టీకాల కాకి లెక్కలను ఎంతో కాలం దాచలేరు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-11-27T23:55:14+05:30 IST

దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో కనిపించిన కొత్త కోవిడ్-19 రూపాంతరం

టీకాల కాకి లెక్కలను ఎంతో కాలం దాచలేరు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో కనిపించిన కొత్త కోవిడ్-19 రూపాంతరం ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఒమిక్రాన్ రూపాంతరం తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశం ఉందని, మన దేశంలో కోవిడ్-19 టీకాకరణపై కాకి లెక్కలను ఎంతో కాలం మరుగుపరచడం సాధ్యం కాదని అన్నారు. 


రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, కొత్త కోవిడ్-19 రూపాంతరం ఒమిక్రాన్ చాలా తీవ్రమైనదని పేర్కొన్నారు. మన దేశ ప్రజలకు టీకాలు ఇచ్చి భద్రత కల్పించడం గురించి భారత ప్రభుత్వం శ్రద్ధవహించవలసిన సమయమిదని తెలిపారు. వ్యాక్సినేషన్‌పై కాకి లెక్కలను ఓ వ్యక్తి ఫొటో చాటున ఎక్కువ కాలం దాచిపెట్టలేరన్నారు. ఈ ట్వీట్‌తో పాటు ఓ మీడియా కథనాన్ని జత చేశారు. మన దేశంలో టీకాలు తీసుకోవడానికి అర్హుల్లో పూర్తిగా రెండు మోతాదుల కోవిడ్-19 టీకాలు తీసుకున్నవారు 31.19 శాతం మంది అని ఈ కథనం పేర్కొంది. గత వారం వ్యాక్సినేషన్ యావరేజ్ రేటు రోజుకు 6.8 మిలియన్లు అని పేర్కొంది. దేశ జనాభాలో 60 శాతం మందికి పూర్తిగా వ్యాక్సినేషన్ చేయాలంటే రోజుకు సగటున 23.3 మిలియన్ల డోసులను పంపిణీ చేయవలసి ఉంటుందని పేర్కొంది. 


కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 121 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శనివారం ఉదయం ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరులను సమీక్షించారు. 


Updated Date - 2021-11-27T23:55:14+05:30 IST