ఇది ప్రజాస్వామ్యానికి చెడు సంకేతం: Sachin pilot

ABN , First Publish Date - 2022-06-15T23:01:41+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తుంటే ఎలాంటి కారణాలు లేకుండా తనను అరెస్టు..

ఇది ప్రజాస్వామ్యానికి చెడు సంకేతం: Sachin pilot

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తుంటే ఎలాంటి కారణాలు లేకుండా తనను అరెస్టు చేయడం, కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లోకి పోలీసులు బలవంతంగా చొచ్చుకుపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మండిపడ్డారు. ఇది ''ప్రజాస్వామ్యానికి చెడు సంకేతం'' అని అన్నారు. నరోలి పోలీస్ స్టేషన్‌లో తనను ఉంచినట్టు చెప్పిన సచిన్...కారణం చెప్పకుండా తమను నిర్బంధించారని అన్నారు.


''ప్రతిపక్ష నేతలు ఎవరూ కూడా తన పని చేయకుండా అడ్డుకోవడమే ప్రభుత్వం, పోలీసుల లక్ష్యంగా ఉంది. పార్టీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝళిపించడం గతంలో ఎన్నడూ జరగలేదు'' అని సచిన్ పైలట్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లలేదంటూ పోలీసులు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలీసులు కథలు అల్లుతున్నారని అన్నారు. ''అసలు పోలీసులు ఎలా విపక్ష పార్టీ (కాంగ్రెస్) కార్యాలయంలోకి ప్రవేశించి కార్యకర్తలను చితకబాదుతారు? ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదు'' అని ఆయన మండిపడ్డారు. పోలీస్ బస్సు నుంచి ఆయన వీడియో స్టేట్‌మెంట్ ఇస్తూ, పార్టీ కార్యాలయంలోకి వెళ్తుంటే తనను అడ్డుకున్నారని, ఇది ప్రజాస్వామానికి చెడు సంకేతమని అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. న్యాయం కోసం తాము పోరాటం సాగిస్తూనే ఉంటామని చెప్పారు. కాగా, రాహుల్ గాంధీని ఈడీ వరుసగా మూడోరోజు కూడా ప్రశ్నిస్తుండటంపై నిరసనలు కొనసాగిస్తున్న సుమారు 800 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బుధవారంనాడు నిర్బంధించారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ అరెస్టులు చేశారు.


బీజేపీ ప్రైవేటు సైన్యం: కార్తి చిదంబరం

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు చొచ్చుకుపోవడం, అక్కడి కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులు బీజేపీ ప్రైవేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు పార్టీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకుపోతున్న వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.



Updated Date - 2022-06-15T23:01:41+05:30 IST