బ్యాడ్మింటన్‌ సూపర్ పవర్

ABN , First Publish Date - 2022-05-19T06:02:24+05:30 IST

ఇప్పటిదాకా వ్యక్తిగత విజయాలతో మెరిసిన భారత బ్యాడ్మింటన్‌లో ఇప్పుడు సమష్టి కృషితో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

బ్యాడ్మింటన్‌ సూపర్ పవర్

ఇప్పటిదాకా వ్యక్తిగత విజయాలతో మెరిసిన భారత బ్యాడ్మింటన్‌లో ఇప్పుడు సమష్టి కృషితో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌లో పురుషుల జట్టు ఛాంపియన్‌గా అవతరించి షటిల్‌ క్రీడలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అప్పుడెప్పుడో నలభై మూడేళ్ల క్రితం సయ్యద్‌ మోదీ, ప్రకాశ్‌ పదుకోన్‌లాంటి దిగ్గజాలతో కూడిన భారత జట్టు సెమీస్‌ చేరడమే ఈ టోర్నీలో మనకున్న అత్యుత్తమ ప్రదర్శన. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇన్నాళ్లకు మన బృందం విజేతగా నిలిచి అందరి కలలను నిజం చేసింది. మన షట్లర్లు సాధించిన ఈ ఘనత, 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో కపిల్‌ సేన విజయానికి సమానం అని సునీల్‌ గవాస్కర్‌, పుల్లెల గోపీచంద్‌లాంటి క్రీడా దిగ్గజాలు వ్యాఖ్యానించడం.. ఈ విజయానికున్న ప్రత్యేకతను తెలియజేస్తోంది. కప్పు గెలిచారన్న వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆటగాళ్లతో ఫోన్‌లో సంభాషించి వారి ప్రతిభాపాటవాలను కీర్తించడం విశేషం.


థామస్‌ కప్‌లో పోటీపడ్డ భారత జట్టులో మొత్తం పదిమంది ఆటగాళ్లుంటే వీరిలో నలుగురు తెలుగువారు ఉండడం మనకు గర్వకారణం. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌, గరగ కృష్ణ ప్రసాద్‌ జట్టు చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు.


ఈ టోర్నీకి ముందు భారత జట్టులో ఒక్కో ఆటగాడిది ఒక్కో పరిస్థితి. లక్ష్యసేన్‌ కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురవగా, కిడాంబి శ్రీకాంత్‌ గాయం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్నాడు. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కొన్నాళ్లుగా ఫామ్‌లోనే లేడు. అయినా కూడా అంచనాలను దాటి, అడ్డంకులను అధిగమించి భారత పురుషుల జట్టు అద్భుతమే చేసింది. ఈ చారిత్రక విజయంలో జట్టులోని ప్రతి ఆటగాడు వీరోచితంగా పోరాడాడు. శ్రీకాంత్‌ తానాడిన ఐదు మ్యాచుల్లోనూ గెలవగా, కీలకమైన ఫైనల్‌ పోరులో లక్ష్యసేన్‌, ప్రణయ్‌ స్థాయికి మించి సత్తా చాటారు. డబుల్స్‌లో స్టార్‌ షట్లర్లుగా విరాజిల్లుతున్న సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి తుది సమరంలో ఓ గేమ్‌ ఓడినా పట్టు విడవకుండా పోరాడి ఫలితాన్ని రాబట్టారు. టోర్నీ ఆరంభానికి ముందే భారత జట్టులోని ఆటగాళ్లంతా ‘కప్పును ఇంటికి తీసుకొద్దాం’ అన్న పేరుతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను తయారు చేసుకున్నారు. ప్రతి క్షణం ఇందులో స్ఫూర్తి నింపే సందేశాలను షేర్‌ చేసుకుంటూ ప్రోత్సహించుకున్నారు. లీగ్‌ దశలో జర్మనీ, కెనడా జట్లను ఓడించిన భారత ఆటగాళ్లు.. క్వార్టర్స్‌లో ఐదుసార్లు విజేత మలేసియాపై, సెమీస్‌లో మాజీ విజేత డెన్మార్క్‌పై, ఫైనల్లో పద్నాలుగుసార్లు ఛాంపియన్‌ ఇండోనేసియాపై విజయం సాధించిన తీరు సర్వదా ప్రశంసనీయం.


తొలిసారిగా 1980లో ప్రకాశ్‌ పదుకోన్‌ ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన ఇరవయ్యేళ్ల తర్వాత 2001లో పుల్లెల గోపీచంద్‌ మళ్లీ ఆ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా భారత బ్యాడ్మింటన్‌లో పరిస్థితులు గొప్పగా లేవు. కానీ, గోపీచంద్‌ శిక్షకుడిగా మారాక షటిల్‌ క్రీడలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గోపీ శిష్యరికంలో సైనా సాధించిన విజయాలు దేశంలో బ్యాడ్మింటన్‌కు గుర్తింపు తీసుకొచ్చాయి. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకంతో మెరవడంతో షటిల్‌కు ఆదరణ పెరిగింది. గోపీ శిక్షణలో రాటుదేలిన పీవీ సింధు 2016 రియో విశ్వక్రీడల్లో రజతం సాధించడంతో బ్యాడ్మింటన్‌ మరో స్థాయికి ఎదిగింది. ఇతర ఆటల అభిమానులు కూడా షటిల్‌ క్రీడను అనుసరిస్తూ, ప్రపంచంలో ఏ టోర్నీలో పాల్గొన్నా మన షట్లర్ల ఫలితాలు తెలుసుకోవడంపై దృష్టి సారించారు. మొన్నటిదాకా టోర్నీల్లో మెయిన్‌ డ్రాలో చోటు దక్కించుకోవడమే కలగా ఉన్న మన షట్లర్లు, ఇప్పుడు టాప్‌ ర్యాంకుల్లో నిలుస్తూ ప్రధాన టోర్నమెంట్లలో సత్తా చాటుతున్నారు. థామస్‌ కప్‌లాంటి ఈవెంట్లలో ఛాంపియన్లుగా ఆవిర్భవిస్తున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో మన రాకెట్‌ సూపర్‌ పవర్‌గా ఎదుగుతోందనేందుకు ఈ అంశాలే నిదర్శనం. ఇప్పటి ఆటగాళ్ల ప్రదర్శన భవిష్యత్‌లో వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఈ సంచలనాత్మక విజయం మున్ముందు బ్యాడ్మింటన్‌లో విశేష అభ్యున్నతికి బాటలు పరచడం ఖాయం.

Updated Date - 2022-05-19T06:02:24+05:30 IST