అక్కడ అవార్డులు.. ఇక్కడ తిట్లా?

ABN , First Publish Date - 2022-10-02T09:13:24+05:30 IST

‘తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

అక్కడ అవార్డులు.. ఇక్కడ తిట్లా?

  • స్వార్థ ప్రయోజనాల కోసమే విషబీజాలు
  • ఇది ఏ రకంగానూ సమర్థనీయం కాదు
  • కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్‌ ధ్వజం
  • నవ భారత్‌ దిశగా అడుగేయాలని పిలుపు
  • హనుమకొండలో ప్రతిమ వైద్య కాలేజీ ప్రారంభం
  • ఇవేం పనులు.. ప్లాన్‌ ప్రకారమే కడుతున్నారా?
  • సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై సీఎం గుస్సా


ఓరుగల్లు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఫైనాన్షియల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా చెప్పుకొనే ముంబై నగరం రాజధానిగా ఉన్న మహారాష్ట్రను మించి తలసరి ఆదాయం, జీఎ్‌సడీపీ పెరుగుదల, తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. పరిశుభ్రత.. పచ్చదనం.. చెట్లు పెంచడం.. ఇలా ఏ రంగంలో చూసినా ముందుంది. కేవలం రాజకీయాల కోసమే కేంద్ర మంత్రులు ఇక్కడకు వచ్చి తిడుతున్నారు.. ఢిల్లీకి వెళ్లి అవార్డులు ఇస్తున్నారు’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సహనం, ప్రేమతో ఉండే దేశంలో కొందరు దుర్మార్గులు తమ స్వార్థ, నీచ రాజకీయ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది ఏ రకంగానూ సమర్థనీయం కాదన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో శనివారం ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ప్రతిమ కేన్సర్‌ ఆస్పత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు.


 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ప్రజలకు తాను చెప్పింది.. వందకు వంద శాతం సాకారం అవుతోందన్నారు. తెలంగాణలో ప్రతిఫలిస్తున్న అద్భుతమైన చైతన్యం, సహకరిస్తున్న స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. వైద్య రంగంలో రాష్ట్రం ఎన్నో అద్భుతాలను సృష్టించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఐదు మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 17కు పెరిగిందని గుర్తు చేశారు. వివక్షతతో కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వకున్నా స్వయం కృషితో కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. 2014కు ముందు రాష్ట్రంలో ప్రైవేట్‌, ప్రభుత్వ రంగంలో కలిపి 2,800 మెడికల్‌ సీట్లు ఉండగా, ఈ రోజు 6,500కి పెరిగాయన్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్‌ కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తే సీట్ల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉందని తెలిపారు. పీజీ సీట్లు కూడా గతంలో 1,150 ఉంటే.. ఇప్పుడు 2,500కు చేరాయన్నారు. 33 జిల్లాల్లో 33 మెడికల్‌ కళాశాలలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యువకుడు హరీశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని, ఆ కలను తప్పకుండా సాకారం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇక.. వైద్య విద్య కోసం రాష్ట్ర విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.


119 నియోజకవర్గాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ 

‘‘ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగు నియోజకవర్గాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ను పూర్తి చేశాం. అక్కడ ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను రికార్డు చేశాం. ఒక వ్యక్తికి ఏ రకమైన జబ్బు వచ్చినా బటన్‌ నొక్కితే మొత్తం వివరాలు తెలుస్తాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు చేపడతాం.. ఇది పూర్తయితే ఎవరికి, ఎక్కడ, ఏరకమైన ఆరోగ్య సమస్య వచ్చినా ఒక్కటే నిమిషంలో వారి ఆరోగ్య నివేదిక కంప్యూటర్‌లో వస్తుంది’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ను మించి వరంగల్‌లో రెండు వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి రానున్నదని చెప్పారు. చికిత్స కోసం వరంగల్‌ ప్రజలు హైదరాబాద్‌కు రావడం కాదు.. హైదరాబాద్‌ ప్రజలే వరంగల్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ములుగులో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దుకునే బాధ్యత విద్యార్థులు, యువకులపైనే ఉందని కేసీఆర్‌ అన్నారు. మేధావులు ముందుకు వస్తేనే సమాజం చైతన్యవంతంగా ఉంటుందన్నారు. నవ భారతంలో నవ సమాజ నిర్మాణం దిశగా యువత అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్నంత సంపద ఏ దేశంలోనూ లేదని, ప్రపంచానికే అన్నపూర్ణగా నిలుస్తోందని పేర్కొన్నారు. అమెరికాలో వ్యవసాయ అనుకూల భూమి 29 శాతం ఉంటే.. చైనాలో 16 శాతమే ఉందని, భారత్‌లో సుమారుగా 50శాతం(41కోట్ల ఎకరాలు) ఉందని వివరించారు. ప్రపంచానికే ఒక ఫుడ్‌ చైన్‌ను అందించాల్సిన భారత్‌.. ఇప్పుడు వంచించబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో 13నెలల పాటు లక్షల మంది రైతులు ధర్నా చేశారని, ఇన్ని వనరులున్నా ఎందుకు చేశారో ఆలోచించాలని కోరారు. 


వినతిపత్రం.. వీఆర్‌ఏల మీదకే విసరేసి..

‘ఏం తమాషా  చేస్తున్నారా? ఏం పనిలేదా? మీకు బాగా ఎక్కువైతంది.. మొన్ననే చెప్పినం కదా.. అర్థం కాదా.. ఎందుకు ఇవన్నీ చేస్తున్నరు..’అంటూ వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంటి వద్ద సీఎంను కలిసేందుకు వీఆర్‌ఏలు ప్రయత్నించారు. చివరకు ఎమ్మెల్యే వొడితెల సతీష్‌ ద్వారా కొంత మంది సీఎంను కలిశారు. చాలా కాలంగా సమ్మె చేస్తున్నామని వివరించే ప్రయత్నం చేస్తుండగా.. కేసీఆర్‌ భగ్గుమన్నారు. కాగా, కేసీఆర్‌.. వినతిపత్రాన్ని చూడకుండానే తమ మీదకు విసిరేశారని వీఆర్‌ఏల సంఘం నేతలు తెలిపారు. సమ్మె విరమించి వస్తేనే ఆలోచిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఏలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


‘గాంధీ’లో 16 అడుగుల మహాత్ముడి విగ్రహం!

నేడు ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ సిటీ: గాంధీ ఆస్పత్రిలో 16 అడుగుల ఎత్తైన మహాత్మగాంధీ కంచు విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం ఆవిష్కరించనున్నారు. ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద జ్ఞాన ముద్రలో ఉన్న జాతిపిత విగ్రహాన్ని 5 టన్నుల కంచుతో తయారు చేశారు. ఇందుకోసం రూ.1.25 కోట్లు, విగ్రహం చుట్టూ 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా అభివృద్ధి చేసేందుకు మరో రూ.కోటి వెచ్చించారు. సీఎం రాక నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.


ఇలాగైతే ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు?

హనుమకొండ అర్బన్‌: వరంగల్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం పనులు ఇవి.. ప్లాన్‌ ప్రకారమే కడుతున్నారా.. ఇలాగేనా పనులు జరిగేది... ఇంత చెత్తగా ఉంది.. ఇలాగైతే భవనాలు పూర్తయ్యేది ఎప్పుడు?’ అని నిలదీశారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో చేపట్టిన సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆస్పత్రి భవనాల నమూనా, ప్లాన్లు, ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. వారి సమాధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. గడువులోగా పనులు పూర్తయ్యేట్టు చూడాలని గట్టిగా చెప్పినట్టు సమాచారం. కాగా, ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావును సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన అనంతరం హనుమకొండలోని కెప్టెన్‌ నివాసానికి వచ్చిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నేతలతో కలిసి టీ, స్నాక్స్‌ తీసుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన మక్కల గారెలను ఇష్టంగా ఆరగించారు.

Updated Date - 2022-10-02T09:13:24+05:30 IST