విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రామాలయం ట్రస్ట్ స్పందన

ABN , First Publish Date - 2021-06-15T20:34:20+05:30 IST

రామాలయం నిర్మాణం కోసం సేకరించిన నిధుల దుర్వినియోగం జరిగినట్లు

విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రామాలయం ట్రస్ట్ స్పందన

అయోధ్య : రామాలయం నిర్మాణం కోసం సేకరించిన నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం స్పందించింది. తాము కొన్న భూమి అత్యంత విలువైనదని, ఇది రామాలయానికి చేరుకోవడానికి ప్రధాన రహదారి కాబోతోందని తెలిపింది. రోడ్డు పక్కనే ఈ భూమి ఉందని, త్వరలో ఈ రోడ్డు నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చెందబోతోందని పేర్కొంది. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ భూమి ఉందని తెలిపింది. అయోధ్యలో మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకు దీనిని కొన్నామని వివరించింది. 2011 నుంచి వేర్వేరు పార్టీల మధ్య ఈ భూమి కొనుగోలుకు ఒప్పందాలు కుదిరాయని, అయితే కొన్ని కారణాల వల్ల అవి అమలు కాలేదని వివరించింది. 


రామాలయం కోసం కొన్న భూమి విస్తీర్ణం 1.2080 హెక్టార్లు అని, ఒక చదరపు అడుగుకు రూ.1,423 చొప్పున కొన్నట్లు తెలిపింది. ఇది అయోధ్యలో వాస్తవ మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువ అని పేర్కొంది. ఈ భూమిని కొనడానికి న్యాస్ ఆసక్తి చూపిందని, అయితే ముందుగా యాజమాన్య హక్కులు స్పష్టంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపింది. అంతకుముందు ఉన్న అగ్రిమెంట్లను పూర్తిగా ఖరారు చేయాలని కోరిందని తెలిపింది. గత పదేళ్ళలో దాదాపు 9 మంది ఈ అగ్రిమెంట్లలో ఉన్నారని పేర్కొంది. వీరిలో ముగ్గురు ముస్లింలని తెలిపింది. 


వీరందరితోనూ చర్చించినట్లు, ఫలితంగా వీరంతా తమ పూర్వపు అగ్రిమెంట్లను పరిష్కరించుకునేందుకు సమ్మతించారని తెలిపింది. పాత ఒప్పందాలు పరిష్కారమైన తర్వాత ఆలస్యం చేయకుండా ఆ భూమిని అంతిమ యజమానుల నుంచి కొన్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ వేగంగా జరిగిందని, అయితే పరిపూర్ణమైన పారదర్శక పద్ధతిలో జరిగిందని స్పష్టం చేసింది. 


ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకింగ్ చానల్స్ ద్వారా మాత్రమే జరగాలనేది ట్రస్ట్ దృఢ నిశ్చయమని తెలిపింది. చెక్కులు జారీ చేయడం, నగదు ఇవ్వడం వంటివి జరపరాదని నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే మందిరాలు, ఆశ్రమాలు వంటి మూడు, నాలుగు స్థలాలను రామాలయం కోసం కొన్నట్లు తెలిపింది. భవిష్యత్తులో కూడా మరికొన్ని భూములను కొంటామని తెలిపింది. 


గుడి/ఆశ్రమం/ప్రైవేటు ఆస్తిని కొన్నపుడు, అమ్మినవారికి పునరావాసం కల్పించేందుకు వారికి నచ్చిన చోట కొంత భూమిని ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయించినట్లు పేర్కొంది. వారి బిల్డింగ్స్ నిర్మాణానికి తగిన నిధులను కూడా సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ లావాదేవీలన్నిటికీ రికార్డులను నిర్వహిస్తున్నట్లు వివరించింది. 


గాటా నంబర్లు 242, 243, 244, 246లలోని భూమిని 1 కోటి రూపాయలకు ముగ్గురు వ్యక్తులకు అమ్మేందుకు నలుగురు వ్యక్తులు 2011 మార్చి 4న ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఈ ఒప్పందం మూడేళ్ళపాటు చెల్లుబాటులో ఉండేవిధంగా రాసుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందం 2014 మార్చి 4న రద్దయినట్లు తెలిపింది. 


పైన పేర్కొన్న నలుగురు వ్యక్తులు 2017 నవంబరు 20న పైన పేర్కొన్న నాలుగు గాటా నంబర్లలోని 2.334 హెక్టార్ల భూమిని రూ.2 కోట్లకు కుసుమ్ పాఠక్, హరీశ్ పాఠక్‌లకు సేల్ డీడ్ రిజిస్టర్ చేసినట్లు తెలిపింది. 


అదే భూమిని కుసుమ్, హరీశ్ 2017 నవంబరు 21న రూ.2.16 కోట్లకు ఇచ్ఛారామ్ సింగ్, జితేంద్ర కుమార్ సింగ్, రాకేశ్ కుమార్ సింగ్‌లకు అమ్మేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. 


ఈ ఒప్పందం 2019 సెప్టెంబరు 17న రద్దయినట్లు తెలిపింది. కుసుమ్, హరీశ్ ఈ భూమిని ఇచ్ఛారామ్ సింగ్, విశ్వప్రతాప్ ఉపాధ్యాయ్, మనీశ్ కుమార్, సుబేదార్, బలరామ్ యాదవ్, రవీంద్ర కుమార్ దూబే, సుల్తాన్ అన్సారీ, రషీద్ హుస్సేన్‌లకు రూ.2 కోట్లకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ ఒప్పందం మూడేళ్ళపాటు చెల్లుబాటయ్యే విధంగా రాసుకున్నట్లు తెలిపింది. 


2021 మార్చి 18న కుసుమ్, హరీశ్ గాటా నంబర్లు 243, 244, 246లలోని 1.2080 హెక్టార్ల భూమిని రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీలకు రూ.2 కోట్లకు అమ్మినట్లు తెలిపింది. సర్కిల్ రేటు వద్ద వాల్యుయేషన్ రూ.5.80 కోట్లు, స్టాంపు డ్యూటీ రూ.5.80 కోట్లు అని పేర్కొంది. 


అదే రోజు రవిమోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ ఆ భూమిని రామజన్మ భూమి ట్రస్ట్‌కు రూ.18.50 కోట్లకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రూ.17 కోట్లను బయానాగా ఆన్‌లైన్ లావాదేవీ ద్వారా చెల్లించినట్లు వివరించింది. 


సమాజ్‌వాదీ పార్టీ నేత ఆరోపణలతో వివాదం ప్రారంభం

సమాజ్‌వాదీ పార్టీ నేత తేజ్ నారాయణ్ పాండే ఆదివారం విలేకర్ల సమావేశంలో చేసిన ఆరోపణలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో శ్రీరామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ట్రస్టు ఓ భూమిని రూ.18.5 కోట్లకు మార్చి 18న కొనుగోలు చేసిందని, అంతకు 10 నిమిషాల ముందు అదే భూమిని రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ రూ.2 కోట్లకు కొన్నారని తెలిపారు. ఈ ట్రస్టు ఆర్‌టీజీఎస్ ద్వారా రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ బ్యాంకు ఖాతాకు రూ.17 కోట్లు పంపించిందని చెప్పారు. ఆర్‌టీజీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్‌పై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, అయోధ్య రామాలయం నిర్మాణానికి సేకరించిన విరాళాలు దుర్వినియోగమైనట్లు వార్తలు రావడంతో ప్రజల విశ్వాసం కంపించిందని అన్నారు. ఈ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు జరిపించి, దోషులను శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


ఈ ఆరోపణలను శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఖండించింది. ఈ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాట్లాడుతూ, ఇవన్నీ తప్పుదోవ పట్టించే, రాజకీయ విద్వేషంతో కూడిన ఆరోపణలని చెప్పారు. 


Updated Date - 2021-06-15T20:34:20+05:30 IST