గ్రేటర్‌కు గడ్డుకాలం!

ABN , First Publish Date - 2021-08-18T05:53:21+05:30 IST

మహా విశాఖ..

గ్రేటర్‌కు గడ్డుకాలం!

రాష్ట్ర ప్రభుత్వ గల్లాపెట్టెలోకి జీవీఎంసీ ఆదాయం  

స్టాంప్‌ డ్యూటీ, ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే ఆస్తి పన్ను, బీపీఎస్‌ సొమ్మంతా సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలో జమ

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వని ప్రభుత్వం

మొత్తం రూ.420 కోట్లు వరకూ ఉంటుందని అంచనా

కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని దైన్య స్థితిలో నగర పాలక సంస్థ

పలుమార్లు అధికారుల లేఖలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు వేర్వేరు మార్గాల్లో వచ్చే ఆదాయమంతా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో వుండే కాంప్రహెన్సివ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌ఎంఎస్‌) ఖాతాకు చేరిపోతోంది. అక్కడి నుంచి ఏ నెలకు ఆ నెల తిరిగి జీవీఎంసీకి ఖాతాకు రావాల్సి ఉంది. అయితే గత ఏడాది ఏప్రిల్‌ నుంచి నిధుల రాక నిలిచిపోయింది. దీంతో జీవీఎంసీ సాధారణ ఖర్చులకు సైతం డబ్బుల్లేక విలవిల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


జీవీఎంసీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంటులతోపాటు ఆస్తి పన్ను, స్టాంప్‌ డ్యూటీ, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు ద్వారా ఆదాయం వస్తుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టులే కాకుండా జీవీఎంసీ ఏటా రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులకు సాధారణ నిధుల నుంచి రూ.400 కోట్లు వరకూ ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇవికాకుండా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జీతాల కోసం ఏటా రూ.12 కోట్లు, జీవీఎంసీ భవనాలు, వాటర్‌ పంప్‌హౌస్‌లు, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లకు విద్యుత్‌ బిల్లుల కింద రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.  అలాగే జీవీఎంసీ అధికారులు, ఇతర వాహనాలకు పెట్రోలు, డీజీల్‌కు ఏటా రూ.50 కోట్లు, వాటర్‌ కెనాల్‌ నిర్వహణ, వాటర్‌ ప్యూరిఫికేషన్‌, వాహనాల మరమ్మతు కోసం రూ.150- రూ.200 కోట్లు...ఇలా ఏటా రూ.700 కోట్లు వరకూ ఖర్చులు అవుతుంటాయి. ఇందుకు ఆస్తి పన్ను ద్వారా వచ్చే రూ.320 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ ద్వారా వచ్చే రూ.150 కోట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు, బీపీఎస్‌ ద్వారా వచ్చే రూ.వంద కోట్లు, వాటర్‌ చార్జీల ద్వారా వచ్చే రూ.70 కోట్లను వెచ్చిస్తుంటుంది. అయితే నిధుల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల కిందట సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాను ఏర్పాటుచేసింది. జీవీఎంసీకి ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను చెల్లించినట్టయితే ఆ మొత్తం నేరుగా సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు వెళుతుంది. అలాగే రిజిస్ర్టేషన్‌ శాఖ ద్వారా స్టాంప్‌ డ్యూటీ, భవన నిర్మాణాలకు అనుమతుల కోసం కట్టే ఫీజులు వంటివన్నీ సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు వెళతాయి. అక్కడ నుంచి ప్రతి నెలా జీవీఎంసీ పీడీ ఖాతాకు చేరతాయి.


కాంట్రాక్టర్లకు బిల్లులు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు వంటి ఖర్చుల కోసం పీడీ ఖాతా నుంచి డబ్బులను జీవీఎంసీ అధికారులు డ్రా చేస్తుంటారు. నెలకు రూ.15 కోట్లు వరకూ సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి జీవీఎంసీకి విడుదలైతే అందులో రూ.పది కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపునకు కేటాయించేవారు. అయితే గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి జీవీఎంసీకి డబ్బులు రావడం లేదు. దీంతో నగర పాలక సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు 2019 అక్టోబరు నుంచి  పెండింగ్‌లో ఉండిపోయాయి. అలాగే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలను సకాలంలో చెల్లించడానికి కూడా ఆపసోపాలు పడాల్సి వస్తోంది.


సీఎఫ్‌ఎంఎస్‌లో రూ.420 కోట్లు పెండింగ్‌

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ జీవీఎంసీకి రావాల్సిన నిధులు రూ.420 కోట్లు ప్రభుత్వం వద్ద వుండిపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. స్టాంప్‌ డ్యూటీ కింద ప్రతి నెలా సగటున రూ.12 కోట్లు జీవీఎంసీకి సమకూరుతుంది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి స్టాంప్‌ డ్యూటీ కింద రావాల్సిన సుమారు రూ.250 కోట్లు సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలో  ఉండిపోయింది. అలాగే ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను చెల్లిస్తే ఆ మొత్తం నేరుగా సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు చేరిపోతోంది. ఇలా గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సుమారు రూ.30 కోట్లు వరకూ పెండింగ్‌లో ఉండిపోయింది. గత ఏడాది అమలుచేసిన బీపీఎస్‌ పథకంతోపాటు భవన నిర్మాణాలకు అనుమతుల రూపంలో సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు చేరిన రూ.వంద కోట్లు కూడా జీవీఎంసీ ఖాతాకు చేరాల్సి ఉంది. దీనికితోడు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.40 కోట్లు కూడా సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉండిపోయాయి. జీవీఎంసీకి రావలసిన నిధులను విడుదల చేయాలంటూ అధికారులు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోతోంది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించేసినట్టు తెలుస్తోంది.


రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసింది...

స్టాంప్‌ డ్యూటీ రూ.250 కోట్లు

బీపీఎస్‌, బిల్డింగ్‌ పర్మిషన్‌ ఫీజులు రూ.100 కోట్లు

విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ రూ.40 కోట్లు

ఆన్‌లైన్‌లో చెల్లించిన ఆస్తి పన్ను రూ.30 కోట్లు

Updated Date - 2021-08-18T05:53:21+05:30 IST