లక్ష్మీనగర్‌ కాలనీలో మురుగు కంపు

ABN , First Publish Date - 2022-01-26T17:32:48+05:30 IST

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ 23వ డివిజన్‌లోని లక్ష్మీనగర్‌ కాలనీని మురుగు సమస్య పట్టి పీడిస్తోంది. కాలనీలో నిర్మించిన డ్రైనేజీ లైన్‌కు అవుట్‌లెట్‌ లేకపోవడంతో మురుగునీరు...

లక్ష్మీనగర్‌ కాలనీలో మురుగు కంపు

అవుట్‌లెట్‌ లేకపోవడంతో రోడ్డుపై నీరు

దుర్గంధం, దోమల వ్యాప్తితో స్థానికుల అవస్థలు


హైదరాబాద్/సరూర్‌నగర్‌: బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ 23వ డివిజన్‌లోని లక్ష్మీనగర్‌ కాలనీని మురుగు సమస్య పట్టి పీడిస్తోంది. కాలనీలో నిర్మించిన డ్రైనేజీ లైన్‌కు అవుట్‌లెట్‌ లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే పారుతోంది. మొదట్లో కాలనీకి దిగువన గల వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకు అవకాశం ఉండడంతో కొన్నాళ్ల పాటు పరిస్థితి బాగానే ఉంది. ఇటీవల తమ పొలం మొత్తం దుర్గంధభరితం అవుతున్నదంటూ యజమానులు డ్రైనేజీ ప్రవాహానికి అడ్డంగా మట్టి పోయడంతో పరిస్థితి దారుణంగా మారింది.


రెండు కాలనీల ప్రజలకు ఇబ్బందులు

డ్రైనేజీ నీరు పొలాలోకి వెళ్లకుండా రైతులు మట్టి పోశారు. దాంతో లక్ష్మీనగర్‌ నుంచి వచ్చే మురుగు నీరంతా ఎస్‌బీఆర్‌ కాలనీలోని విల్లీ వాటర్‌ ప్లాంట్‌ వద్ద నిలిచి మడుగుగా తయారయింది. ఇక్కడి రెండు రోడ్లలోని నివాస గృహాలకు ఇబ్బందికరంగా మారింది. డ్రైనేజీ నీరు భూమిలోకి ఇంకి.. ఇళ్లలోని బోర్లలోకి వెళ్తోందని స్థానికులు వాపోతున్నారు. బోరు నుంచి వస్తున్న నీళ్లు రంగు మారి దుర్వాసన వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నిల్వ ఉండడం వల్ల దుర్గంధం వెదజల్లుతూ దోమలు, ఇతర క్రిములు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


దోమలతో సావాసం

డ్రైనేజీ నీరు మొ త్తం రోడ్డుపైనే నిలుస్తుంది. దుర్వాసన, దోమలతో సావాసం చేయాల్సి వస్తోంది. డ్రైనేజీ వేసినప్పుడే అవుట్‌లెట్‌ గురించి కూడా ఆలోచించి ప్రణాళిక తయారు చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు మురుగు మొత్తం తెచ్చి ఒక్కచోట చేర్చడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.

- కిషన్‌గౌడ్‌, లక్ష్మీనగర్‌ కాలనీ


వారం రోజుల్లో పూర్తి చేస్తాం

లక్ష్మీనగర్‌, ఎస్‌బీఆర్‌ కాలనీల్లో అవుట్‌లెట్‌ లేనందున డ్రైనేజీ సమస్య తలెత్తిన మాట వాస్తవమే. ఇటీవల అక్కడి మురుగును గల్ఫర్‌ మిషన్‌తో క్లీన్‌ చేయించాం. అయినా వారం రోజుల్లోనే మళ్లీ సమస్య ఉత్పన్నమవుతోంది. మేయర్‌, అధికారులతో చర్చించి సాయిప్రభు హోమ్స్‌లోని మ్యాన్‌హోల్‌ వరకు ప్లాస్టిక్‌(హెచ్‌డీపీఈ) పైపు ఏర్పాటు చేసి పంపింగ్‌ చేయించడానికి చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో ఆ పనులు పూర్తి చేస్తాం. 

-ఆర్‌.సంతోషీశ్రీనివా్‌సరెడ్డి, 23వ డివిజన్‌ కార్పొరేటర్‌

Updated Date - 2022-01-26T17:32:48+05:30 IST