అయోధ్యలో మళ్లీ అభిరాముడు

ABN , First Publish Date - 2020-10-10T05:49:47+05:30 IST

ధర్మంపై చల్లిన బురద దాదాపు మూడు దశాబ్దాల తరువాత తొలగిపోయింది. అధికార ప్రోద్బలంతో ‘అయోధ్య ఉద్యమకారులపై నమోదు చేసిన కుట్రపూరిత కేసు వీగిపోవడం....

అయోధ్యలో మళ్లీ అభిరాముడు

ధర్మంపై చల్లిన బురద దాదాపు మూడు దశాబ్దాల తరువాత తొలగిపోయింది. అధికార ప్రోద్బలంతో ‘అయోధ్య ఉద్యమకారులపై నమోదు చేసిన కుట్రపూరిత కేసు వీగిపోవడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఘనమైన ఘట్టం. ఎటువంటి నేరాలు, ఘోరాలకు పాల్పడకున్నా, కేవలం రాజకీయ దురుద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసు ఓ నిదర్శనం. కక్షపూరితంగా నమోదు చేసిన కేసు నీతి, నిజాయితీ ముందు నిలబడకపోవడం ధర్మ విజయానికి ప్రతీక. బాబర్‌ 1526 సంవత్సరంలో అయోధ్యపై దండయాత్ర చేసి రామమందిరాన్ని ధ్వంసం చేసిన సంగతి బహిరంగ రహస్యం. దానిని తిరిగి రామమందిరంగా తీర్చిదిద్దటం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటంలో చివరికి ధర్మమే గెలుపొందడం హిందువులందరికీ సంతోషకరమైన విషయం. 


బాబర్‌ కట్టించిన అక్రమ గుమ్మటాలను 1992 డిసెంబర్‌ 6న కొంతమంది రామభక్తులు ధ్వంసం చేశారు. కానీ ఆ సమయంలో అక్కడున్న విహెచ్‌పి, బిజెపి, శివసేన నాయకులు, సాధుసంతులు కరసేవకులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేశారంటూ మొత్తం 32 మంది ప్రముఖులపై అక్రమంగా కేసు నమోదు చేయటం న్యాయవ్యవస్థకే మచ్చ. ఇది  రాజకీయంగా కక్ష సాధించడం కోసం పెట్టిన కేసేననటంలో సందేహం లేదు. 26 సంవత్సరాల తరువాతైనా ఈ కేసు వీగిపోవటం శుభపరిణామం. బిజెపిని కట్టడి చేయడం కోసం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ కాంగ్రెస్‌, దాని అనుబంధ పార్టీలతో సహా సెక్యులర్‌ ముసుగు వేసుకున్న పార్టీలన్నీ మత రాజకీయాలను ప్రోత్సహించాయి. ఒక వర్గం వారిని సంతృప్తి పరచడానికి అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తూ మైనారిటీ సంక్షేమం పేరుతో మెజారిటీ ప్రజల నడ్డి విరిచాయి. 26 సంవత్సరాలుగా కోర్టును, అక్రమ కేసును అడ్డం పెట్టుకుని ప్రముఖులైన 36 మందిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన వారికి సెప్టెంబర్‌ 30, 2020న వెలువడిన తీర్పు చెంపపెట్టు లాంటిది. తీర్పు వెలువడిన తర్వాత కొంతమంది న్యాయవ్యవస్థపై అవాకులు, చెవాకులు పేలుతూ తమ అపరిపక్వతను చాటుకుంటున్నారు. ఇన్నాళ్లు అబద్ధాన్ని అడ్డం పెట్టుకుని, అధికారం చాటున కోర్టును నమ్మించి హిందూ సాధుసంతులను అవమానపరచిన వారంతా ‘అయోధ్య’ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాల్సిందే.


పగుడాకుల బాలస్వామి

ప్రచార సహప్రముఖ్‌, విశ్వహిందూ పరిషత్‌, తెలంగాణ

Updated Date - 2020-10-10T05:49:47+05:30 IST