అఫ్ఘాన్‌లో తప్పిపోయిన ఈ బాలుడు గుర్తున్నాడా? 5 నెలల తర్వాత దొరికాడు.. బాబు ఇప్పుడెలా ఉన్నాడంటే..!

ABN , First Publish Date - 2022-01-10T17:30:50+05:30 IST

గతేడాది ఆగస్టులో తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకోవడంతో వారి అరాచక పాలనలో ఉండలేమంటూ చాలా మంది పౌరులు ఆ దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

అఫ్ఘాన్‌లో తప్పిపోయిన ఈ బాలుడు గుర్తున్నాడా? 5 నెలల తర్వాత దొరికాడు.. బాబు ఇప్పుడెలా ఉన్నాడంటే..!

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది ఆగస్టులో తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకోవడంతో వారి అరాచక పాలనలో ఉండలేమంటూ చాలా మంది పౌరులు ఆ దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశ సరిహద్దుల వద్ద హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. కాబుల్ విమానాశ్రయానికి చేరుకునేందుకు అఫ్ఘాన్ పౌరులు భారీ సంఖ్యలో సరిహద్దుల వద్దకు చేరుకోవడంతో తాలిబన్ సైన్యాలు వారిని కంట్రోల్ చేసేందుకు విరుచుకుపడ్డాయి. దాంతో చాలామంది సైన్యాల నుంచి తప్పించుకునే క్రమంలో తమవారిని పొగొట్టుకున్నారు. అలా ఆగస్టు 19న రెండు నెలల కూడా నిండని ఓ బాలుడు కూడా తన తల్లిదండ్రుల నుంచి వేరు అయ్యాడు. ఆ బాలుడి పేరు సోహేల్ అహ్మది. ఆ బాలుడికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.


తన బాబు తనకు కావాలని ఆ తండ్రి అభ్యర్థించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది. దాంతో చాలా న్యూస్ ఏజెన్సీలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి కూడా. సరిహద్దు వద్ద గోడ దాటే క్రమంలో సోహేల్ అహ్మదిని ఓ అమెరికన్ సైనిక అధికారికి అతని తండ్రి అహ్మది అందిస్తున్న ఫొటో బాగా వైరల్ అయింది. కట్ చేస్తే.. ఐదు నెలల తర్వాత తప్పిపోయిన ఆ బాలుడి ఆచూకీ దొరకడం, వారి సంబంధికులకు అతడ్ని అందించడం జరిగిపోయింది. ఐదు నెలల తర్వాత కన్నకొడుకును చూసుకుని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అమెరికాలో ఉండే వారు ఎప్పుడెప్పుడు తమ కుమారుడ్ని ముద్దాడుతామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అసలు బాబు ఎలా దొరికాడు? ఈ ఐదు నెలలు ఎవరి దగ్గర ఉన్నాడు? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 


ఆగస్టు 19న జరిగిందిదీ..

ఆగస్టు 19న అహ్మది తన భార్య, పిల్లలతో కలిసి అమెరికా విమానం ఎక్కేందుకు కాబుల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కానీ, అప్పటికే విమానాశ్రయం బయట భారీ సంఖ్యల జనాలు ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు వీల్లేదు. దాంతో ఎయిర్‌పోర్టు ప్రహరీ గోడ ఎక్కి చాలామంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి గోడ నిల్చొని ఉన్న అమెరికన్ బలగాలు సహకరిస్తున్నాయి. అహ్మది కూడా తన భార్య, పిల్లలను తీసుకుని గోడ వద్దకు చేరుకున్నాడు. మొదట రెండు నెలల సోహేల్ అహ్మదిని గోడపై ఉన్న ఓ అమెరికన్ అధికారికి అందించాడు. ఆయన తీసుకుని బాబును లోపల ఉన్నవారికి అందించేశారు. అలా బాబు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే తాలిబన్ బలగాలు ఎయిర్‌పోర్టుకు రావడంతో అక్కడి జనాలు ఒక్కసారిగా చెల్లచెదురు అయ్యారు. అంతే.. అహ్మది కూడా తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ, అప్పటికే సోహేల్ లోపలికి వెళ్లిపోయాడు. దాంతో ఆయనకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఫ్యామిలీని ఇంటి వద్ద దిగబెట్టి మళ్లీ అక్కడి వచ్చాడు. ఎలాగోలా విమానాశ్రయం లోపలికి వెళ్లి బాబు కోసం వాకాబు చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో సోహేల్ కోసం అహ్మది అభ్యర్థించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఆ తర్వాతి రోజు తప్పిపోయిన సోహేల్ ఫొటోతో చాలా న్యూస్ ఏజెన్సీలు వార్తలను ప్రచురించాయి. కొద్దిరోజుల తర్వాత అహ్మది తన భార్య పిల్లలతో కలిసి టెక్సాస్ వెళ్లిపోయారు. 


ట్యాక్సీ డ్రైవర్‌కు దొరికిన సోహేల్ అహ్మది..

ఇక విమానాశ్రయంలో ఒంటరిగా ఏడుస్తున్న సోహేల్‌ను చూసిన హమీద్ సఫీ అనే ట్యాక్సీ డ్రైవర్ తనతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోయాడు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉండడంతో సోహేల్‌ను తన కుమారుడిగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా ఐదు నెలలు గడిచిపోయాయి. అయితే, ఇటీవల తన ముగ్గురు కుమార్తెలతో పాటు సోహేల్ ఫొటోలను హమీద్ ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆ ఫొటోలను చూసిన అతని ఇరుగుపొరుగు వారు సోహేల్‌ను గుర్తు పట్టారు. ఐదు నెలల కింద సోహేల్ ఫొటోలతో ప్రచురితమైన కథనాలు వారికి గుర్తుకు వచ్చాయి. దాంతో వారు కామెంట్ల రూపంలో హమీద్‌ను పిల్లోడి గురించి ఆరా తీశారు. అలా ఈ విషయం ఆ నోటా ఈ నోటా అహ్మది అత్తగారికి చేరింది. అహ్మది మామ మహ్మద్ ఖసేం రజ్వీ ఫేస్‌బుక్ ద్వారానే హమీద్‌కు సోహేల్ తమ మనవడు అని, తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరారు. కానీ, దానికి హమీద్ ససేమీరా అన్నాడు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించి తన మనవడిని హమీద్ కిడ్నాప్ చేశాడంటూ కేసు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన తాలిబన్ పోలీసులు ఈ విషయంలో కలుగజేసుకుని హమీద్‌కు రూ.70వేల పరిహారం ఇప్పించి, బాబును రజ్వీకు అప్పగించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న టెక్సాస్‌లో ఉన్న అహ్మది ఆనందానికి అవధుల్లేవు. వీడియో కాల్ ద్వారా బాబును చూసుకుని కుటుంబం మొత్తం సంతోషం చిందులేసింది. సోహేల్ వారి వద్దకు వెళ్లడమే తరువాయిగా మిగిలింది. ఇలా సోహేల్ కథ సుఖాంతమైంది.   

Updated Date - 2022-01-10T17:30:50+05:30 IST