YSRCP కోసం PK Team కొత్త వ్యూహం.. టార్గెట్‌ బాబు!

ABN , First Publish Date - 2021-10-28T07:27:36+05:30 IST

ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం! సోషల్‌ మీడియాలో లక్షల కొద్దీ ఖాతాలు సృష్టించి...

YSRCP కోసం PK Team కొత్త వ్యూహం.. టార్గెట్‌ బాబు!

  • ఈసారి జనంలోకి వెళ్లి ‘మౌత్‌ పబ్లిసిటీ’
  • చంద్రబాబు వయసైపోయింది!
  • గెలిస్తే వచ్చేది లోకేశే అనే ప్రచారం
  • టీడీపీవైపు జనం మొగ్గకుండా కొత్త అస్త్రం
  • వైసీపీ కార్యకర్తలకు వినూత్న శిక్షణ
  • ముందే గ్రహించిన టీడీపీ నాయకత్వం
  • చంద్రబాబే సీఎం అవుతారని స్పష్టీకరణ


టీకొట్టు దగ్గరో, రచ్చబండ దగ్గరో జనం పెట్టుకునే ముచ్చట్లలోకి ఒక అపరిచితుడు జొరబడతాడు. మెల్లగా రాజకీయాల ప్రస్తావన తెస్తాడు. ముందు... జగన్‌ను విమర్శిస్తాడు. అవతలి వారి మూడ్‌ను గమనిస్తాడు. ‘జగన్‌కు ఒక్క చాన్స్‌ ఇచ్చి తప్పు చేశాం. చంద్రబాబే మంచి నాయకుడు. ఆయన వల్లే రాష్ట్రం బాగుపడుతుంది. ఈసారి ఆయనే రావాలి’  అనే దిశగా చర్చ సాగితే మాత్రం... ఆ అపరిచితుడు గొంతు సవరించుకుంటాడు. ‘మీరు అన్నది నిజమే కావొచ్చు. కానీ... చంద్రబాబుకు వయసు పెరిగిపోయింది. ఈసారి ఎన్నికల్లో గెలిచినా ముఖ్యమంత్రిగా ఉండడు. ఆయన కుమారుడు లోకేశ్‌ను సీఎం చేస్తాడు!’ అని ఓ మాట అలా వదులుతాడు. మిగిలిన వాళ్లు ఒక ఆలోచనలో పడి... అదే మాట మరో పదిమందికి చెబుతారు! అసలు విషయం ఏమిటంటే... ఆ ‘అపరిచితుడు’ మరెవరో కాదు! వైసీపీ వారి వ్యూహకర్త బృందంలో సభ్యుడు! గతంలో సోషల్‌ మీడియా, తప్పుడు ప్రచారం అనే వ్యూహాన్ని అనుసరించిన ఆ బృందం ఈసారి నేరుగా జనంలోకి దిగి ‘మౌత్‌ పబ్లిసిటీ’ అనే మరో అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం! సోషల్‌ మీడియాలో లక్షల కొద్దీ ఖాతాలు సృష్టించి... తప్పుడు ప్రచారం చేయడం! సొంత మీడియాను ఉపయోగించుకుని అసలు విషయాలను వక్రీకరించడం!... అధికారంలోకి రావడానికి ఇలాంటి అనేక వ్యూహాలను అనుసరించిన వైసీపీ, ఈసారి అదనంగా ‘నోటి మాట’ ప్రచారం అనే కొత్త అస్త్రాన్ని కూడా ఉపయోగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుగుదేశం అనుమానిస్తోంది. ‘వైసీపీ వ్యూహకర్త’ ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) బృందం కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెబుతోంది.


నోటిమాటతో ప్రచారం..

‘‘రాష్ట్రవ్యాప్తంగా కొందరు వైసీపీ కార్యకర్తలకు పీకే బృందం శిక్షణ ఇస్తుంది. శిక్షణ తర్వాత వారు తమ ప్రాంతాల్లోనే నలుగురు గుమిగూడే చోటకు పనిగట్టుకుని వెళ్తారు. అవీ ఇవీ మాట్లాడుతూ రాజకీయాల ప్రస్తావన తెస్తారు. ముందు జగన్‌ ప్రభుత్వాన్ని తామే విమర్శిస్తారు. తర్వాత చర్చను చంద్రబాబుపైకి తిప్పుతారు. ఆయన వయసు అయిపోయిందని, ఈసారి టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రి కారని.. లోకేశ్‌ అవుతారని చెబుతారు. లోకేశ్‌ వస్తే లాభం లేదని.. మళ్లీ జగన్‌రెడ్డి వస్తేనే ప్రయోజనమని విశ్లేషిస్తారు. పీకే టీం ఆ వ్యూహాన్ని ఎంచుకుందని మాకు సమాచారం అందింది’’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు తెలిపారు.  పరిపాలనాదక్షుడిగా చంద్రబాబుకు ఉన్న పేరు ఇప్పటికీ బలంగానే ఉందని... మిగిలినవారు ఎంత నేలబారుగా వ్యవహరించినా ఆయన హుందాగా ఉంటారన్న అభిప్రాయం ఉందని చెప్పారు. ‘‘బాబుకు ఉన్న ఆ పేరుతో వైసీపీకి ఇబ్బందేనని పీకే టీం భావిస్తోంది. పాలనలో జగన్‌రెడ్డి విఫలమయ్యారని ప్రజలు భావిస్తే ప్రత్యామ్నాయంగా చంద్రబాబే కనిపిస్తారు. దానిని ఎలా ఆపాలన్నది  వ్యూహకర్తల ముందున్న పెద్ద సవాల్‌. అందుకే, ఈసారి టీడీపీ గెలిస్తే చంద్రబాబు కాకుండా లోకేశ్‌ సీఎం అవుతారనే తప్పుడు ప్రచారం జనంలోకి తేవాలని భావిస్తున్నారు’’ అని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశాంత్‌ కిశోర్‌ను జగన్‌ తన ఎన్నికల/రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. వైసీపీ వేదికలపైకి కూడా ఆయన్ను తీసుకొచ్చి పరిచయం చేశారు. ఆ ఎన్నికల్లో జగన్‌ విజయం సాధించడంతో పీకే టీఎం పేరు మార్మోగింది. తర్వాత పీకే వెళ్లిపోయారు. అయినా ఆయన బృందం ఇక్కడ కొనసాగుతోంది. అంతకుముందు ఒకే టీంగా ఉన్న తన బృందాన్ని పీకే ఇప్పుడు వేర్వేరు జట్లుగా విభజించారని.. అవి ఒకే సమయంలో అనేక రాష్ట్రాల్లో తమ ఖాతాదారులుగా ఉన్న పార్టీల కోసం పనిచేస్తాయని చెబుతున్నారు. పార్టీ పని కోసం మళ్లీ పీకే బృందం రంగంలోకి దిగబోతోందని ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ తరఫున పనిచేస్తున్న పీకే బృందానికి రిషికుమార్‌ అనే  వ్యక్తి సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  గత ఎన్నికల సమయంలో పీకే టీం ఆంధ్రలో సామాజిక మాధ్యమాలను విజయవంతంగా ఉపయోగించుకోగలిగింది. వాటి ప్రభావాన్ని తాము లోతుగా గమనించలేదని, అందుకే తిప్పికొట్టలేకపోయామని టీడీపీ నాయకత్వం కూడా విశ్లేషించుకుంది. గత అనుభవం నేపథ్యంలో ఈసారి టీడీపీ నాయకత్వం అప్రమత్తమైంది. పీకే టీం తరహా పోస్టులు సామాజిక మాధ్యమాల్లో కనిపించగానే ఇవి ఫలానా బృందం పని అని.. టీడీపీ సోషల్‌ మీడియా బృందాలు పోస్టులు పెడుతూ అలర్ట్‌ చేస్తున్నాయి. దీంతో పీకే టీం కూడా కొత్త ఎత్తుగడలను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నోటి మాట ద్వారా ప్రచారం చేయడం ఇందులో ఒకటి! దీనిని టీడీపీ ఎంత సమర్థంగా తిప్పి కొడుతుంది? ప్రతి వ్యూహాలు ఎలా రచిస్తుంది? అనేదే కీలకంగా మారింది.


జగన్‌ ప్రభుత్వంపై దాదాపు అన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అప్పు చేసి డబ్బులు పంచుతున్నారు తప్ప... అభివృద్ధి జాడ లేదని, తమకు పనులు కరువయ్యాయనే అభిప్రాయం కనిపిస్తోంది. ‘మళ్లీ చంద్రబాబు వస్తేనే మనకూ, రాష్ట్రానికీ మేలు జరుగుతుంది’ అనే అభిప్రాయం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ వాతావరణం టీడీపీకి సానుకూలంగా ఉపయోగపడకుండా ఉండాలంటే.. ఇప్పటినుంచే కొత్త వ్యూహాలు అమలు చేయాలని పీకే టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలంతా చంద్రబాబు హయాంతో నేటి పరిస్థితులను పోల్చుతున్న నేపథ్యంలో... ‘‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే.. గద్దెనెక్కేది చంద్రబాబు కాదు. ఆయన కుమారుడు లోకేశ్‌ అధికార పగ్గాలు చేపడతారు’’ అని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పీకే బృందం నిర్ణయించుకున్నట్లు వినవస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా కొందరు వైసీపీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి.. వారు రోడ్డు మీద నలుగురిలో మాట్లాడేలా చూడాలన్నది తాజా వ్యూహంగా చెబుతున్నారు.


బాబు నాయకత్వంలోనే!

వైసీపీ వ్యూహాన్ని గుర్తించిన టీడీపీ నాయకత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. చంద్రబాబు నాయకత్వంలోనే తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని, ఆయనే మళ్లీ సీఎం అవుతారని స్వయంగా లోకేశ్‌ చెబుతుండడం గమనార్హం.  ‘‘ఎవరు ఏం ప్రచారం చేసినా మా పార్టీలో ఈ విషయంపై స్పష్టత ఉంది. టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబే. జగన్‌ పాలన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. మళ్లీ వెలుగులు రావాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. మేం ప్రజలకు ఇదే చెబుతున్నాం. చంద్రబాబుది క్రమశిక్షణతో కూడిన జీవన శైలి. ఇటీవల పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి సమయంలో కూడా చంద్రబాబు 36 గంటలపాటు దీక్ష చేశారు. వేదికపై కట్టుకదలకుండా కూర్చునే శక్తి ఆయనకు ఉంది. అదే... జగన్‌ 12 గంటలు దీక్ష చేసినా దిండ్లు, పరుపులు వేసుకోవడం, అప్పటికీ రకరకాలుగా ఇబ్బంది పడటం జనం మరిచిపోలేదు’’ అని టీడీపీ ముఖ్యుడొకరు చెప్పారు.

Updated Date - 2021-10-28T07:27:36+05:30 IST