Advertisement

అందర్నీ అమ్మేస్తాడు

Mar 6 2021 @ 03:50AM

జగన్‌కు భూములు, డబ్బు పిచ్చి..

ఉక్కుపై ఏ-1,ఏ-2 దొంగ నాటకాలు

పోస్కో ఏంటో కూడా తెలియదట!

ఓటుతో గుణపాఠం చెప్పాలి: చంద్రబాబు

విశాఖ రోడ్‌షోలో బాబు ఫైర్‌


విశాఖపట్నం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికలలో పోటీచేసే మా పార్టీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు. ఈ రాష్ట్రమేమైనా వీళ్ల అబ్బ సొత్తా?  వీళ్లను ఇలాగా విడిచిపెడితే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు. చివరకు ఆడబిడ్డలకు కూడా రక్షణ కరువవుతుంది. అరాచక పాలకులకు మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను కోరారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన పెందుర్తిలో రోడ్‌షో ప్రారంభించారు. పెందుర్తి, చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం జంక్షన్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘అరాచక పాలనను అంతమొందించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలి. అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలి.  అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి... బొబ్బిలి పులిలా గాండ్రించాలి.


ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడాలి’’ అని కోరారు. ఆంధ్రుల పోరాటాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏ-1, ఏ-2లు దొంగనాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘దక్షిణకొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీ తనకు తెలియదని సీఎం బుకాయించారు. పార్లమెంటులో మంత్రి సమాధానంతో అడ్డంగా దొరికిపోయారు. పోస్కోతో స్టీల్‌ప్లాంట్‌ నాన్‌బైండింగ్‌ ఒప్పందం బట్టబయలు కావడంతో వీరి కుట్రలు ప్రజలకు తెలిశాయి. ఉక్కు భూములను అమ్మేయడానికి ఎన్‌బీసీకి అఽధికారం ఇచ్చారు. నష్టాలను పూడ్చడానికి భూములు అమ్మేస్తామని చెప్పడంతో జగన్‌ అసలు స్వరూపం బయటపడింది’’ అని వ్యాఖ్యానించారు. భూములన్నా.. డబ్బులన్నా ఈ సీఎంకు పిచ్చి అని విమర్శించారు. ‘‘రాష్ట్ట్రంలో ఆస్తులను జగన్‌ అమ్మేస్తున్నారు. భవిష్యత్తులో అందరినీ అమ్మేస్తారు’’ అని మండిపడ్డారు. 


విశాఖకు ఏ-2 శని

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం నడుస్తోందనీ, ఏ, బీ, సీ, డీ పాలసీతో రాష్టా్ట్రన్ని దోచేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘సొంత చెల్లెల్ని రోడ్డున పడేసినవ్యక్తి, రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ‘‘ఈ ముఖ్యమంత్రి ఒక పిల్లకుంక. నా అనుభవం అంత లేదు నీ వయసు. నీ తండ్రే నన్నుచూసి భయపడేవాడు. ఆయన కంటే నేనే ముందు సీఎం అయ్యాను. ఎవరైనా మంచి చేసి ఓట్లు అడుగుతారు. కానీ జగన్‌ బ్యాచ్‌ బెదిరించి ఓట్లు అడుగుతున్నారు. ప్రశాంత విశాఖకు ఏ-2 శని పట్టింది. నెల్లూరులో ఉండాల్సిన ఈ వ్యక్తికి విశాఖలో ఏం పని? ఇక్కడ అరాచకాలకు, భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యక్తిని విశాఖ ప్రజలు తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


సింహాచలంపై నీ పెత్తనమేంటి?

సింహాచలం దేవస్థానంపై నీ పెత్తనమేమిటని జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నిలదీశారు. విజయనగరం రాజులు సింహాచలం స్వామికి వేల ఎక రాలు భూములు దానంగా ఇచ్చారని, ఆ వంశానికి చెందిన అశోక్‌గజపతిరాజును జగన్‌ ట్రస్టు చైర్మన్‌ పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. సింహాచలం భూములపై ఏ-1, ఏ-2ల కళ్లు పడ్డాయని, ఇప్పటికే కొన్నింటిని కబ్జా చేశారని ధ్వజమోత్తారు. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం వల్ల నష్టపోయిన 5వేల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం చేయలేదన్నారు. ఈ ప్రమాదంపై వేసిన కమిటీ నివేదిక ఏమైందన్నారు. విషప్రభావం దీర్ఘకాలం ఉంటుందని, శాశ్వత ప్రాతిపదికన వైద్యసహాయం అందించాలని తాము చెప్పామని, కానీ వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంతో లాలూచీ పడిందని చంద్రబాబు ఆరోపించారు. 


అప్పుడు ముద్దులు... ఇప్పుడు గుద్దులు...

నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలపై భారం పడిందని, వంట గ్యాస్‌ ధర పెరుగుతూనే ఉందని, పెట్రోల్‌ ధర త్వరలో సెంచరీకి చేరుకుంటుందని చంద్రబాబు అన్నారు. ఇసుక దొరకడంలేదని, ఒకవేళ దొరికినా ఆ రేటు చూసి సామాన్యులు వెనుకంజ వేస్తున్నారన్నారు. ఇసుక కొరతతో పనులు లేక 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అన్న క్యాంటీన్లను ఎత్తివేసి, నిరుపేదలు రూ.5కు కడుపునిండా అన్నం తినకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రూ.500 ఉన్న ఆస్తిపన్ను రూ.5,000 అవుతుందన్నారు. ఎన్నికల సమయం లో వాళ్లిచ్చే 500, వెయ్యి తీసుకుని ఓటేస్తే తరువాత పన్నులతో తీవ్రంగా నష్టపోతారని ప్రజలను ఉద్దేశించి అన్నారు. తన హయాంలో  పోలవరం పనులు 70శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు వీళ్లు పూర్తిచేయలేకపోయారని దుయ్యబట్టారు. జగన్‌ ఒక స్టిక్కర్‌, ఫేక్‌ సీఎం అని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులు పేరిట గుద్దులే.. గుద్దులే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.