దివ్యౌషధం!

ABN , First Publish Date - 2021-10-03T05:52:38+05:30 IST

అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదమే పరిష్కార మార్గంగా కొందరు సూచిస్తున్నారు. ఆకురసం తాగండి, చెట్లు వేర్లతో ఈ విధంగా చేయండి.. అంటూ సలహాలిస్తున్నారు.

దివ్యౌషధం!

పూర్వకాలపు ఔషధాలకు నేడు వైభవం

మూలికా వైద్యంపైనా ప్రజల ఆసక్తి

ఆయుర్వేదం, ప్రకృతి వైద్యానికి ఆదరణ

ప్రతి ఇంటిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ

వంటిల్లే ప్రయోగశాలలు

  

ఆ ఆకు తింటే అజీర్తి రాదు.. ఈ వేరు పాలల్లో కలుపుకొని తాగితే అసలు మధుమేహం దరిచేరదు.. ఈ మొక్క వాసన చూస్తే చాలు.. సకల రోగాలు మాయం అవుతాయి.. ఇటువంటివి ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇందుకు కరోనా తెచ్చిన మార్పు ఓ కారణమైతే.. ఆరోగ్యంపై ప్రజలకు శ్రద్ధ పెరగడం మరో కారణం.. సామాజిక మాధ్యమాలూ ఇందుకు తోడయ్యాయి. ఏ మొక్కలో ఏ గుణం ఉందో.. చూపిస్తున్నాయి. ప్రకృతి వైద్యం చేసేవారు కూడా పెరిగారు. ప్రజలు కూడా వీటిని ఆదరిస్తున్నారు. 


 గతంలో పిల్లలకు కడుపునొప్పి వస్తే వెంటనే వాము నీరు తాగించేవారు. ఇప్పుడు అది కార్పొరేట్‌ వైద్యంగా మారి.. బాటిళ్లలో దుకాణాల్లో లభ్యం అవుతోంది. మోకాళ్ల నొప్పులు వస్తే ఆస్పత్రికి వెళ్లేవారు.. ప్రకృతి వైద్యంలో ఏమైనా వాడి చూద్దామని ఆలోచిస్తున్నారు. 


 


గుంటూరు(సంగడిగుంట), సెప్టెంబరు2: అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదమే పరిష్కార మార్గంగా కొందరు సూచిస్తున్నారు.  ఆకురసం తాగండి, చెట్లు వేర్లతో ఈ విధంగా చేయండి.. అంటూ సలహాలిస్తున్నారు. మూలికా వైద్యానికి డిమాండ్‌ పెరిగింది. ప్రసార సాధనాల్లోనూ ఇలాంటి వైద్య విధానాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇవి శాస్ర్తీయబద్ధమైనవేనా.. అంటూ ఓ వర్గం వాదిస్తుండగా.. మన పూర్వీకులు ఇవే వాడేవారు కదా అంటూ కొంతమంది చెబుతున్నారు. ఇదేమీ నష్ట పరిచేది కాదుకదా.. ఖర్చు కూడా పెద్దగా ఉండదు.. వాడి చూద్దాం అనే భావన చాలామందిలో ఉంది. 

 

పెరిగిన ఔషధ దుకాణాలు..

గతంలో వీధుల్లో రకరకాల మూలికల ఔషధాలను విక్రయించేవారు. పల్లెల్లో అయితే దగ్గరిలోని చెట్ల నుంచి సేకరించి వాటిని వినియోగిస్తారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగిన మాట వాస్తవం. దీంతో పట్టణాల్లో దీనికి సంబంధించిన దుకాణాలు వెలిశాయు. గతంలో ఉన్న షాపులకు డిమాండ్‌ పెరిగింది. గుంటూరు నగరంలో ఒకప్పుడు నాలుగైదు డ్రైప్రూట్స్‌ షాపులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీధికొక్కటి వెలిశాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటి లభ్యత పెరిగింది. వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. 


 చిరుధాన్యాలపైనా ఆసక్తి

జంక్‌ఫుడ్‌ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే అవగాహన అందరికీ పెరిగింది. కరోనా కూడా వంటింటి వాతావరణాన్ని మార్చివేసింది. ఏ వంటలో ఏది కలుపుకొని తింటే ఏ వ్యాధికి పరిష్కారం లభిస్తుంది అనే దానిపై తెలుసుకుంటున్నారు. మల్టీగ్రెయిన్‌ పిండి పదార్ధాలు, ముడిబియ్యం, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు ఎక్కువ వినియోగంలోకి వచ్చాయి. కూరలు వండే విధానంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. దేనిలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి, శరీరానికి ఎంత అవసరమో కూడా తెలుసుకుంటున్నారు. నూనెల ప్రాధాన్యం తగ్గి, పచ్చి కూరగాయల వినియోగం పెరిగింది. 


వంట గదే ప్రయోగశాల..

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వంటగదిని ప్రయోగశాలగా మార్చేస్తున్నారు. ఆకుల కషాయంతో వ్యాధులు నయమవుతాయని తెలుసుకుని వాటిని వినియోగిస్తున్నారు. బొప్పాయి ఆకు, బచ్చలి ఆకు, మునగాకు.. కరక్కాయలు, తేనె..  ఇలా ఒకటేమిటి ప్రతిదీ అన్నిటికీ వంటింట్లో చోటిస్తున్నారు. 


పచారీ ఔషధాల ప్రాధాన్యం పెరిగింది.. 

 60 ఏళ్లుగా పచారి వ్యాపారంలో గుమస్తాగా, వ్యాపారస్తునిగా ఉంటున్నా. 30 ఏళ్ల క్రితం వరకు కొన్ని రకాల ఔషధాలకు ప్రాధాన్యం ఉంది. ఆ తర్వాత అల్లోపతి వైద్యం ప్రాచుర్యం చెందటంతో ఈ వ్యాపారంలో కొత్త వినియోగదారుల ఆదరణ లేదు. దీర్ఘకాలిక వ్యాధులకు కొన్నిరకాల మూలికల వైద్యం ప్రభావం చూపుతుందన్న నమ్మకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.  

Updated Date - 2021-10-03T05:52:38+05:30 IST