చైతన్యం ఎవరికో?

ABN , First Publish Date - 2021-07-21T05:55:34+05:30 IST

రైతు చైతన్య యాత్రలకు జిల్లాలో కర్షకుల నుంచి స్పందన కరువైంది.

చైతన్యం ఎవరికో?
నేకునాంపురంలో వెలవెలబోతున్న రైతు చైతన్య సభ

తూతూమంత్రంగా రైతు చైతన్యయాత్రలు

పలుచోట్ల రైతుల నుంచి కొరవడిన స్పందన

మొక్కుబడిగా నిర్వహించి వెళ్లిపోతున్న అధికారులు, 

రాయితీ యంత్రాలు, సూక్ష్మపోషకాలు కోరుతున్న రైతులు 

తాళ్ళూరు-1 సచివాలయ పరిధిలో జరిగిన రైతు సదస్సులో వివిధ శాఖల అధికారులు సిబ్బంది 12 మంది ఉండగా రైతులు 15మంది హాజరయ్యారు. ధాన్యం కొనే దిక్కులేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నామని అధికారుల ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

రాచర్ల మండలంలో ఇప్పటికే ఎనిమిది చోట్ల చైతన్య సదస్సులు నిర్వహించారు. అయితే రైతులు మాత్రం కేవలం ముగ్గురు నుంచి ఐదుగురు మాత్రమే హాజరవుతున్నారు. ఐదారు సభలకు ఏవో ఒక్కరే అన్నీ తానై కొనసాగారు. గత మూడు రోజులుగా మిగతా అధికారులు వస్తున్నారు. సర్పంచ్‌లతో రైతులను పిలిపించుకుని ఆర్బీకేల్లో కూర్చోబెట్టి మమ అనిపిస్తున్నారు. 

ఒంగోలు మండలంలో రైతుచైతన్య యాత్రల్లో రైతులు గిట్టుబాటు ధరలు, రాయితీ యంత్రాలపై అధికారులను ప్రశ్నిస్తున్నారు. సబ్సిడీపై ట్రాక్టర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీడ్‌, ఫీడ్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రొయ్యలకు మాత్రం ధరలు లేవని ఆక్వా రైతులు నిలదీస్తున్నారు. 

ఇదీ జిల్లాలో రైతు చైతన్య యాత్రల తీరు. వందలాది మంది రైతులు ఉన్న గ్రామాల్లో సైతం పదిమంది కూడా ఈ సదస్సుల్లో కనిపించడం లేదు. అధికార పార్టీకి బాగా పట్టు ఉండే గ్రామాల్లో సైతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అధికారులు మొక్కుబడిగా రైతు చైతన్యయాత్రలు నిర్వహించి వచ్చేస్తున్నారు. అదేసమయంలో ఆయా గ్రామాల్లో సదస్సులకు వచ్చిన కొద్దిమంది కూడా ప్రభుత్వ పథకాలపై పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ పరికరాలు వ్యక్తిగతంగా కాకుండా గ్రూపులకు ఇవ్వడం, రాయితీపై ఇచ్చే సూక్ష్మ పోషకాలు నిలిపివేత వంటి వాటిపై ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలపై నిలదీస్తున్నారు. దీంతో అధికారులు నీళ్లునములుతున్నారు.  


ఒంగోలు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రైతు చైతన్య యాత్రలకు జిల్లాలో కర్షకుల నుంచి స్పందన కరువైంది. వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆయా రంగాల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అది తూతూమాత్రంగా జరుగుతున్నదని మంగళవారం ఆంధ్రజ్యోతి బృదం పరిశీలనలో తేలింది. 


ఆర్బీకే యూనిట్‌గా..

ఈ ప్రభుత్వం వచ్చాక నూతనంగా తెచ్చిన రైతుభరోసా కేంద్రం(ఆర్‌బీకే) యూనిట్‌గా ఆ పరిధిలోని రైతులతో ఈనెల 9 నుంచి చైతన్య యాత్రలు చేపట్టింది.  వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యం, వాటిలో అమలు చేస్తున్న పథకాలు, అధిక ఉత్పత్తి సాధన కోసం మేలైన సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడమే వీటి ముఖ్య ఉద్దేశం. మండలం యూనిట్‌గా ఆ పరిధిలో రోజుకు ఒకటి లేదా రెండు ఆర్బీకేలలో ఈ తరహా సదస్సులకు జిల్లా వ్యవసాయశాఖ నిర్వహించాలి. మండలస్థాయిలోని వ్యవసాయాధికారి (ఏవో) నేతృత్వంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల అధికారులతోపాటు కొన్నిచోట్ల మత్స్యశాఖ ఇతర అధికారులతో కూడిన బృందాలు ఆర్బీకేలకు వెళ్లి రైతులతో చర్చించాల్సి ఉంది. అలా లెక్కకు జిల్లాలో రోజుకు 50 నుంచి 100వరకు ఆర్బీకేలలో సదస్సులు నిర్వహిస్తుండగా సగటున 40మంది లోపే రైతులు హాజరవుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.


రైతులు లేని సదస్సులు

జిల్లాలో 906 ఆర్బీకేల్లో ఈనెల 9నుంచి 23 వరకు రైతు చైతన్య యాత్రల నిర్వహణకు షెడ్యూల్‌ను అధికారులు రూపొందించారు. ఇప్పటివరకు 782 చోట్ల పూర్తయ్యాయి. అందులో 69 ఆర్బీకేల్లో మంగళవారం సభలు జరిగాయి. అయితే  ఈ సదస్సులకు రైతుల నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు జరిగిన 782 సదస్సులకు 29,921 మంది హాజరయ్యారు. అంటే సగటున 30 నుంచి 35 మంది మించి ఉండటం లేదు. కొన్నిచోట్ల 10 నుంచి 15మంది కూడా రాక మమఅనిపిస్తున్నారు. నిజానికి జిల్లా వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 4.32 లక్షల చిన్న, 1.77 లక్షలు సన్నకారు మరో 1.12 లక్షలు ఇతర రైతులు కలిపి మొత్తం 7.22 లక్షలమంది రైతులు ఉన్నారు. రైతుభరోసా అందుకుంటున్న వారిని చూసినా దాదాపు 4.10 లక్షల మంది ఉన్నారు. అలా గ్రామాల్లో వందలసంఖ్యలో రైతులు ఉంటుండగా పట్టుమని పదిశాతం మంది కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు చైతన్య సదస్సులకు రావడం లేదు. 


ఇదీ యాత్రల పరిస్థితి

ఆయా ప్రాతాల్లో అధికారులు ప్రభుత్వ పథకాలను, ప్రస్తుత సీజన్‌లో పంటల సాగు మెళకువలను వివరిస్తుండగా రైతులు మాత్రం గ్రూపులకు కాకుండా వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు ఇవ్వాలని, సూక్ష్మ పోషకాలను నూరుశాతం రాయితీపై ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కందిపంటకు కూడా బీమా వర్తింపు, సబ్సిడీపై కంది, వరి విత్తనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, రాయితీపై బిందు, తుంపర సేద్యపు పరికరాలు ఇవ్వాలని, శాస్త్రవేత్తలతో సూచనలు ఇప్పించాలని కోరుతున్నారు.

జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం జరిగిన రైతుచైతన్య యాత్రలను ఆంధ్రజ్యోతి బృందం పరిశీలించగా ఆవి తూతూమంత్రంగా జరగడం స్పష్టంగా కనిపించింది. వందలాది మంది రైతులు, రైతు కుటుంబాలు ఉండే గ్రామాల్లో పదులసంఖ్యలో కూడా రైతులు వీటికి హాజరు కావడం లేదు. అధికారులలో వ్యవసాయశాఖ వారు తప్ప మిగతా వారు పెద్దగా కనిపించడం లేదు.   అధికార పార్టీకి బలంగా ఉండే ప్రాంతాల్లో సైతం రైతులు లేక యాత్రలు వెలవెలబోతున్నాయి.

వీవీపాలెం మండలం నేకునాంపురంలో కొద్దిమంది రైతులతో జరగ్గా ఏవో ఒక్కరే వచ్చారు. గతేడాది అధికారులు చెప్పిన మినుము విత్తనం సాగు చేయగా దిగుబడి రాలేదని రైతులు ఆరోపించారు. పశుగ్రాస విత్తనాలు రాయితీపై అందజేయాలని కోరారు.

కొండపి మండలం చిన్నకండ్లగుంటలో జరిగిన కార్యక్రమంలో తక్షణం పంట సాగుకు వీలుగా కంది విత్తనాలు అందజేయాలని కోరారు. అలాగే ఇద్దరు రైతులు రైతు భరోసా డబ్బులు రాలేదన ఫిర్యాదు చేయగా మరికొందరు రాయితీ పరికరాలు వ్యక్తిగతంగా ఇవ్వాలని కోరారు. 

పర్చూరు మండలం రమణాయపాలెంలో జరిగిన సభలో రైతుల సంఖ్య తక్కువగానే కనిపించింది. జింకు, జిప్సం రాయితీపై ఇవ్వాలని, యంత్ర పరికరాలను వ్యక్తిగతంగా ఇవ్వాలని కోరడంతో పాటు మిర్చి విత్తనాలు తాము కోరుకున్న రకాలు దొరకడం లేదని ఆరోపించారు. 

కంభం మండలం ఎల్‌కోటలో జరిగిన కార్యక్రమంలో పంటల బీమా తమకు అందలేదని పలువురు రైతులు నిలదీయగా, దొనకొండ మండలం కొచ్చర్లకోటలో జరిగిన సభలో పలువురు రాయితీ విత్తనాలు, డ్రిప్‌, తైవాన్‌ స్రేయర్లను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

బేస్తవారపేట మండలం నేకునాంబాదులో జరిగిన రైతు సదస్సులో 12 మంది మాత్రమే హాజరు కాగా వరి విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. అలాగే చినగంజాం మండలం రాజుబంగారుపాలెంలో జరిగిన సభలో 20 మంది వరకు రైతులు హాజరు కాగా వివిధ రకాల వరి విత్తనాలపై చర్చించారు. రాచర్లలో జరిగిన రైతు సభలో సబ్సిడీపై ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితే జిల్లా అంతటా కనిపిస్తుండగా మొత్తం మీద తూతూ మంత్రంగా రైతుచైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. 











Updated Date - 2021-07-21T05:55:34+05:30 IST