హప్త హిందూ... సప్త సింధు... ఇండ్‌

ABN , First Publish Date - 2022-08-05T05:30:00+05:30 IST

వేద కాలం నాటి భాష గురించి, ఇతర ప్రాంతాల్లోని భాషలతో దానికి ఉన్న సంబంధం గురించీ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. దీనివల్ల వేదాల

హప్త హిందూ... సప్త సింధు... ఇండ్‌

వేద కాలం నాటి భాష గురించి, ఇతర ప్రాంతాల్లోని భాషలతో దానికి ఉన్న సంబంధం గురించీ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. దీనివల్ల వేదాల నేపథ్యంపై మరింత అవగాహన కలుగుతుంది. 


ఉత్తర సిరియాకు చెందిన ‘హిట్టైట్లు’ అనే వారికీ, ఉత్తర మెసపొటేమియా (ఈనాటి ఇరాక్‌)లోని ‘మితాని అనే తెగకు మధ్య ఒక ఒప్పందం కుదిరిందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఒప్పందానికి సాక్షులుగా దేవుళ్ల పేర్లను పేర్కొన్నారు. ఆ పేర్లలో ‘ఇందర’ (ఇంద్ర), ‘మిత్రస్‌’ (మిత్ర), ‘నసతీ యన్న’ (‘నాసత్య’ అంటే ఋగ్వేదంలో అశ్వినీ దేవతలు), ‘ఉరువస్‌’ (వరుణ) లాంటివి కనిపిస్తాయి. ఇరానియన్లు అంటే జొరాస్ట్రియన్లు. వారిని ‘పారశీకులు’ అంటారు. వారి పవిత్ర గ్రంథమైన ‘జెండా అవెస్తా’లోనూ, అలాగే ఋగ్వేదంలోనూ ఈ దేవుళ్ళ పేర్లు కనిపిస్తాయి. అవెస్తాలో వాడిన భాష, ఇండో ఇరానియన్‌ భాషలు... ఈ రెండిటికీ అతి దగ్గర సంబంధం ఉంది. రెండూ ఒకే పూర్వీకుల భాష నుంచి వచ్చాయి. 


జరూ తృష్ట రచించినదిగా భావిస్తున్న అవెస్తా భాషలోని ‘హా’ శబ్దం ఋగ్వేదంలో ‘స’ గా మారింది. దీని ప్రకారం రెండు భాషల మధ్య తేడాను సూచించాలంటే... అవెస్తాలోని ‘హో మా’ శబ్దం ‘సోమా’గాను, ‘దాహ’ అనే శబ్దం ‘దాస’ గాను, ‘హప్త హిందూ’ అనే శబ్దం లేదా పదం ‘సప్తసింధు’గాను, ‘అహుర’ అనే శబ్దం ‘అసుర’గాను మారాయి. ఎందుకంటే ఇరానియన్లు... అంటే జొరాస్ట్రియన్లు... ‘స’కారాన్ని ‘హ’కారంగా పలుకుతారు. 


ఆ తర్వాత మన దేశానికి వచ్చిన గ్రీకులు ‘స’కారాన్ని పలకలేరు. వారు ‘స’కారాన్ని ‘అ’కారంగా పలుకుతారు. అవేస్తాలోని ‘హప్త హిందూ’... ఋగ్వేద కాలానికి ‘సప్త సింధు’గా మారి, గ్రీకుల కాలానికి... సింధు కాస్తా ‘ఇండ్‌’ అయ్యింది. సింధు నాగరికతను అందుకే ‘ఇండస్‌ వ్యాలీ సివిలైజేషన్‌’ అని పిలుస్తారు. ఆ ‘ఇండ్‌’ అనే శబ్దమే  తర్వాతి కాలంలో ఇండియా అయ్యింది. 


ఋగ్వేదంలో విశ్వంతుని కుమారుడైన, పితరుల దేవత యముడు. అవెస్తాలో ‘వివాన్‌ హ్వంతు’ని కుమారుడైన ‘యమ’తో సమానం. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే వేదంలోని యజ్ఞం... అవెస్తాలో ‘యశ్న’ అన్న దానికి సమానం. ఈ యజ్ఞాన్ని నిర్వహించే పురోహితుడి వైదిక నామం ‘హొత్రీ’ లేదా ‘హొతార్‌’. అవెస్తాలో ఇది ‘జోతార్‌’ అనే పదంతో సమానం. ‘వేదం’లో సూక్తాలు వల్లించడాన్ని ‘మంత్రాలు’ అంటారు. అవెస్తాలో ‘మంధ్రాలు’. సోమరసాన్ని సేవించడానికి సంబంధించిన ‘సోమ’ అనే పదాన్ని ‘ఓ మా’ అంటారు. అగ్నిని పూజించడం అటు అవెస్తాలోనూ, వేదంలోనూ ఉన్నది. అగ్నిని గౌరవించడం ఈ రెండిటి ఉమ్మడి సంప్రదాయంలో బలంగా ఉంది. అగ్ని వైదిక పురోహితుడిని ‘అధర్వణ’ అని పిలిస్తే, అవెస్తాలో ‘అత్ర వాన్‌’ అంటారు.


అవెస్తాలో గాని, ఋగ్వేద కాలంలో కానీ విగ్రహారాధన లేదు. దీనికి భిన్నంగా వేద కాలానికి ముందుదైన సింధు నాగరికతలో విగ్రహారాధన ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రధానంగా జంతురూప దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. పురాతన ఇండో-ఆర్యన్‌ భాషలు మాట్లాడే ప్రజలు... సింధు ప్రాంతానికి తమ భాషను, క్రతువులను, కర్మకాండలను, సాంఘిక సంప్రదాయాలను తీసుకువచ్చారు. సింధు ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకొని, స్థానిక ప్రజలతో కలిసి పోయారు. అప్పుడు మధ్య ఆసియాలో ప్రవేశించిన గుర్రాలు, రథాలు... పశ్చిమ ఆసియా ప్రజలకు క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల నాటికే సుపరిచితాలు. దీనిని బట్టి ఇండో-ఆర్యన్‌ భాష మాట్లాడే వారు... వారి క్రతువులతో పాటు గుర్రాలను కూడా ఒకేసారి భారతదేశానికి పరిచయం చేశారు. ఋగ్వేదానికి పూర్వం... అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటి సింధు నాగరికతకి చెందిన హరప్పా నగరంలో దొరికిన అనేక ముద్రికల (సీళ్లు) మీద ఉన్న లిపిని చదవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ... ఇంతవరకు ఆ లిపిని పరిష్కరించడం జరగలేదు. అది చదవగలిగితే ఆనాటి పరిస్థితులను మరింత అర్థం చేసుకోగలం.


పి.బి.చారి

9704934614

Updated Date - 2022-08-05T05:30:00+05:30 IST