కన్నవారిని చేరిన ‘కామాక్షి’

ABN , First Publish Date - 2021-02-26T05:34:45+05:30 IST

తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప క్షణాల వ్యవధిలో కనిపించక పోవడంతో కన్నవాళ్లు కన్నీటి పర్యంతం అయ్యారు.

కన్నవారిని చేరిన ‘కామాక్షి’
చిన్నారి కామాక్షితో ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, చిత్రంలో పాప తల్లిదండ్రులు

కిడ్నాపర్ల అరెస్టు

చిన్నారి కేసును ఛేదించిన పోలీసులు 

కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

నామకరణం చేసిన ఎస్పీ



నెల్లూరు(క్రైం), ఫిబ్రవరి 25:

తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప క్షణాల వ్యవధిలో కనిపించక పోవడంతో కన్నవాళ్లు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి రోజుల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకుని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నగరంలోని ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ మీడియాకు వివరించారు. 


బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ గ్రామానికి చెందిన మణి శరవణకు భార్య సుమతి, కుమారుడు మల్లికార్జున, 8 నెలల కుమార్తె ఉన్నారు. మణిశరవణ జొన్నవాడ దేవస్థానం వద్ద చొప్పుల దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాత్రి పూట భార్యపిల్లలతో దేవస్థానం వద్దే నిద్రిస్తుంటాడు. ఇదేవిధంగా ఈ నెల 16వ తేదీ రాత్రి నిద్రిస్తుండగా పసిపాపను ఎవరో ఎత్తుకెళ్లారు. 17వ తేదీ తెల్లవారుజామున  మణి దంపతులు నిద్రలేచి చూసేసరికి వారి మఽధ్యలో పడుకున్న పాప కనిపించలేదు. దీంతో చుట్టూ గాలించినా ఫలితం లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాళెం సీఐ బీ సురేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన దర్యాప్తు ప్రారంభించారు. ఈ కిడ్నాప్‌ విషయం తెలుసుకున్న ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేయించారు. దేవస్థానం వద్ద గల సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. స్థానికంగా భిక్షాటన చేసుకునే వెంకట రమణమ్మ అనే మహిళ పసికందును ఎత్తుకుని వెళ్లినట్లు గుర్తించారు. ఆమె భర్త పెంచలయ్యను విచారించగా నిందితురాలు కొద్దిరోజులుగా ఎక్కడికో వెళ్లిందని, ఓ నెంబర్‌ నుంచి ఫోన్‌ చేస్తోందంటూ ఆ నెంబరును తెలియజేశాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ ఫోన్‌ నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు. కడప జిల్లా సాంబేవరం మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన దేరంగుల నాగజ్యోతి ఫోన్‌ నెంబరుగా గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చుట్టు పక్కల విచారించగా కిడ్నాప్‌నకు గురైన చిన్నారి అక్కడే ఉందని తెలుసుకున్నారు. నాగజ్యోతిని అదుపులోకి తీసుకుని చిన్నారిని సురక్షితంగా నెల్లూరుకు తీసుకువచ్చారు. నాగజ్యోతి కుమారుడు చనిపోవడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. నాగజ్యోతి-రమేష్‌ దంపతుల కుమారుడు కొన్నేళ్ల క్రితం విద్యుత్‌ షాక్‌తో మరణించాడు. ఆమెకు మళ్లీ సంతానం కలిగే అవకాశం లేకపోవడంతో చిత్తూరు జిల్లా కలకడ మండలం పాపిరెడ్డిపాళేనికి చెందిన సయ్యద్‌ సాబ్‌వలీని సంప్రదించింది. అతను నెల్లూరు జిల్లా బోగోలు మండలం కమ్మపాళెం గ్రామానికి చెందిన  వేగూరు మాలకొండయ్యను సంప్రదించాడు. వారిద్దరూ జొన్నవాడ దేవస్థానం వద్ద భిక్షాటన చేస్తున్న చంలంచర్ల వెంకట రమణమ్మను కలిశారు. పిల్లలను తెచ్చిస్తే రూ.50 వేలు ఇస్తామని ఆశ చూపారు. దీంతో మణి దంపతుల కుమార్తెను వెంకట రమణమ్మ  కిడ్నాప్‌ చేసి దేవస్థానం సమీపంలో ఉన్న నాగజ్యోతి, సయ్యద్‌ సాబ్‌వలీలకు అప్పగించింది. వారి వద్ద నగదు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాగజ్యోతి, సయ్యద్‌ సాబ్‌వలీ, మాలకొండయ్యను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్‌నకు పాల్పడిన వెంకట రమణమ్మ పరారీలో ఉందని, త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. కాగా, తమ బిడ్డను క్షేమంగా అప్పగించిన పోలీసులకు మణి దంపతులు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉండగా కామాక్షితాయి అమ్మవారి  ఆశీస్సులతో సురక్షితంగా దొరికిన చిన్నారికి తల్లిదండ్రుల సమ్మతితో ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ కామాక్షి అని నామకరణం చేశారు. నూతన వస్త్రాలను, ఆట వస్తువులను బహూకరించారు. ఈ కిడ్నాప్‌ కేసును ఛేదించిన రూరల్‌ డీఎస్పీ వై హరనాథ్‌రెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం సీఐ బీ సురేష్‌బాబు, ఎస్‌ఐ కే ప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌ఐ ఎస్‌ విశ్వనాథం, కానిస్టేబుళ్లు రమేష్‌, సురేష్‌, మురళీకృష్ణ, కిషోర్‌బాబు, పిచ్చిరెడ్డి, మాధవ్‌రెడ్డిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 

Updated Date - 2021-02-26T05:34:45+05:30 IST