బిజ్వార్ గ్రామంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారి రజిత
తాండూరు రూరల్, జూన్ 25 : తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు మండలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగుపై 170 ఎకరాలు ఎంపికైనట్లు తాండూరు వ్యవసాయ శాఖ ఏడీఏ రుద్రమూర్తి తెలిపారు. ఎంపికైన భూముల్లో రాశి-665 పత్తి రకంపై వ్యవసాయాధికారుల ద్వారా రైతులను ఎంపిక చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. తాండూరు మండలంలో బిజ్వార్లో 26 మంది రైతులకు చెందిన 55 ఎకరాలు, బషీరాబాద్ మండలంలో నావల్గ, కాశీంపూర్లో 50ఎకరాలు, యాలాల మండలంలో జుంటుపల్లి, తిమ్మాయిపల్లిలో 70ఎకరాలను గుర్తించి అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా, తాండూరు మండలంలో వ్యవసాయాధికారి రజిత బిజ్వార్ గ్రామంలో 25 మంది రైతులను ఎంపిక చేసి 55 ఎకరాలు గుర్తించి రాశీ-665 పత్తి రకంపై అవగాహన కల్పించారు. గతంలో ఒక ఎకరాలో 6వేల నుంచి 7,500 పత్తి విత్తనాలు నాటేవారని, ప్రస్తుతం అధిక సాంద్రత పద్ధతిలో 25వేల పత్తి విత్తనాలు నాటేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏవో రజిత తెలిపారు. రైతుకు ఐదు ప్యాకెట్ల విత్తనాలతోపాటు 4వేల పెట్టుబడి సాయం కూడా అందజేయడం జరుగుతుందని ఏవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ సాయిలు, రైతులు పాల్గొన్నారు.