టెస్టు క్రికెట్ చరిత్రలో అక్షర్ పటేల్ అరుదైన రికార్డు

ABN , First Publish Date - 2021-11-27T23:06:45+05:30 IST

టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో

టెస్టు క్రికెట్ చరిత్రలో అక్షర్ పటేల్ అరుదైన రికార్డు

కాన్పూరు:  టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో ఇక్కడి గ్రీన్‌పార్క్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఐదు వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్.. ఐదుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డులకెక్కాడు.


ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన హెర్బెర్ట్ హోర్డెర్న్ పేరుపై ఉంది. హెర్బెర్ట్ ఏడు మ్యాచుల్లో ఐదుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ ఐదు మ్యాచుల్లోనే ఆ ఘనత సాధించి హోర్డెర్న్ రికార్డును బద్దలుగొట్టాడు. అంతేకాదు, వరుసగా ఆరోసారి నాలుగు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్‌గానూ అక్షర్ రికార్డు సృష్టించాడు.  


నాలుగు మ్యాచుల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన వారిలో చార్లీ టర్నర్ (6సార్లు), టామ్ రిచర్డ్‌సన్/రోడ్నీ హగ్/అక్షర్ పటేల్ (5సార్లు), ఫ్రెడ్ స్పోఫోర్త్/సిడ్నీ బార్నెస్/నిక్ కుక్/వెర్నాన్ ఫిలాండర్ (నాలుగు సార్లు) ఉన్నారు. ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే ఎల్.శివరామకృష్ణన్, నరేంద్ర హిర్వాణీ ఉన్నారు. వీరు మూడేసి సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించారు. 

Updated Date - 2021-11-27T23:06:45+05:30 IST