రొమ్ము కేన్సర్‌

Dec 15 2020 @ 13:35PM

ఆంధ్రజ్యోతి(15-12-2020)

కచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు


రొమ్ము కేన్సర్‌ గురించి అవగాహన ఏర్పరచుకోవడం ఎంతో అవసరం. వ్యాధి ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ? ఎలాంటి లక్షణాలతో ఈ వ్యాధి బయల్పడుతుంది? 


రొమ్ము కేన్సర్‌ లక్షణాలు

 రొమ్ములో కణితి

 రొమ్ముల్లో, బాహుమూలల్లో గడ్డలు లేదా వాపు 

 చనుమొన సైజులో మార్పు, మొనలు లోపలికి తిరిగి ఉండడం

 రొమ్ము పైచర్మం మందంగా తయారవడం, రంగులో మార్పు

 రొమ్ము మీద నయం కాని పుండు

 చనుమొన నుంచి రక్తస్రావం


ఈ లక్షణాలు కనిపించే సమయానికే రొమ్ము కేన్సర్‌ తొలి దశ దాటిపోయే ప్రమాదం ఉంది. కేన్సర్‌ కణితి రకం, గ్రేడింగ్‌ ఆధారంగా సర్జరీ, కీమో, రేడియేషన్‌, హార్మోన్‌ థెరపీ నిర్ణయిస్తారు. 


వంశపారంపర్యమా?

పెరిగే వయసుతో పాటు రిస్క్‌ కూడా పెరుగుతుంది. జెనెటిక్‌ కోడ్‌ ఆధారంగా కొన్ని కుటుంబాలలో ఈ కేన్సర్‌ వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువ. అలాగని ఫ్యామిలీ హిస్టరీలో లేనివాళ్లకు ఈ కేన్సర్‌ రాదనీ చెప్పలేం. కాబట్టి 30 ఏళ్ల మొదలు ప్రతి మహిళా రొమ్ము కేన్సర్‌ పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి.


కుటుంబ చరిత్రలో రొమ్ము కేన్సర్‌ ఉంటే?

ఫ్యామిలీ హిస్టరీలో రొమ్ము కేన్సర్‌ వచ్చినవాళ్లు ఉంటే, ఈ కేన్సర్‌ను ముందుగానే పసిగట్టడానికి బిఆర్‌సిఎ1, బిఆర్‌సిఎ2 జెనెటిక్‌ పరీక్షలు చేయించుకోవచ్చు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే వైద్యుల సూచనమేరకు ముందుగానే రొమ్ములను తొలగించుకోవడం లేదా పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండడం చేయాలి. మహిళ వయసు, పరీక్షా ఫలితాల ఆధారంగా తీసుకోవలసిన నిర్ణయం గురించి వైద్యులు నిర్ణయిస్తారు.


వీరికి ప్రమాదం ఎక్కువ!


1. దగ్గరి బంధువుల్లో ఈ కేన్సర్‌ ఉన్నప్పుడు (అమ్మ, అమ్మమ్మ, మేనత్త, అక్క, చెల్లెలు)


2. వాళ్లు 40 ఏళ్లకంటే చిన్న వయసులోనే కేన్సర్‌కు గురయినప్పుడు


3. రెండు రొమ్ములూ కేన్సర్‌కు గురైన కుటుంబాల్లో


4. కుటుంబానికి చెందిన పురుషుల్లో కూడా కేన్సర్‌ బయల్పడ్డప్పుడు


5. కుటుంబ సభ్యుల్లో ఇతర కేన్సర్లు కనిపించడం లేదా అండాశయాల కేన్సర్‌కు గురవడం


6. జీన్‌ మ్యుటేషన్‌ బలంగా ఉండడం, పెళ్లి, పిల్లల విషయాల్లో ఆలస్యం, సంతానలేమికి హార్మోన్ల మందులు ఎక్కువగా వాడడం, పదేళ్ల కంటే చిన్న వయసులో రజస్వల కావడం, 50 ఏళ్లు పైబడినా నెలసరి ఆగకపోవడం, అధిక బరువు తోడవడం 


పెంపొందించుకోవలసిన అవగాహన

రొమ్ముల్లో నొప్పి లేని గడ్డలను నిర్లక్ష్యం చేయకూడదు. 20 ఏళ్ల నుంచే రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలి. 30 ఏళ్లు పైబడిన తర్వాత అలా్ట్రసౌండ్‌, డిజిటల్‌ మామోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలతో గడ్డ చేతికి తగలని సైజులో ఉన్నప్పుడే కనుక్కోగలుగుతారు. లావుగా ఉండే మహిళల్లో, పెద్ద రొమ్ములు కలిగిన వాళ్లకు మాత్రమే రొమ్ము కేన్సర్‌ వస్తుందనేది నిజం కాదు. కేన్సర్‌ ఎవరికైనా రావచ్చు.


డాక్టర్‌ సిహెచ్‌.మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.ఫోన్‌: 9848011421


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.