బాబోయ్‌ దోమలు..!

ABN , First Publish Date - 2022-09-16T04:52:01+05:30 IST

జిల్లాలో ఇంటికొకరు జ్వరం బారిన పడతున్నారు. పదిహేనురోజులపాటు ఉండే ఈ వైరల్‌ ఫీవర్‌కు దోమ కాటే కారణంగా వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా డెంగ్యూ వ్యాప్తికి దోమలే ప్రధాన కారణం. అలాగే మలేరియా, ఇతర విషజ్వరాలు వాతావరణంతోపాటు దోమలూ కారకాలే. పట్టణాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఎక్కడి మురుగు అక్కడే నిలబడిపోయి దోమలు పెరిగి పోతున్నాయి.

బాబోయ్‌ దోమలు..!
ఒంగోలు నగర శివారు కాలనీలో ఇళ్ల మధ్య నిలిచి రంగుమారిన మురుగునీరు

పట్టణాలు అపరిశుభ్రమయం..!

ఎక్కడి మురుగు అక్కడే చేరి దుర్వాసన

నెలరోజులుగా ప్రతి ఇంటిలో జ్వర బాధితులు

ఫాగింగ్‌, ఆయిల్‌ స్ర్పే, బ్లీచింగ్‌ ఊసే లేదు

కనీస స్పందన లేని యంత్రాంగం

అంతటా చెత్తశుద్ధి కరువు 

ఒంగోలు  (కార్పొరేషన్‌), సెప్టెంబరు 15:


పట్టణాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. దోమల ఉత్పత్తికేంద్రాలుగా మారాయి. ప్రజారోగ్యం మెరుగు కోసం పెద్దపీట వేస్తున్నాం.. దోమలపై దండయాత్ర చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ పాలక పెద్దలు ప్రచార ఆర్భాటం చేస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. పట్టణాలు కంపుకొడుతున్నా పురపాలక సంఘాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కేవలం పెత్తనం చేసేందుకే ప్రాధాన్యమిస్తున్న పాలక వర్గాలు ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి. ప్రస్తుతం విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలోనూ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఫాగింగ్‌, ఆయిల్‌ స్ర్పే, బ్లీచింగ్‌ చేయడం లేదు. దోమల దాడులతో డెంగ్యూ, మలేరియా జ్వరాలు సోకుతూప్రజలు వణికిపోతున్నారు. ఖాళీస్థలాల్లో నీరు నిలవడంతో పాటు కాలువల్లో మురుగు కదలడం లేదు మొత్తంగా పరిస్థితి అధ్వానంగా ఉన్నా అధికార యంత్రాంగానికి దోమ కుట్టినట్టు కూడా లేదు.

 

 జిల్లాలో ఇంటికొకరు జ్వరం బారిన పడతున్నారు. పదిహేనురోజులపాటు ఉండే ఈ వైరల్‌ ఫీవర్‌కు దోమ కాటే కారణంగా వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా డెంగ్యూ వ్యాప్తికి దోమలే ప్రధాన కారణం. అలాగే మలేరియా, ఇతర విషజ్వరాలు వాతావరణంతోపాటు దోమలూ కారకాలే. పట్టణాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఎక్కడి మురుగు అక్కడే నిలబడిపోయి దోమలు పెరిగి పోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా జనాన్ని కుడుతున్నాయి. దోమకాటు నుంచి తప్పించుకోవడానికి ప్రజలు అక్షరాల లక్షలు ఖర్చుచేయాల్సి వస్తోంది. ఒంగోలు నగరంలో లక్షకుపైగా గృహాలు ఉండగా, లెక్కల ప్రకారం ఒంగోలు జనాభా 2.52 లక్షలు,  వారి రోజువారీ ఖర్చులతోపాటు ఖచ్చితంగా దోమల నియంత్రణకు సగటున రూ.20 నుంచి రూ.30 వరకు ఖర్చు చేస్తున్నారు.


ఇతర పట్టణాల్లోనూ ఇంతే..

జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి పట్టణాల్లో లక్ష 50 వేలు నివాస గృహాలు ఉన్నాయి. 3లక్షల 57 వేల 212మంది వరకు నివసిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రతి పట్టణంలోనూ అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. మురుగు కాలువలతో పాటు ఖాళీస్థలాల్లో నీరు నిలిచి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. పగలు, రేయి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా దోమల దాడులు చేస్తున్నాయి. వాటి నియంత్రణకు మార్కెట్‌లో లభించే టార్టాయిస్‌, జెట్‌, స్లీప్‌వెల్‌, గుడ్‌నైట్‌, మస్కిటో బ్యాట్‌లు ఇలా అన్నిరకాలుగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక్కో ఇంటికి తెలియకుండానే నెలకు రూ.500 నుంచి రూ.800ల వరకు ఖర్చు వస్తోంది. ప్రజారోగ్యం మెరుగు కోసం లక్షలు ఖర్చుచేస్తున్నామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో అదంతా ఉత్తదే అని తేలిపోయింది.  


ముందస్తు చర్యలేవి?

జిల్లాకేంద్రమైన ఒంగోలులో పరిస్థితి దారుణంగా ఉంది. ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితులు ఉన్నారు. అయితే అధికార యంత్రాంగానికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రతిరోజు ప్రధాన వీధులకే శుభ్రత పరిమితమైంది. లోపలి ప్రదేశాలను పట్టించుకోకపోవడంతో నివాస ప్రాంతాల్లో పారిశుధ్యం పడకేసింది.అయితే ఏళ్ల తరబడి ఉన్నటువంటిఅనేక సమస్యలను పక్కనపెడితే కళ్లముందు ఉన్నటువంటి ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లోని నీటినిల్వల గురించి పట్టించుకుంటే కొంతవరకు సమస్యను అధిగమించవచ్చు. గతంలో ప్రైవేటు స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు వేయడం వంటి చర్యలు ప్రస్తుతం కనిపించడం లేదు. దీంతో సంబంధిత యజమానులు సైతం వాటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. 


పట్టణాలు కంపుకొడుతున్నాయ్‌...

విషజ్వరాలను నివారించేందుకు ప్రతిరోజు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వ్యాధులు అఽధికంగా వ్యాప్తి చెందే ప్రాంతాలను గుర్తించిఆ ప్రాంతంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇంటి వాతావరణం, పరిసరాల పరిశుభత్ర, వ్యాధులపై అవగాహన కల్పించాలి. దాంతోపాటుగా ప్రతిరోజు కాలువల్లో మురుగు తొలగింపు, తడిచెత్త నిల్వ లేకుండా చూడాలి. ఖాళీప్రదేశాలు, కాలువల్లో మురుగునీటిపై ఆయిల్‌ స్ర్పే చేయాలి. మామూలు రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ ఈ కాలంలో నీటినిల్వల్లో గంబూషియా చేపలు విడుదల చేయాలి. దోమల నివారణకు అబెట్‌, పైరిథ్రిమ్‌, మలాథియన్‌ ద్రావణంతో ఫాగింగ్‌ చేయాలి. వాటితోపాటు ప్రతి వీధిలోనూ బ్లీచింగ్‌ చల్లాలి. కానీ ఇలాంటి చర్యలు జిల్లాలోని ఏ పట్టణంలోనూ తగు స్థాయిలో కనిపించడం లేదు.


యంత్రాంగం మొక్కుబడి చర్యలు

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమల వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం కావడంతోడెంగ్యూ, మలేరియా భయం వెంటాడుతోంది.మున్సిపల్‌ అధికారులు వార్డులో పర్యటించి, నీటి నిల్వలు లేకుండా చూడాలి. అలాగే ఇళ్ల మధ్య మురుగు కనిపించకుండా ఖాళీస్థలాల్లో చెత్తచెదారం లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. అంతేకాకుండా ప్రజలకు అవగాహన కోసం ర్యాలీలు, కరపత్రాలు పంపిణీ, వ్యాఽధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిపెట్టాలి. అయితే యంత్రాంగం ఆచరణను మరిచి కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.


కనీస చర్యలు కరువు

ఫాగింగ్‌ ద్వారా దోమలను అదుపుచేస్తున్నామని, వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవంలో మాత్రం ఎలాంటి పనులు జరగడం లేదంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఉపయోగించే సున్నం, బ్లీచింగ్‌ ఇతర రోజుల్లో కూడా ఉపయోగిస్తే బాగుంటుందని, అంతేకాకుండా దోమల నివారణకు శాశ్వత పరిష్కారంచూపాలని ప్రజలు కోరుతున్నారు. 


పట్టణాల్లో జనాభా

ఒంగోలు 2.52లక్షలు

మార్కాపురం 71,092  

గిద్దలూరు 35,150

కనిగిరి 37,420

చీమకుర్తి 30,279


నివాస గృహాలు 3.25 లక్షలకు పైనే

ప్రతి ఇంటిలో రోజూ దోమలకు ఖర్చుచేస్తుంది రూ.30పైనే

జిల్లాలో నెలకు జనం చేస్తున్న వ్యయం సుమారు రూ.కోటి

యంత్రాంగం ఖర్చుచేస్తుంది అంతంతమాత్రమే

 

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం:

-ఎన్‌.పిచ్చయ్య శానిటరీ సూపర్‌ వైజర్‌, ఒంగోలు

పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక దృష్టిసారించాం. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పదిహేను రోజులకొకసారి ఫాగింగ్‌ చేయడంతోపాటు, తడి, పొడి చెత్త వేరు చేయడం, వ్యర్థాలు నిల్వ లేకుండా చేస్తున్నాం. ఖాళీస్థల్లాలో నిల్వలపై స్థల యజమానులు స్పందించాల్సి ఉంది. వారు స్థానికంగా లేకపోవడం కొంత ఇబ్బందింగా ఉంది.




Updated Date - 2022-09-16T04:52:01+05:30 IST