయింది.


సాహిత్య అకాడమీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దడం అవసరం. వీలైతే దీనిని ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకురావాలి. ప్రజలకు జవాబు దారీగా ఉండే వ్యవస్థగా మార్చాలి. 


మనం నిర్దిష్ట సాహితీ క్రియకు వచ్చిన అవార్డు వ్యవహారాన్ని విశ్లేషించి చూడవచ్చు. ఐతే ఈ వ్యాస ఉద్దేశ్యం ఒక రచయితనో రచ యిత్రినో విశ్లేషణ పేరుతో demean చేయడం కాదు గనుక, అందునా ఇవన్నీ సాహితీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విష యాలే కాబట్టి, ఈ సాహితీ ప్రోత్సాహకాన్ని కాపాడుకోవాలి అనే పరిధిలోనే రాస్తున్నాను. ఒకప్పుడు వ్యక్తిత్వ విలువలున్న బోయి భీమన్న లాంటి వాళ్లు అవార్డు గ్రహీతలుగా ఉన్నారు. ఈ రోజు కెరీరిజంలో కొట్టుకుపోయిన రచయితలు, రచయిత్రులే కనిపిస్తున్నారు. అంతే తప్ప ప్రజాస్వామిక విలువలకు లోబడి, నిబద్ధత కలిగి, వినూత్నంగా సాహితీ విలువలను ప్రక టించే రచనలు బహుకొద్దిగా ఉన్నాయి. సగం సాహిత్యం అర్బన్‌ నక్సల్స్‌ అని కొట్టివేయగా, మిగిలినదానిలో సగం కెరీరిజం తినేయగా, ఆ మిగతా సగం కమర్షియల్‌, సినిమా సాహిత్యా లకు పరిమితం అవుతున్నాయి. మరి మనకు నిజంగా, గర్వంగా టాప్‌ మార్క్‌ వచ్చిందని చెప్పుకునే అవకాశం ఏది? అది ఎప్పుడు సంపాయించుకోగలం?

పి. విక్టర్‌ విజయ్‌ కుమార్‌


Updated Date - 2021-03-29T07:51:38+05:30 IST