కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై.. ఒకప్పటి అతడి స్కూల్ మేట్ అయిన మహిళ సంచలన ఆరోపణలు చేసింది. అతడు తనను పదేళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ మీడియా సమావేశంలో పేర్కొంది. బాబర్ తనను పెళ్లి చేసుకుంటానని 2010లో హామీ ఇచ్చాడని, కానీ ప్రముఖ క్రికెటర్‌గా మారిన తర్వాత మాట తప్పాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. క్రికెట్‌లో అతడికి అంతగా పేరు లేని రోజుల్లో తాను అతడిని ఆర్థికంగా ఆదుకున్నట్టు పేర్కొంది.
అంతేకాదు, బాబర్ తనను శారీరకంగానూ వేధించాడని, పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడని పేర్కొంది. ‘‘అతడు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అతడి వల్ల గర్భం ధరించా. నన్ను కొట్టాడు. అతడు నన్ను బెదిరించాడు. నన్ను ఉపయోగించుకున్నాడు’’ అని పాకిస్థాన్ జర్నలిస్ట్ సజ్ సిద్ధిఖ్ విడుదల చేసిన వీడియోలో బాధిత మహిళ పేర్కొంది. బాబర్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో పాక్ క్రికెట్ బోర్డు అతడిని మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించింది.