దొడ్డు అన్నం.. పాడైపోయిన కోడిగుడ్లు..

ABN , First Publish Date - 2021-04-18T04:58:13+05:30 IST

దొడ్డు అన్నం.. పాడయిన ఉడికిన కోడిగుడ్లు.. రెండు రోజుల ముందే చేసిన చపాతీలు.. ఇవి కరోనా రోగులకు ఇచ్చే మెనూ..

దొడ్డు అన్నం.. పాడైపోయిన కోడిగుడ్లు..
నాణ్యత లేని భోజనం

- ఇదీ ఐసోలేషన్‌ కేంద్రాల్లో కరోనా రోగుల భోజన మెనూ

- భోజనం చేయడానికి అవస్థలుపడుతున్న బాధితులు

- ఫుడ్‌ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దొడ్డు అన్నం.. పాడయిన ఉడికిన కోడిగుడ్లు.. రెండు రోజుల ముందే చేసిన చపాతీలు.. ఇవి కరోనా రోగులకు ఇచ్చే మెనూ.. కరోనా బారిన పడినవారికి ప్రత్యేక వైద్యం అందించేందుకు సుల్తానాబాద్‌ టీబీ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి వస్తున్న రోగులకు చికిత్స ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే వారికి భోజనాలు, ఇతరత్రా ఆహారాన్ని అందిస్తున్నది. ఈ ఆహారాన్ని అందించేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్న కాంట్రాక్టర్‌ నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తుండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆ భోజనాలను తిన్న రోగులు వాంతులు చేసుకున్నారు. నాణ్యత లేని ఆహారంతో రోగం మరింత పెరిగి పోతున్నదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైరస్‌ ఉధృతి పెరిగిన రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు గాను ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్‌లో గల టీబీ ఆసుపత్రిలో 42 పడకలను, గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో 30 పడకలను, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికుల కోసం 82 పడకలను ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రులకు వస్తున్న వారికి ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్నారు. కరోనా సోకిన రోగులంతా మొదట హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నప్పటికీ, రెండు రోజుల తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ పెరుగుతుండడంతో ఆర్థికంగా ఉన్న వాళ్లు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళుతున్నారు. ఆర్థికంగా లేని వాళ్లు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాలకు వెళుతున్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగులకు బయట నుంచి ఆహారాన్ని అనుమతించడం లేదు. ఇతరత్రా వ్యాధులు సోకి గోదావరిఖని, పెద్దపల్లి, మంథని ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు ప్రతి రోజు ఉదయం వేళలో టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలు ఆహారాన్ని అందించేందుకు గాను ఫుడ్‌ కాంట్రాక్టును ఇస్తున్నారు. 

భోజనంలో నాణ్యతలోపం..

కాంట్రాక్టు దక్కించుకున్న వాళ్లు ఒప్పందం మేరకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. సుల్తానాబాద్‌ టీబీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స ఇస్తున్నందున దీని నిర్వహణ బాధ్యతను పెద్దపల్లి ఆసుపత్రికి అందించారు. ఇక్కడి ఫుడ్‌ కాంట్రాక్టరే సుల్తానాబాద్‌లో చేరే కరోనా రోగులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఉదయం వేళలో టిఫిన్‌ ఇస్తున్న కాంట్రాక్టర్‌ మధ్యాహ్నం, రాత్రి వేళలో ఆకుకూర, పప్పు, సాంబారుతో పాటు రెండు పూటలా రెండు చొప్పున ఉడికిన కోడిగుడ్లను ఇస్తున్నారు. అయితే ఈ ఆహారం నాణ్యతగా లేదని రోగులు చెబుతున్నారు. దొడ్డు బియ్యంతో వండిన అన్నం, పాడై పోయిన కోడిగుడ్లను ఉడకబెట్టి పెంకులు తీయకుండానే ఆహారాన్ని రోగులకు సరఫరా చేస్తున్నారు. తినే సమయంలో ఆహార పొట్లాలను విప్పి చూసి రోగులు విస్తుపోతున్నారు. కోడిగుడ్ల పెంకులు తీస్తే అవిసిపోయి ఉంటున్నాయని, నల్లటి ద్రవం వెలువడుతున్నదని, మురిగిపోయిన వాసన వస్తున్నదని చెబుతున్నారు. కూరలు కూడా నీళ్లు నీళ్లు ఉంటున్నాయని, చపాతిలు కూడా బాగా ఉండడం లేదని, ఒక రోజు ముందే చేసి ఫ్రిడ్జ్‌లో భద్రపరిచిన చపాతిలను పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఆ ఆహారాన్ని తినలేక బయటపడవేస్తున్నారు. తమ ఇళ్లకు ఫోన్‌ చేసి ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. ఈ విషయమై సంబంధిత వైద్య శాఖాధికారులకు చెప్పినా కూడా అదే ఆహారాన్ని పంపిస్తున్నారని చెబుతున్నారు. కరోనా బారినపడిన రోగులకు ఇలాంటి ఆహారం ఇస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని నాణ్యతగల ఆహారాన్ని అందించాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-04-18T04:58:13+05:30 IST