ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి

ABN , First Publish Date - 2022-08-16T08:34:38+05:30 IST

ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆందోళనకు దిగారు.

ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి
ప్రసూతి ఆస్పత్రి ముందు బైఠాయించిన బాధితులు - శిశువు మృతదేహం

వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆందోళన


తిరుపతి సిటీ, ఆగస్టు 15: ‘రెండ్రోజులుగా ఆరోగ్యంగా ఉన్న శిశువు గంట వ్యవధిలోనే అనారోగ్యానికి గురై ఎలా మృతి చెందుతాడు. దీనికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం’ అంటూ బాధితులు తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన మైథిలిని కాన్పు నిమిత్తం ఆమె భర్త మహేష్‌ నాలుగు రోజుల కిందట స్థానిక ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. శనివారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వైద్యులు సుఖ ప్రసవం చేయడంతో మగ బిడ్డ జన్మించాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆదివారం వార్డుకు మార్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మైథిలి బిడ్డకు పాలిచ్చి పడుకోబెట్టింది. ఆరు గంటలకు మళ్లీ బిడ్డకు పాలిచ్చేందుకు చూడగా శిశువు  స్పృహలో లేకపోవడాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పడంతో వారొచ్చి శిశువును అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లి గంట తర్వాత బయటకు వచ్చి చనిపోయాడంటూ మృతదేహాన్ని మైథిలి బంధువు కుసుమ చేతికి అందించారు. ఆమె మృతదేహాన్ని తీసుకుని ఆస్పత్రి బయట ఉన్న బిడ్డ తండ్రికి చెప్పారు. గంట ముందు కూడా ఆరోగ్యంగా ఉన్న తన బిడ్డ ఎలా మృతి చెందుతాడని మొదటి నుంచీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తన భార్య చెప్పినా వినిపించుకోకుండా ఇక్కడే ఉంచి తప్పు చేశానని వాపోయాడు. బిడ్డ పుట్టాక సిబ్బంది తప్ప వైద్యులెవరూ వచ్చి తల్లీబిడ్డలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. విషయం తెలుసుకున్న మహేష్‌ బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి వైద్యాధికారులు వారివద్దకొచ్చి సంఘటనపై విచారించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామనడంతో వారు ఆందోళన విరమించారు. 

Updated Date - 2022-08-16T08:34:38+05:30 IST