జిల్లాల్లో ఆయుష్‌ ఆస్పత్రులు

ABN , First Publish Date - 2022-03-20T08:29:09+05:30 IST

హైదరాబాద్‌ వాసులకే పరిమితమైన యోగా, పంచకర్మ, కప్లింగ్‌ థెరపీ లాంటి ‘ఆయుష్‌ వైద్య సేవలు’ త్వరలోనే అన్ని జిల్లాల్లోని ప్రజలకూ అందుబాటులోకి రానున్నాయి.

జిల్లాల్లో ఆయుష్‌ ఆస్పత్రులు

  • జిల్లా కేంద్రం ఆస్పత్రిలో 20 పడకలతో ఏర్పాటు
  • ఆయుర్వేదం, యోగా, యునానీ, 
  • నేచురోపతి, పంచకర్మ సేవలు
  • రాష్ట్రవ్యాప్తంగా 421 ఆయుష్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు 
  • మందుల అందజేత.. యోగా కోసం సిబ్బంది
  • ఒక్కో కేంద్రానికి రూ.10 లక్షలు విడుదల


హైదరాబాద్‌, మార్చి 19 (ఆంఽధ్రజ్యోతి): హైదరాబాద్‌ వాసులకే పరిమితమైన యోగా, పంచకర్మ, కప్లింగ్‌ థెరపీ లాంటి ‘ఆయుష్‌ వైద్య సేవలు’ త్వరలోనే అన్ని జిల్లాల్లోని ప్రజలకూ అందుబాటులోకి రానున్నాయి. అదీ పూర్తి ఉచితంగా! ప్రతి జిల్లాలో ఆయుష్‌ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు జిల్లా ఆస్పత్రుల్లోనే ఒక ప్రత్యేక విభాగంలో 20 పడకలతో వీటిని నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో 421 వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ (నామ్‌) పథకం కింద రూ.10 లక్షల చొప్పున నిధులను కూడా విడుదల చేశారు. ఈ నిధుల్లో మౌలిక వసతుల కోసం రూ.6 లక్షలు, మానవ వనరుల కోసం రూ.2 లక్షలు, మందుల కోసం రూ.2 లక్షలు వాడతారు. ఏటా ఈ నిధులను నామ్‌ విడుదల చేయనుంది.  ఆయుష్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్లో స్థానికులకు యోగాలో శిక్షణ ఇస్తారు. మందులనూ అందిస్తారు. ప్రతీ కేంద్రంలో ఓ వైద్యుడితో పాటు ఒకరిద్దరు యోగా చేయించే సిబ్బందిని, ఒక సహాయకుడిని నియమించనున్నారు.  


ప్రైవేటులో అయితే రూ.60-70వేలు

జిల్లా ఆయుష్‌ ఆస్పత్రుల్లో ఆయుర్వేదం, యోగా, యునానీ, నేచురోపతి కలగలిపిన వైద్యసేవలను ఉచితంగా అందించనున్నారు. కీలకమైన పంచకర్మ థెరపీ లాంటి వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు పంచకర్మ థెరపీని అందిస్తున్నాయి. ఇది బాగా ఖరీదైన వ్యవహారం. రోగిని బట్టి సెషన్స్‌ను నిర్ధారిస్తారు. 21 రోజులు ఒక సెషన్‌ ఉంటుంది. ఒక సెషన్‌ కింద కనీసం 8 రోజులు, ఎక్కువకు ఎక్కువ 21 రోజులు సేవలు అందిస్తారు. ఇందుకుగాను రూ.60-70 వేల వరకు బిల్లు వేస్తారు. పక్షవాతం, వెన్నునొప్పి, నడుంనొప్పి లాంటి వాటికి ఈ థెరపీ ద్వారా వైద్యసేవలందిస్తారు. శస్త్రచికిత్సలు చేయాల్సినవి కూడా దీని ద్వారా నయం చేయవచ్చునని ఆయుష్‌ వైద్యులు చెబుతున్నారు. ఇక పంచకర్మలో భాగంగా తైలధార కూడా ఉంటుంది. పంచకర్మతో పాటు యోగా కూడా రోగులచే చేయిస్తారు. నేచురోపతి ద్వారా డైట్‌ కౌన్సెలింగ్‌ ఇస్తారు. అలాగే యూనానిలోని కప్లింగ్‌ థెరపి(నొప్పులను తగ్గించడం కోసం), రెజిమెంటల్‌ థెరపీని కూడా జిల్లా ఆయుష్‌ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో పాటు హోమియోపతి వైద్య సేవలను కూడా అందించనున్నారు. 


రేపటి నుంచి క్షేత్రస్థాయి పర్యవేక్షణ  

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఆయుష్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయుష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి, నోడల్‌ అధికారి డాక్టర్‌ లింగరాజు  సోమవారం నుంచి అన్ని జిల్లాలకు వెళ్లనున్నారు. ముందుగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. వెల్‌నెస్‌ కేంద్రాలు నిబంధనల మేరకు ఏర్పాటు చేస్తున్నారా లేదా? అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించనున్నారు. 

Updated Date - 2022-03-20T08:29:09+05:30 IST