అద్భుత విజయం

ABN , First Publish Date - 2021-01-20T09:18:15+05:30 IST

టెస్ట్‌క్రికెట్‌ చరిత్రలో మనం ఎన్ని ఘనతలు సాధించినా, ఆస్ట్రేలియన్లను వారి సొంతగడ్డపై ఓడించడమంటే అదో అద్భుతం. అదీ కంచుకోటగా...

అద్భుత విజయం

టెస్ట్‌క్రికెట్‌ చరిత్రలో మనం ఎన్ని ఘనతలు సాధించినా, ఆస్ట్రేలియన్లను వారి సొంతగడ్డపై ఓడించడమంటే అదో అద్భుతం. అదీ కంచుకోటగా మారిన వారి మైదానంలో కంగారూలకు కళ్లెం వేయడమంటే అంతకుమించిన విశేషం ఏముంటుంది? ఆసీస్‌ వేదికగా టెస్ట్‌ సిరీస్‌ విజయానికి రెండేళ్ల క్రితమే నాంది పలికిన భారత్‌, ఇప్పుడు వాళ్లకు గెలుపు అడ్డాగా మారిన గాబా మైదానంలో విజయఢంకా మోగించి కొత్త చరిత్రను సృష్టించింది.


బ్రిస్బేన్‌ పిచ్‌పై ఆటంటే విదేశీ ఆటగాళ్లు వణికిపోతారు. బెంబేలెత్తించే బౌన్సర్లు, రోజుకో రకంగా బంతి మెలికలు తిరిగే ఈ పిచ్‌పై ఆడడం ఆషామాషీ కాదు. అప్పుడెప్పుడో 1988లో వివ్‌ రిచర్డ్స్‌, మాల్కమ్‌ మార్షల్‌, ప్యాట్రిక్‌ పాటర్సన్‌, కర్ట్‌లీ ఆంబ్రోస్‌, కోట్నీ వాల్ష్‌లాంటి హేమాహేమీ ఆటగాళ్లున్న వెస్టిండీస్‌ జట్టు ఆ వేదికపై గెలుపందుకున్నది. అప్పటినుంచి ఇప్పటిదాకా గాబాలో విదేశీయులకు అందని ద్రాక్షలా మారిన విజయాన్ని అజింక్యా రహానె సారథ్యంలోని భారత జట్టు రుచి చూపించింది. ఇక్కడ వరుసగా 31 మ్యాచ్‌ల విజయాలతో దూసుకెళ్తున్న ఆతిథ్య జట్టు జోరుకు బ్రేకులు వేసింది. గాబాను జయించడంలో మహ్మద్‌ సిరాజ్‌, రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌లాంటి యువ ఆటగాళ్ల ప్రతిభ తోడవడం ఈ విజయంలో ప్రత్యేకం.


ఎన్నో ఒడుదుడుకుల మధ్య భారత జట్టు సుదీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటనను ప్రారంభించింది. యూఏఈలో ఐపీఎల్‌ ఆడి నేరుగా ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన కఠినమైన క్వారంటైన్‌ నిబంధనలను పాటిస్తూనే సిరీస్‌కు సిద్ధమైంది. గాయం కారణంగా రోహిత్‌ శర్మలాంటి కీలక ఆటగాడు లేకుండానే బరిలోకి దిగింది. తొలుత టీ20 సిరీస్‌ను 2–1తో గెలిచిన భారత్‌, 1–2 తేడాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ వెంటనే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ఆడిన జట్టు అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో దారుణంగా ఓటమిపాలైంది. ఎంతలా అంటే.. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ అయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. దీనికి తోడు సారథి విరాట్‌ కోహ్లీ పితృత్వ సెలవు కారణంతో స్వదేశానికి వచ్చేయడంతో అజింక్యా రహానె జట్టు పగ్గాలు స్వీకరించాల్సి వచ్చింది. అసలే ఓటమి బాధలో ఉన్న జట్టుకు అత్యుత్తమ ఆటగాడు దూరమవడంతో ప్రత్యర్థి జట్టు మాజీ క్రికెటర్లంతా భారత ప్రదర్శనపై చులకనగా మాట్లాడారు. కోహ్లీ లేకపోతే జట్టు సిరీస్‌ను 0–4తో కోల్పోవడం ఖాయమని రికీ పాంటింగ్‌, మార్క్‌ వా, బ్రాడ్‌ హాడిన్‌లాంటివారంతా జోస్యం చెప్పుకొచ్చారు. మైకేల్‌ క్లార్క్‌ ఓ అడుగు ముందుకేసి, విరాట్‌ లేకుండా భారత జట్టు తమ గడ్డపై గెలిస్తే ఏడాదిపాటు సంబరాలు చేసుకోవచ్చని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించాడు. ఇన్ని ప్రతికూలతల మధ్య రెండో టెస్ట్‌కు వేదికైన మెల్‌బోర్న్‌లో ఆడిన రహానే బృందం అమోఘమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. యువ కెరటాలు శుభ్‌మన్‌ గిల్‌ మెరుపు బ్యాటింగ్‌తో, హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన బౌలింగ్‌తో మెల్‌బోర్న్‌లో విజయాన్నందించి జట్టును 1–1తో పోటీలో నిలిపారు. మూడోదైన సిడ్నీ టెస్ట్‌లో ఓటమి అంచుల నుంచి గట్టెక్కి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో తెలుగు ఆటగాడు హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలకపాత్ర పోషించారు. తొడ కండరాల గాయం వేధిస్తున్నా, విహారి చివరి దాకా క్రీజులో నిలిచి జట్టుకు ఓటమిని తప్పించిన తీరు అందరినీ అబ్బురపరిచింది. అశ్విన్‌, బుమ్రా, జడేజాలాంటి సీనియర్లు గాయాలపాలవడంతో పూర్తిస్థాయి యువ జట్టుతోనే భారత్‌ ఆఖరిదైన బ్రిస్బేన్‌ టెస్ట్‌లో ఆడింది. ఈ సిరీస్‌లో సిరాజ్‌ చూపించిన తెగువకు యావత్‌ భారతావని హారతులు పడుతోంది. తన కెరీర్‌ తోడ్పాటులో కీలకపాత్ర పోషించిన తండ్రి మరణించినా, సిరాజ్‌ ఇంటికి రాకుండా దేశం కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. బాధను దిగమింగుకొనే మైదానంలోకి దిగిన అతను ఆఖరి మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసి తన తండ్రికి ఘనమైన నివాళి అర్పించాడు. 2001లో కోల్‌కతా వేదికగా ఇదే ఆస్ట్రేలియా జట్టుపై వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రావిడ్‌ ఆడిన చారిత్రక ఇన్నింగ్స్‌తో భారత టెస్ట్‌ క్రికెట్‌ పేరు ఏవిధంగా మార్మోగిందో, ఆ స్థాయి ప్రదర్శనను మరిపిస్తూ కుర్రాళ్లు సాధించిన ఈ సిరీస్‌ విజయం అద్భుతమైనది.

Updated Date - 2021-01-20T09:18:15+05:30 IST